Wednesday, 11 October 2017

సెప్టెంబర్ 2017 స్పోర్ట్స్

బెల్జియం ఓపెన్ చాంప్ వైష్ణవి బెల్జియం ఓపెన్ అండర్-19 మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ వైష్ణవి రెడ్డి విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 24న జరిగిన ఫైనల్లో రెండోసీడ్ వైష్ణవి 21-19, 17-21, 21-12తో టాప్ సీడ్, వివియన్ సందోర్ఘాజీని ఓడించి చాంపియన్‌గా అవతరించింది. 
మరోవైపు ఇథియోపియా అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత్‌కు చెందిన అర్జున్-రామచంద్రన్ శ్లోక్ జోడీ విజేతగా నిలిచింది. టాప్‌సీడ్‌గా బరిలోకి దిగిన అర్జున్ జంట ఫైనల్లో 21-6, 21-19తో జోర్డాన్‌కు చెందిన బహర్డీన్ అహ్మద్-మహ్మద్ నసీర్‌లపై అలవోక విజయం సాధించింది. 


‘పద్మభూషణ్’కు ధోని పేరుని నామినేట్ చేసిన బీసీసీఐదేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరును బీసీసీఐ నామినేట్ చేసింది. ధోని కెప్టెన్సీలో భారత జట్టు 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్‌ను సాధించింది. ధోని వన్డేల్లో దాదాపు పది వేల పరుగులు చేయడంతోపాటు 90 టెస్టులు ఆడాడు. 
గతంలో కపిల్‌దేవ్, సునీల్ గావస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, చందూ బోర్డే, దేవధర్, సీకే నాయుడు, లాలా అమర్‌నాథ్, రాజా భళీంద్ర సింగ్, విజయ ఆనంద్ ‘పద్మభూషణ్’ పురస్కారం అందుకున్నారు. 


‘పద్మభూషణ్’కు పీవీ సింధు పేరు ప్రతిపాదన 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును కేంద్ర క్రీడా శాఖ దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మభూషణ్’ కోసం ప్రతిపాదించింది. 2015లోనే ఆమె పద్మశ్రీ పురస్కారం పొందింది. 
వరుసగా రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2013, 2014) సింధు కాంస్యాలు సాధించింది. 2016లో చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్, ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్‌లను గెలుచుకుంది. 2017 ఆగస్టులో గ్లాస్గో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజత పతకం.. సెప్టెంబర్‌లో కొరియా ఓపెన్ రూపంలో కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే మూడుసార్లు మకావు ఓపెన్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఈ ఏడాది భారత్‌లో జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. 


జపాన్ ఓపెన్ విజేతలు మరిన్, అక్సెల్‌సన్జపాన్ ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ సింగిల్స్ విభాగంలో కరోలినా మరిన్ (స్పెయిన్), విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్) విజేతలుగా నిలిచారు. సెప్టెంబర్ 24న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఒలింపిక్ చాంపియన్, ఐదోసీడ్, మరిన్ 23-21, 21-12తో డిఫెండింగ్ చాంపియన్, ఆరోసీడ్ హే బింగ్ జియావో (చైనా)పై విజయం సాధించి టైటిల్ కైవసం చేసుకుంది. 
పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, మూడోసీడ్, అక్సెల్‌సన్ 21-14, 19-21, 21-14తో ప్రపంచ మాజీ నం.1, ఏడోసీడ్, లీ చోంగ్ వీ (మలేసియా)పై విజయం సాధించాడు. 
పురుషుల డబుల్స్ విభాగంలో మూడోసీడ్, ఇండోనేసియా ద్వయం, మార్కస్ ఫెర్నాల్డి గిడియోన్-కెవిన్ సంజయ విజేతలుగా నిలిచింది. మహిళల డబుల్స్‌లో స్థానిక ద్వయం, టాప్‌సీడ్, మిసాకి మతుటొమో-అయాకా తకహషి టైటిల్‌ను కై వసం చేసుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో చైనీస్ జోడీ, వాంగ్ యిల్వ్-హువాంగ్ డోంగ్‌పిన్ విజేతగా నిలిచింది. 


ఆసియా ఇండోర్ క్రీడల్లో సౌరవ్ కొఠారికి స్వర్ణం ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ సౌరవ్ కొఠారి స్వర్ణం సాధించాడు. సెప్టెంబర్ 25న జరిగిన బిలియర్డ్స్ సింగిల్స్ ఫైనల్లో సౌరవ్ కొఠారి 3-1 (100-80, 101-0, 29-101, 101-88) ఫ్రేమ్‌ల తేడాతో ప్రపంచ బిలియర్డ్స్ మాజీ చాంపియన్ ప్రప్‌రుట్ చైతనాసకున్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించాడు. ఈ క్రీడల్లో క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) విభాగంలో భారత్‌కిది తొలి పతకం.
టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ రజత పతకం సాధించాడు. ఫైనల్లో విష్ణువర్ధన్-ప్రార్థన తొంబారే (భారత్) ద్వయం 7-5, 4-6, 2-6తో నటనన్ కద్‌చాపనాన్-నిచా లెర్ట్‌పితాక్‌సిన్‌చాయ్ (థాయ్‌లాండ్) జంట చేతిలో ఓడిపోయింది. 
 

మిథాలీరాజ్‌పై బయోపిక్భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్‌పై వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ బయోపిక్‌ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ సంస్థ నుంచి ఇప్పటికే భాగ్ మిల్కా భాగ్ (మిల్కాసింగ్‌పై), మేరీకామ్ సినిమాలు వచ్చాయి. మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ ప్రస్తుతం అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా కొనసాగుతోంది. వన్డేల్లో 6 వేల పరుగులతో పాటు వరుసగా ఏడు అర్ధ సెంచరీలు చేసిన తొలి మహిళా క్రికెటర్‌గానూ ఖ్యాతికెక్కింది. అలాగే 2005, 2017 వన్డే ప్రపంచకప్‌లలో భారత జట్టును ఫైనల్స్‌కు చేర్చిన కెప్టెన్‌గా నిలిచింది.
బాలీవుడ్‌లో ఇప్పటికే అథ్లెట్ మిల్కాసింగ్, బాక్సర్ మేరీకామ్, క్రికెటర్లు ధోని, అజహరుద్దీన్, సచిన్ టెండూల్కర్‌లపై చిత్రాలు రాగా... బ్యాడ్మింటన్ స్టార్స్ సింధు, సైనా నెహ్వాల్, మహిళా క్రికెటర్ జులన్ గోస్వామిలపై చిత్రాలు కూడా వరుసలో ఉన్నాయి. 


ఆసియా ఇండోర్ క్రీడల్లో విష్ణు-జయ్‌కి స్వర్ణం ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ విష్ణువర్ధన్ పురుషుల డబుల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. సెప్టెంబర్ 26న జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో విష్ణువర్ధన్-విజయ్ నటరాజన్ (భారత్) ద్వయం 6-3, 6-4తో డెనిస్ యెవ్‌సెయెవ్-తిముర్ (కజకిస్తాన్) జంటపై విజయం సాధించింది. మహిళల డబుల్స్ విభాగంలో అంకిత రైనా-ప్రార్థన తొంబారే (భారత్) జోడీకి రజత పతకం లభించింది. ఫైనల్లో అంకిత-ప్రార్థన జంట 6-3, 3-6, 6-7 (5/7)తో తమాచాన్-వరుణ్య (థాయ్‌లాండ్) ద్వయం చేతిలో ఓడిపోయింది. 


152 మంది 'టాప్' అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకంలో భాగంగా ఉన్న 152 మంది అథ్లెట్లకు ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి నెలకు రూ. 50 వేల చొప్పున ‘పాకెట్‌మనీ’గా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అభినవ్ బింద్రా నేతృత్వంలోని ఒలింపిక్ టాస్క్ ఫోర్స్ ఈ 152 మంది పేర్లను ప్రతిపాదించింది. 2017 సెప్టెంబర్ 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర ప్రకటించింది. 


ఐటీఎఫ్ మహిళ టోర్నీలో ప్రాంజల జోడీకి టైటిల్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి యడ్లపల్లి ప్రాంజల, భారత్‌కే చెందిన జీల్ దేశాయ్ ద్వయం డబుల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫెనల్లో ప్రాంజల-జీల్ దేశాయ్ ద్వయం 6-2, 7-5తో రుతుజా భోస్లే (భారత్)-అలెగ్జాండ్రా వాల్టర్స్ (ఆస్ట్రేలియా) జంటపై గెలుపొందింది. ఈ ఏడాది ప్రాంజలకిది రెండో డబుల్స్ టైటిల్. గత జూన్‌లో ఔరంగాబాద్‌లో జరిగిన టోర్నీలో జియావోజి జావో (చైనా)తో కలిసి ప్రాంజల తొలి టైటిల్‌ను నెగ్గింది. 
డబుల్స్‌లో ఓడినప్పటికీ... సింగిల్స్‌లో రుతుజా భోస్లే విజేతగా నిలిచింది. ఫైనల్లో రుతుజా 6-4, 2-6, 7-5తో హువా చెన్ లీ (చైనీస్ తైపీ)పై గెలిచింది. 


10 ఏళ్లలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ భారత్ 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికి చేరుకుంటుందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది. 7 లక్షల కోట్ల డాలర్ల విలువ గల ఆర్థిక వ్యవస్థగా అవతరించి జపాన్, జర్మనీలను అధిగమించి ముందుకు వెళుతుందని అంచనా వేసింది. అదే సమయంలో జర్మనీ ఆర్థిక వ్యవస్థ 6 లక్షల కోట్ల డాలర్లు, జపాన్ ఆర్థిక వ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్లుగా ఉంటుందని నివేదికలో పేర్కొంది. 
2015-16 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 2.3 లక్షల కోట్ల డాలర్లతో ప్రపంచంలో ఐదో స్థానంలో ఉంది. 
 

కొరియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత పీవీ సింధుదక్షిణ కొరియాలోని సియోల్‌లో జరిగిన కొరియా ఓపెన్ సూపర్ సీరీస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పూసర్ల వెంకట సింధు సొంతం చేసుకుంది. ఈ మేరకు ప్రపంచ చాంపియన్, తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్)తో 83 నిమిషాలపాటు జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు 22-20, 11-21, 21-18తో విజయం సాధించింది. విజేతగా నిలిచిన సింధుకు 45 వేల డాలర్ల (రూ. 28 లక్షల 83 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
సింధు కెరీర్‌లో ఇది మూడో సూపర్ సిరీస్ టైటిల్. గతంలో ఆమె చైనా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ (2016), ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ (2017)లో టైటిల్స్ గెలిచింది. 
 

సింగపూర్ గ్రాండ్ ప్రీ విజేత లూయిస్ హామిల్టన్ సింగపూర్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడీస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 17న జరిగిన రేసుని హామిల్టన్ 2 గంటల 45 ని.008 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానం పొందగా, వాల్టెరి బొటాస్ (మెర్సిడెజ్) మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఐదు, ఈస్టెబన్ ఒకాన్ పదో స్థానం సాధించారు.
ఈ సీజన్ గ్రాండ్ ప్రీలలో హామిల్టన్‌కు ఇది హ్యాట్రిక్ విజయం. ఇంతకముందు ఇటలీ, బెల్జియం గ్రాండ్‌ప్రిలలోను హామిల్టన్ విజేతగా నిలిచాడు. 

ఆసియా ఇండోర్, మార్షల్ ఆర్ట్స్ క్రీడల్లో భారత్‌కు స్వర్ణాలుఆసియా ఇండోర్, మార్షల్ ఆర్‌‌ట్స క్రీడల్లో సెప్టెంబర్ 19న భారత అథ్లెట్స్ రెండు స్వర్ణాలు, ఒక కాంస్య పతకం సాధించారు. పురుషుల 5000 మీటర్ల రేసులో గోవిందన్ లక్ష్మణన్... మహిళల 1500 మీటర్ల రేసులో పీయూ చిత్ర పసిడి పతకాలను సొంతం చేసుకోగా... బెల్ట్ రెజ్లింగ్‌లో ధర్మేందర్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. లక్ష్మణన్ 8 నిమిషాల 2.30 సెకన్లలో గమ్యానికి చేరుకొని అగ్రస్థానాన్ని పొందాడు. చిత్ర 4 నిమిషాల 27.77 సెకన్లలో రేసును పూర్తి చేసి విజేతగా నిలిచింది. బెల్ట్ రెజ్లింగ్ 70 కేజీల విభాగం సెమీఫైనల్లో అనామిరదోవ్ (తుర్క్‌మెనిస్తాన్) చేతిలో ధర్మేందర్ ఓడిపోయి కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 


కామన్‌వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో దీక్షితకు స్వర్ణంకామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో జూనియర్ మహిళల 58 కేజీల విభాగంలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ లిఫ్టర్ ఎర్ర దీక్షిత స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. మహబూబాబాద్ జిల్లాలోని మానుకోట పట్టణానికి చెందిన దీక్షిత స్నాచ్‌లో 73 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 94 కేజీలు బరువెత్తి ఓవరాల్‌గా 167 కేజీలతో పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. యూత్ బాలుర 62 కేజీల విభాగంలో ముత్తుపాండి రాజా స్వర్ణం, జూనియర్ పురుషుల విభాగంలో రజతం గెలిచాడు. సీనియర్ మహిళల 58 కేజీల విభాగంలో సరస్వతి రౌత్ కాంస్యం నెగ్గింది. యూత్ బాలుర, జూనియర్ పురుషుల 69 కేజీల విభాగంలో దీపక్ లాథెర్ రెండు స్వర్ణాలు, సీనియర్ పురుషుల విభాగంలో కాంస్యం సాధించాడు. మొత్తంగా చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్ 6న జరిగిన వివిధ ఈవెంట్లలో భారత లిఫ్టర్లు 10 పతకాలు సొంతం చేసుకున్నారు. 
2019 కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. 

కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో వెంకట్ రాహుల్‌కు రెండు స్వర్ణాలు కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ ఒకే రోజు రెండు స్వర్ణాలు సాధించాడు. సెప్టెంబర్ 7న జరిగిన సీనియర్, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాలలో బరిలోకి దిగిన రాహుల్ రెండు విభాగాల్లోనూ స్నాచ్‌లో 156 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 195 కేజీల బరువెత్తి ఓవరాల్‌గా 351 కేజీలతో విజేతగా నిలిచి రెండు స్వర్ణ పతకాలను దక్కించుకున్నాడు. ఈ ప్రదర్శనతో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ గేమ్స్‌కు రాహుల్ అర్హత సాధించాడు. 


భారత హాకీ జట్టు చీఫ్ కోచ్‌గా జియోర్డ్ మరీజినేభారత మహిళల హాకీ జట్ట్టు కోచ్‌గా ఉన్న జియోర్డ్ మరీజినేను పురుషుల సీనియర్ జట్టు కోచ్‌గా ఎంపిక చేస్తు హాకీ ఇండియా సెప్టెంబర్ 8న నిర్ణయం తీసుకుంది. నెదర్లాండ్‌‌సకు చెందిన మరీజినేకు గతంలో ఏ పురుషుల సీనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన అనుభవం లేదు. 
కొన్ని నెలలుగా హాకీ జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెదర్లాండ్‌‌సకే చెందిన రోలంట్ ఓల్ట్‌మన్‌‌సను కోచ్ పదవి నుంచి హాకీ ఇండియా ఇటీవల తొలగించించింది. మరోవైపు జూనియర్ టీమ్ కోచ్‌గా ఉన్న హరేంద్ర సింగ్‌ను మరీజినే స్థానంలో మహిళల సీనియర్ జట్టు హై పెర్ఫామెన్‌‌స స్పెషలిస్ట్ కోచ్‌గా నియమించారు. కోచ్‌లు ఇద్దరూ 2020లో జరిగే టోక్యో ఒలింపిక్స్ వరకు బాధ్యతలు నిర్వర్తిస్తారు. 


దక్షిణాఫ్రికా లీగ్‌లో స్టెలెన్‌బాష్ జట్టుని కొన్న ప్రీతి జింటాదక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్వహించనున్న గ్లోబల్ టి20 లీగ్‌లో ‘స్టెలెన్‌బాష్’ టీమ్‌ను ప్రీతి జింటా కొనుగులు చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్‌‌స ఎలెవన్ పంజాబ్ జట్టుకు ఆమె యజమానిగా ఉన్నారు. గతంలో నిర్వహించిన గ్లోబల్ టీ 20 లీగ్ జట్ల వేలంలో స్టెలెన్‌బాష్‌ను దక్షిణాఫ్రికాకే చెందిన బ్రిమ్‌స్టోన్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కొనుక్కుంది. అయితే ఆర్థికపరమైన సమస్యలతో బ్రిమ్‌స్టోన్ తాము లీగ్‌నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించగా...ఆ స్థానంలో ఇప్పుడు ప్రీతి జింటా వచ్చింది. 


ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్‌లో సోనమ్‌కు స్వర్ణం గ్రీస్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత ప్లేయర్ సోనమ్ మాలిక్ బంగారు పతకాన్ని సాధించింది. 56 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 15 ఏళ్ల సోనమ్ ఫైనల్లో 3-1తో సెనా నగమొటో (జపాన్)పై ఘనవిజయం సాధించింది. 43 కేజీల విభాగంలో బరిలోకి దిగిన భారత ప్లేయర్ నీలమ్ కాంస్య పతకం గెలుచుకుంది. 


‘బెస్ట్ లిఫ్టర్’ రాగల వెంకట రాహుల్ కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శనతో 16 రికార్డులు కొల్లగొట్టిన ఆంధ్రప్రదేశ్ వెయిట్ లిఫ్టర్ రాగాల వెంకట రాహుల్ తాజాగా రెండు అవార్డుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సీనియర్ పురుషులు, జూనియర్ పురుషుల 85 కేజీల విభాగాల్లో ‘బెస్ట్ లిఫ్టర్’ అవార్డులను రాహుల్ చేజిక్కించుకున్నాడు. ఈ చాంపియన్‌షిప్‌లో భారత బృందానికి నాలుగు అవార్డులు రాగా... అందులో రెండు ఏపీ లిఫ్టర్‌కే దక్కాయి. 
మీరాబాయి చానుకు సీనియర్ మహిళల కేటగిరీలో, దీపక్ లాథెర్‌కు యూత్ బాలుర విభాగంలో అవార్డులు లభించాయి. మొత్తంగా ఈ టోర్నీలో 34 రికార్డుల్ని భారత లిఫ్టర్లు నెలకొల్పారు. సెప్టెంబర్ 9న చివరి రోజు పోటీల్లో పర్దీప్ సింగ్ బంగారు పతకం సాధించి, వచ్చే ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సంపాదించాడు. 
 

2018లో మంచిర్యాలలో స్టూడెంట్ ఒలింపిక్స్ 
దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని మంచిర్యాలలో ‘స్టూడెంట్ ఒలింపిక్స్’ను 2018 నవంబర్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు క్రీడలు, పర్యాటక యువజనాభ్యుదయ శాఖ దీనికి సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ముంబైకి చెందిన ‘స్పోర్‌‌ట్స ఫర్ ఆల్’ సంస్థ సహకారంతో ఈ క్రీడలను నిర్వహించనున్నారు. 
దేశంలోనే తొలిసారిగా..
ఇప్పటి వరకు మన దేశంలో నిర్బంధ క్రీడల నిర్వహణ విధానం లేదు. దేశంలోనే తొలిసారి ఈ ప్రయోగానికి తెలంగాణ శ్రీకారం చుడుతోంది. మంచిర్యాల జిల్లాలో ప్రతి విద్యార్థి తొలుత పాఠశాల స్థాయి పోటీల్లో పాల్గొనాలి. విజయం సాధించిన వారితో మండల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. అందులో టాప్‌లో ఉన్న వారి మధ్య డివిజన్ స్థాయి, ఆ తర్వాత జిల్లా స్థాయి పోటీలు నిర్వహించి విజేతలను ఎంపిక చేస్తారు. వారికి బంగారు, వెండి, కంచు పతకాలు, ప్రశంసా పత్రాలు, ర్యాంక్ కార్డులు అందజేస్తారు. కేజీ నుంచి కళాశాల స్థాయి వరకు.. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థ అన్న తేడా లేకుండా ప్రతీ విద్యార్థి కనీసం ఒక క్రీడలో విధిగా పాల్గొనేలా చేసి వారిలో క్రీడలంటే భయం పోగొట్టాలన్నది ప్రధాన ఆలోచన. 
 

యూఎస్ ఓపెన్ - 2017 
యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ దక్కించుకున్నాడు. సెప్టెంబర్ 10న జరిగిన ఫైనల్లో నాదల్ 6-3, 6-3, 6-4 తేడాతో దక్షిణాఫ్రికాకు చెందిన కెవిన్ ఆండర్స్‌ను ఓడించి.. కెరీర్‌లో 16వ గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఇదే ఏడాది జూన్‌లో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను నాదల్ గెలుచుకున్నాడు. 

మహిళల సింగిల్స్ విజేత స్లోన్ స్టీఫెన్స్ యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికా టెన్నిస్ ప్లేయర్ స్లోన్ స్టీఫెన్స్ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 10న సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ క్రీడాకారిణి స్లోన్ స్టీఫెన్‌‌స 6-3, 6-0తో 15వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)ను ఓడించింది. తద్వారా కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకుంది. 
విజేతలుగా నిలిచిన ప్లేయర్‌లకు 37 లక్షల డాలర్లు (రూ. 23 కోట్ల 61 లక్షలు)... రన్నరప్‌లకు 18 లక్షల 25 వేల డాలర్లు (రూ. 11 కోట్ల 64 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
జామీ ముర్రే-హింగిస్‌లకు ‘మిక్స్‌డ్’ టైటిల్ఇదే టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జామీ ముర్రే (బ్రిటన్)-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) విజేతలుగా నిలిచారు. ఫైనల్లో టాప్‌సీడ్ హింగిస్ జంట 6-1, 4-6, 10-8తో మైకేల్ వీనస్ (న్యూజిలాండ్)-చాన్ హావో చింగ్ (చైనీస్‌తైపీ)లపై సూపర్ టైబ్రేకర్‌లో విజయం సాధించారు. జత కట్టినప్పటి నుంచి హింగిస్ జోడికిది వరుసగా పదో విజయం కావడం విశేషం.

ఖార్కివ్ ఇంటర్నేషనల్‌లో నందగోపాల్‌కు రెండు టైటిల్స్ 
ఉక్రెయిన్‌లో జరిగిన ఖార్కివ్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ కిడాంబి నందగోపాల్ రెండు టైటిల్స్ సాధించాడు. పురుషుల డబుల్స్‌లో రోహన్ కపూర్‌తో, మిక్స్‌డ్ డబుల్స్‌లో మహిమా అగర్వాల్‌తో జతకట్టి అతను విజేతగా నిలిచాడు. 
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్ పోరులో మూడో సీడ్ నందగోపాల్-మహిమ జంట 21-14, 21-15తో సౌరభ్ శర్మ-అనౌష్క పారిఖ్ (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ ఫైనల్లో నందగోపాల్-రోహన్ ద్వయం 18-21, 24-22, 21-18తో కోన తరుణ్-ఫ్రాన్సిస్ అల్విన్ (భారత్) జోడీపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో తెలుగు అమ్మాయి శ్రీకృష్ణప్రియ 21-18, 16-21, 21-23తో ఏడో సీడ్ నటాలియా వొయెత్సెక్ (ఉక్రెయిన్) చేతిలో పరాజయం పాలైంది.

జాతీయ జూనియర్ చెస్ చాంప్ హర్ష జాతీయ జూనియర్ అండర్-19 ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ ఆటగాడు హర్ష భరతకోటి విజేతగా నిలిచాడు. 11 రౌండ్ల పాటు జరిగిన ఈ టోర్నీలో అతను 9.5 పాయింట్లతో అజేయంగా అగ్రస్థానంలో నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్తీక్ వెంకట రామన్ కూడా సరిగ్గా 9.5 పాయింట్లు సాధించాడు. అయితే ఈ టోర్నీలో అతనిపై ముఖాముఖి పోరులో అంతర్జాతీయ మాస్టర్ (ఐఎమ్) హర్ష గెలుపొందడంతో అతడిని విజేతగా డిక్లేర్ చేశారు. బాలికల కేటగిరీలో మహాలక్ష్మి (తమిళనాడు) చాంపియన్‌గా నిలిచింది. 

త్వరలో ఎంజీఆర్ స్మారక రూ.100 నాణెంభారతరత్న గ్రహీత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతిని పురస్కరించుకుని త్వరలో రూ.100, రూ.5 స్మారక నాణేలను కేంద్రం ముద్రించనుంది. ఈ నాణేలపై ఎంజీఆర్ ముఖచిత్రంతోపాటు ‘డాక్టర్ ఎంజీఆర్ బర్త్ సెంటినరీ’ అని ఇంగ్లిష్ అక్షరాల్లో, దేవనాగరి లిపిలో ముద్రించి ఉంటుందని ప్రభుత్వం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. నాణేనికి మరోవైపు నాలుగుసింహాలున్న అశోక స్తూపంతోపాటు కింద ‘సత్యమేవ జయతే’ అని రాసి ఉంటుంది. రూ.100 నాణెం బరువు 35 గ్రాములుకాగా, రూ.5 నాణెం బరువు ఆరు గ్రాములు. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ధాతువులతో రూ.100 నాణెం తయారుచేస్తారు. 75 శాతం రాగి, 20 శాతం జింక్, 5 శాతం నికెల్ ధాతు మిశ్రమంతో రూ.5 నాణెం తయారుచేస్తారు. 
ఎంజీఆర్‌గా ప్రఖ్యాతిగాంచిన రామచంద్రన్ తమిళనాడును పరిపాలిస్తున్న అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం(అన్నాడీఎంకే) పార్టీని స్థాపించారు. 


విరాట్ కోహ్లీ రికార్డుఅంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో(టెస్టులు, వన్డేలు, టీ20) కలిపి వేగంగా 15,000 పరుగులు పూర్తి చేసిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. మొత్తం 304 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించాడు. వరల్డ్ క్రికెట్‌లో 15000 పరుగులు చేసిన 33వ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే 50కిపైగా సగటుతో ఈ రికార్డు సాధించిన బ్యాట్స్‌మన్ మాత్రం ఇతనొక్కడే. సెప్టెంబర్ 6న శ్రీలంకతో టీ20 మ్యాచ్‌లో 82 పరుగులు చేయడంతో కోహ్లీ ఈ మైలురాయిని చేరుకున్నాడు.

ప్రపంచ బాక్సింగ్‌లో గౌరవ్ బిధురికి కాంస్యంప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వైల్డ్ కార్డు ద్వారా ప్రవేశించిన భారత బాక్సర్ గౌరవ్ బిధురి కాంస్య పతకం సాధించాడు. ఈ మేరకు హాంబర్గ్‌లో జరిగిన సెమీఫైనల్లో (56 కేజీల విభాగం) గౌరవ్, డ్యూక్ రగన్ (అమెరికా) చేతిలో పరాజయం చెందాడు. దీంతో భారత్ నుంచి ఈ టోర్నీలో పతకం సాధించిన విజేందర్ (2009), వికాస్ క్రిషన్ (2011), శివ థాపా (2015) సరసన 24 ఏళ్ల గౌరవ్ కూడా చేరాడు. 


మొయినుద్దౌలా గోల్ట్‌కప్ విజేత హెచ్‌సీఏ ఎలెవన్ఆలిండియా మొయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టోర్నమెంట్‌ను హెచ్‌సీఏ ఎలెవన్ దక్కించుకుంది. ఆగస్టు 31న ఎయిరిండియాతో జరిగిన ఫైనల్లో హెచ్‌సీఏ ఎలెవన్ జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన హెచ్‌సీఏ ఎలెవన్ జట్టుకు రూ. 5లక్షలు, రన్నరప్‌గా నిలిచిన ఎయిరిండియాకు రూ. 3లక్షల ప్రైజ్‌మనీ లభించింది. 


ఇటలీ గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్ ఇటలీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. ఈ మేరకు సెప్టెంబర్ 3న జరిగిన ఫైనల్ రేసులో 53 ల్యాప్‌లను గంటా 15 నిమిషాల 32.310 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని దక్కించుకోగా... వెటెల్ (ఫెరారీ) మూడో స్థానాన్ని పొందాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు ఒకాన్ ఆరో స్థానంలో, మరో డ్రైవర్ పెరెజ్ తొమ్మిదో స్థానంలో నిలిచాడు. 
20 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటికి 13 రేసులు పూర్తయ్యాయి. తాజా విజయంతో హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ రేసులో 238 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. వెటెల్ (235 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోగా.. బొటాస్ (197 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నాడు. 


శ్రీలంకతో వన్డే సీరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ శ్రీలంకతో జరిగిన వన్డే సీరీస్‌ను భారత్ 5 - 0 తేడాతో క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 3న కొలంబోలో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ 6 వికెట్లతో గెలుపొందింది. భారత బౌలర్ బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్ పురస్కారం లభించింది. ఈ మ్యాచ్‌లో శతకం బాదిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ జాబితాలో పాంటింగ్ (30 సెంచరీలు) సరసన చేరాడు. 49 సెంచరీలతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో ఉన్నాడు. 
శ్రీలంకతో ఇటీవల జరిగిన మూడు టెస్టుల సీరీస్‌ను కూడా భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. 

స్టంపింగ్‌లలో ధోని వరల్డ్ రికార్డుభారత వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని వన్డేల్లో అత్యధిక స్టంపింగ్‌లు చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. శ్రీలంకతో జరిగిన చివరి వన్డేలో ధోని ఈ ఘనతను సాధించాడు. లంక ఆటగాడు అకిల దనంజయను అవుట్ చేయడం ద్వారా వన్డేల్లో ధోని వంద స్టంపింగ్‌ల రికార్డును సాధించిన వికెట్ కీపర్‌గా రికార్డులెక్కాడు. తద్వారా శ్రీలంక మాజీ వికెట్ కీపర్ సంగక్కర పేరిట ఉన్న 99 స్టంపింగ్‌ల రికార్డును ధోని అధిగమించాడు. 


స్టార్ ఇండియాకు ఐపీఎల్ ప్రసార హక్కులు ఐదేళ్లపాటు ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే హక్కులను స్టార్ ఇండియా రూ.16,347.50 కోట్ల భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. వేలంలో స్టార్ ఇండియా-సోనీ మధ్య ప్రధాన పోటీ నెలకొనగా.. చివరికి టీవీ ప్రసార హక్కులతో పాటు డిజిటల్ హక్కులనూ స్టార్ ఇండియా కై వసం చేసుకుంది. ఈ ఒప్పందం 2018 నుంచి 2022 వరకు ఉంటుంది. 
2008లో పదేళ్ల కాలానికి సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ రూ.8,200 కోట్ల్ల ఒప్పందం చేసుకుంది. 2015లో నోవి డిజిటల్ మూడేళ్లకు రూ.302.2 కోట్లతో డిజిటల్ హక్కులను గెలుచుకుంది. 


అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ అధికారిక గీతం ఆవిష్కరణ ఈ ఏడాది అక్టోబరులో భారత్ ఆతిథ్యమివ్వనున్న ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌నకు సంబంధించి అధికారిక గీతాన్ని ఆవిష్కరించారు. ‘కర్‌కే దిక్లా దే గోల్’ అనే పేరుతో ఉన్న ఈ గీతాన్ని అమితాబ్ భట్టాచార్య రచించగా... ప్రీతమ్ సంగీత దర్శకత్వం వహించారు. ప్రముఖ సింగర్స్ సునిధి చౌహాన్, నీతి మోహన్, బాబుల్ సుప్రియో, షాన్, పాపోన్, మికాలు పాడారు. 
ఈ మ్యూజిక్ వీడియోలో ఫుట్‌బాల్ దృశ్యాలతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పే వివిధ రాష్ట్రాల వేషధారణ, నృత్యంతో కళాకారులు అలరిస్తారు. సింగర్ షాన్, బాబుల్ సుప్రియో, బైచుంగ్ భూటియాతో పాటు చివర్లో బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నమస్కారం పెడుతూ కనిపిస్తారు. 
 

కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సంతోషికి రజతం ఆస్ట్రేలియాలో జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి మత్స్య సంతోషి రజతం సాధించింది. సెప్టెంబర్ 5న జరిగిన సీనియర్ మహిళల 53 కేజీల విభాగం ఫైనల్లో సంతోషి ఓవరాల్‌గా 194కేజీల బరువునెత్తి రెండో స్థానంలో నిలిచింది. స్నాచ్ విభాగంలో 86కేజీల లిఫ్ట్ చేసిన సంతోషి క్లీన్ అండ్ జర్క్ ఈవెంట్‌లో 108 కేజీల బరువునెత్తింది. ఈ విభాగంలో భారత్‌కే చెందిన సంజిత చాను ఓవరాల్‌గా 195 కేజీల బరువునెత్తి పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. సీనియర్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలిచింది. ఈ విజయాలతో మీరాబాయి, సంజిత వచ్చే ఏడాది ఇదే వేదికపై జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధించారు.




ఆగస్టు 2017 స్పోర్ట్స్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధుకు రజతంప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు రజతం దక్కించుకుంది. ఆగస్టు 27న గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నోజోమి ఒకుహారా సింధును ఓడించి స్వర్ణం గెలుచుకుంది. 2013, 2014లలోను సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. తాజాగా రజతం గెలవడం ద్వారా ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది.
ఇదే టోర్నీ సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్‌కు కాంస్యం దక్కింది. మొత్తంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి. నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ గెలుపొందిన మొత్తం పథకాలు 7.


జాతీయ స్క్వాష్ చాంప్ జోష్నా, సౌరవ్ జాతీయ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప (తమిళనాడు) 15వ సారి, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ గోషాల్ (తమిళనాడు) 12వ సారి చాంపియన్స్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో జోష్నా 3-1తో లక్ష్య (తమిళనాడు)పై, సౌరవ్ 3-1తో మహేశ్ (మహారాష్ట్ర)పై గెలిచారు. 


బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన రేసులో గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. హామిల్టన్‌కు ఈ ఏడాది ఇది ఐదో టైటిల్ కాగా కెరీర్‌లో 200వది. 
 

ప్రొఫెషనల్ కెరీర్‌లో మేవెదర్‌కు 50వ విజయం అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. ఆగస్టు 28న జరిగిన ‘సూపర్ ఫైట్’ బౌట్‌లో 40 ఏళ్ల మేవెదర్ కానర్ మెక్‌గ్రెగోర్ (ఐర్లాండ్)పై టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయం సాధించాడు. తద్వారా పోటీపడిన 50 బౌట్‌లలోను విజేతగా నిలిచిన మేవెదర్, 49 వరుస విజయాలతో అమెరికా హెవీవెయిట్ ప్రొఫెషనల్ బాక్సర్ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో ఖరీదైన బౌట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ పోటీ ద్వారా మేవెదర్ సుమారు 20 కోట్ల డాలర్లు (రూ.1,277 కోట్లు)... మెక్‌గ్రెగోర్ సుమారు 10 కోట్ల డాలర్లు (రూ. 638 కోట్లు) ఆర్జించారు.
2015లో మ్యానీ పకియావ్ (ఫిలిప్పీన్స్‌)తో జరిగిన బౌట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన మేవెదర్ కెరీర్‌లో 50వ విజయం సాధించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు.


క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం ప్రత్యేక పోర్టల్ క్షేత్ర స్థాయి నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు కేంద్ర క్రీడా శాఖ రూపొందించిన ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ’ పోర్టల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆగస్టు 28న ఆవిష్కరించారు. ఎనిమిదేళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఏదైనా క్రీడల్లో నైపుణ్యం ఉంటే www.nationalsportstalenthunt.com పోర్టల్‌లో తమ బయోడేటా లేక వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి క్రీడా శాఖ తగినవారిని ఎంపిక చేసి తమ ‘సాయ్’ కేంద్రాల్లో శిక్షణ ఇస్తుంది. అలాగే ఎనిమిదేళ్లపాటు రూ.5 లక్షల చొప్పున వెయి్య స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. 


బీసీసీఐ ఆఫీస్ బేరర్లను తొలగించండి : సీఓఏ 
జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు తీరుపై పరిపాలక కమిటీ (సీఓఏ) తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయంలో ఏమాత్రం సహకారం అందించడం లేదని, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుధ్ చౌదరి, కార్యదర్శి అమితాబ్ చౌదరి సహా ఆఫీస్ బేరర్లను తొలగించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ మేరకు తమ ఐదో స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందించింది. ఈ 26 పేజీల నివేదికలో బోర్డు పనితీరుపై ఘాటుగా స్పందించింది.

బల్గేరియా ఓపెన్ సింగిల్స్ విజేత లక్ష్య సేన్ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్, భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ సీనియర్ స్థాయిలో బల్గేరియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 17న పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ 18-21, 21-12, 21-17తో రెండో సీడ్ జ్వొనిమిర్ దుర్కిన్‌జాక్ (క్రొయేిషియా)పై గెలుపొందాడు. ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పీటర్ గేడ్ (డెన్మార్క్) వద్ద పది రోజులపాటు శిక్షణ తీసుకున్న లక్ష్యసేన్ ఈ ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కూడా నిలిచాడు. 


ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత శివాని పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడా కారిణి గద్దె రుత్విక శివాని చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక శివాని 21-10, 21-13తో ఐదో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచే క్రమంలో ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన రుత్విక శివాని తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రుత్విక నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.
 

హాకీ ఆసియాకప్ స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్ బంగ్లాదేశ్‌లో అక్టోబర్ నుంచి జరిగే ఆసియాకప్ హాకీ టోర్నీకి హీరో మోటోకార్ప్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత బంగ్లా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ ఢాకాలోని మౌలానా భషానీ జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కి తాము భాగస్వామిగా వ్యవహరిస్తున్నామని, ప్రస్తుతం దీన్ని ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్)కు విస్తరిస్తున్నామని హీరో సంస్థ చీఫ్ పవన్ ముంజాల్ తెలిపారు. 


ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నాదల్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సంఘం (ఏటీపీ) ఆగస్టు 21న విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. 2014 జూలై తర్వాత నాదల్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు టాప్ ర్యాంకులో ఉన్న ఆండీ ముర్రే (బ్రిటన్) రెండోస్థానానికి పడిపోయాడు. ఇటీవల జరిగిన సిన్సినాటీ టోర్నీలో నాదల్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. గాయం కారణంగా ముర్రే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ర్యాంకింగ్‌‌సలో నాదల్ ఎగబాకాడు. 
తాజా ర్యాంకింగ్‌‌సలో నాదల్, ముర్రే , రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), నోవాక్ జొకోవిచ్ (సెర్బియా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), దిమిత్రోవ్, కీ నిషికోరి (జపాన్) వరుసగా తొలి పది స్థానాల్లో నిలిచారు. 


ఫిబా ఆసియా కప్ విజేత ఆస్ట్రేలియా ఫిబా ఆసియా బాస్కట్‌బాల్ కప్ (ఫిబా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్)ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఆగస్టు 21న జరిగిన ఫైనల్లో ఆసీస్ 79-56తో ఇరాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఇదే తొలిసారి. చైనా అత్యధికంగా 16 సార్లు ఈ కప్‌ను కైవసం చేసుకుంది. 


‘సిన్సినాటి’ చాంపియన్స్ దిమిత్రోవ్, ముగురుజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), మహిళల సింగిల్స్‌లో ముగురుజా (స్పెయిన్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో దిమిత్రోవ్ 6-3, 7-5తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై... నాలుగో సీడ్ ముగురుజా 6-1, 6-0తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై విజయం సాధించారు. చాంపియన్‌‌సగా నిలిచిన దిమిత్రోవ్‌కు 9,54,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 12 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... ముగురుజాకు 5,22,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 35 లక్షలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


ప్రపంచ అథ్లెటిక్స్‌లో బార్బరా స్పొటకోవాకు స్వర్ణం 
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవా స్వర్ణం గెలుచుకుంది. ఆగస్టు 9న జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 36 ఏళ్ల స్పొటకోవా ఈటెను 66.76 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించింది. తద్వారా 2007 ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన స్పొటకోవా పదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. 
పురుషుల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ వేడ్ వాన్ నికెర్క్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 43.98 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. 


పారా అథ్లెట్ సువర్ణారాజ్‌కు ఎన్‌సీపీఈడీపీ పురస్కారం ప్రముఖ పారా అథ్లెట్ సువర్ణారాజ్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వికలాంగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నందుగు గుర్తింపుగా National Centre for Promotion of Employment for Disabled People(NCPEDP) అందజేసే Mphasis Universal Design Award for 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. 


కెరీర్ చివరి రేసులో విఫలమైన ఉసేన్ బోల్డ్ జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుని పూర్తి చేయకుండానే కెరీర్ ముగించాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 12న జరిగిన 4 × 100 మీటర్ల రిలేలో తొడ కండరాలు పట్టేయడంతో బోల్ట్ రేసుని ముగించలేకపోయాడు.
ఈ రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్‌బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్‌లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. 
అన్నీ స్వర్ణాలే... బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (100 మీ.) నెగ్గాడు. ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4×100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. 


ఆసియా షాట్‌గన్ పోటీల్లో రష్మీ జంటకు స్వర్ణంఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజైన ఆగస్టు 13న భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ తన భాగస్వామి మేరాజ్ అహ్మద్ ఖాన్‌తో కలిసి భారత్‌కు స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో రష్మీ-మేరాజ్ ద్వయం 28-27తో లియూ జియాంగ్‌చి-గావో జియాన్‌మీ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఈ పోటీల్లో ఓవరాల్‌గా భారత్ ఎనిమిది పతకాలు సాధించింది. 
 

జావెలిన్ త్రో ఫైనల్లో దవీందర్‌కు 12వ స్థానంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన దవీందర్ సింగ్.. ఫైనల్లో 12వ స్థానంలో నిలిచాడు. అతను ఈటెను 80.02 మీటర్ల దూరం విసిరాడు. 


విదేశీగడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆగస్టు 14న ముగిసిన మూడో టెస్టులో 171 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. తద్వారా విదే శాల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇటువంటి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. గతంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో నెగ్గింది. మూడో టెస్టులో రాణించిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.. సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 


టెస్టుల్లో ధోని రికార్డుని అధిగమించిన కోహ్లి విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ఈ ఘనతను నమోదు చేశాడు. గతంలో ధోని ఆరు విదేశీ టెస్టు విజయాల్ని సాధించగా శ్రీలంకపై విజయం కోహ్లీకి ఏడోది. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ తన కెరీర్‌లో 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించాడు. భారత కెప్టెన్ గా గంగూలీ 49 టెస్టులకు సారథ్యం వహించగా, ధోని 60 టెస్టులకు, కోహ్లి 29 టెస్టులకు సారథిగా పనిచేశాడు. 


అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రోజర్స్ కప్ఏటీపీ మాస్టర్స్ సిరీస్ రోజర్స్ కప్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గెలుచుకున్నాడు. మాంట్రియల్ (కెనడా)లో ఆగస్టు 15న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)ను అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హెర్బర్ట్, మహుట్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది.

ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లులండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత తాను రిటైరవుతున్నట్లు ప్రకటించిన జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. ఈ మేరకు ఆగస్టు 1న బోల్ట్ తల్లిదండ్రులు వెల్లెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ ఈ బూట్లను అతనికి అందజేశారు. 
ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. 
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 4న జరగనున్న రేసు బోల్ట్ కెరీర్‌లో చివరి పరుగుపందెం. 


నెమార్ కోసం 1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీబ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెమార్ జూనియర్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్-జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్ జట్టు భారీ మొత్తం చెల్లించింది. ప్రొఫెషనల్ లీగ్‌‌సలో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెమార్ ఇక నుంచి పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెమార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది. అయితే నెమార్‌ను ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ.1,661 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది. 2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెమార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. దీంతో ఇది ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీగా నిలిచింది. 


ఆసియా షాట్‌గన్ షూటింగ్‌లో అంకుర్‌కు స్వర్ణం
 

ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ-70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్‌షమ్సీ (యూఏఈ-53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. 


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫరాకు స్వర్ణం 
లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా స్వర్ణం సాధించాడు. ఆగస్టు 5న జరిగిన పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో వరుసగా మూడో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. 


డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ విజేత విజేందర్భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో ఆగస్టు 5న జరిగిన బౌట్‌లో 3-0తో విజయం సాధించాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను విజేందర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. 


చివరి 100 మీటర్ల రేసులో బోల్ట్‌కు కాంస్యం 
జమైకా దిగ్గజం ఉసేన్ బోల్డ్ తన చివరి 100 మీటర్ల రేసులో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసులో ఉసేన్ బోల్డ్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలువగా... క్రిస్టియన్ కోల్మన్ 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
బోల్ట్ రికార్డులు 
ఒలింపిక్స్ (2008, 2012, 2016): 8 స్వర్ణాలు 
ప్రపంచ చాంపియన్‌షిప్ (2007, 2009, 2011, 2013, 2015, 2017): 11 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం 
ఇతర అంతర్జాతీయ పతకాలు: 4 స్వర్ణాలు, 3 రజతాలు 
బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు
100 మీ. పరుగు: 9.58 సెకన్లు
200 మీ. పరుగు: 19.19 సెకన్లు
4×100 మీ. రిలే: 36.84 సెకన్లు (జమైకా జట్టులో సభ్యుడు) 


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టోరి బోవికి స్వర్ణం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన అథ్లెట్ టోరి బోవీ స్వర్ణం సాధించింది. ఆగస్టు 7న జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో ఆమె 10.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఫేవరేట్ ఎలైన్ థాంప్సన్ (జమైకా) 5వ స్థానంలో నిలిచింది. ఐవరీ కోస్ట్‌కు చెందిన మారి జోన్ రజతం, నెదర్లాండ్స్‌కు చెందిన షిప్పర్స్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 
పురుషుల షాట్‌పుట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన థామస్ వాల్ష్ గుండును 22.02 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు స్వర్ణంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్ రోజస్ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్-14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. 


టెస్టుల్లో ఆల్‌రౌండర్ గా జడేజా
ఆగస్టు 8న విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్‌‌స ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా అగ్రస్థానం అందుకున్నాడు. జడేజా 438 పాయింట్లతో తొలిస్థానం కైవసం చేసుకోగా ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న షకీబ్ ఉల్ హసన్ (బంగ్లాదేశ్) 431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్‌‌సలోనూ జడేజా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. 
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌‌సలో పుజారా (888 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (813 పాయింట్లు) ఐదో స్థానంలో, రహానే (776 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్) వరుసగా తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు.