Friday, 1 December 2017

నవంబర్ 2017 స్పోర్ట్స్

దివిజ్ జోడికి బెంగళూరు ఓపెన్ డబుల్స్ టైటిల్ భారత ఆటగాడు దివిజ్ శరణ్ బెంగళూరు ఓపెన్‌లో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. నవంబర్ 24న జరిగిన ఫైనల్లో దివిజ్ (భారత్)-ఎల్గిన్ (రష్యా) జోడి 6-3, 6-0తో క్రొయేషియా జంట ఇవాన్ సబనోవ్-మాటెజ్ సబనోవ్‌పై విజయం సాధించింది. 


నాగల్‌కు బెంగళూరు ఓపెన్ సింగిల్స్ టైటిల్ భారత ఆటగాడు సుమీత్ నాగల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌లో తొలి ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ అందుకున్నాడు. బెంగళూరు ఓపెన్ లో నవంబర్ 25న జరిగిన ఫైనల్లో అతను 6-3, 3-6, 6-2తో జే క్లార్క్ (బ్రిటన్)పై విజయం సాధించాడు. ట్రోఫీతో పాటు అతను రూ. 9.36 లక్షల (14,400 డాలర్లు) ప్రైజ్‌మనీని, 100 ర్యాంకింగ్ పాయింట్లను అందుకున్నాడు. 


హాంకాంగ్ ఓపెన్ రన్నరప్‌గా పీవీ సింధు బ్యాడ్మింటన్ సీజన్‌లోని చివరి సూపర్ సిరీస్ టోర్నీ హాంకాంగ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ పోరులో భారత స్టార్ పీవీ సింధు రన్నరప్‌గా నిలిచింది. నవంబర్ 26న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు 18-21, 18-21తో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి చవిచూసింది. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 30,000 డాలర్ల (రూ. 19 లక్షల 39 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 15,200 డాలర్ల (రూ. 9 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ఈ ఏడాది ఓ టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం సింధుకిది రెండోసారి. ఈ సంవత్సరం సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్, ఇండియా ఓపెన్, కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన సింధు... ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్లో నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓడిపోయి రజతం సాధించింది. 


ప్రపంచ యూత్ మహిళల బాక్సింగ్ చాంప్ భారత్ ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్ చేరిన ఐదుగురు బాక్సర్లూ విజేతలుగా నిలిచి తొలిసారి భారత్‌ను ఓవరాల్ చాంపియన్‌గా నిలబెట్టారు. ఐదు స్వర్ణాలతోపాటు రెండు కాంస్యాలు నెగ్గిన భారత అమ్మాయిలు ఈ టోర్నీ చరిత్రలోనే తమ అత్యుత్తమ ప్రదర్శనతో సరికొత్త ఘనత సాధించారు. నీతు (48 కేజీలు), జ్యోతి గులియా (51 కేజీలు), సాక్షి చౌదరి (54 కేజీలు), శశి చోప్రా (57 కేజీలు), అంకుశిత బొరో (64 కేజీలు)లు నవంబర్ 26న జరిగిన టైటిల్ పోరులో పసిడి సాధించారు. 

గోపీ థోనకల్‌కు ఆసియా మారథాన్ టైటిల్ ఆసియా మారథాన్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో భారత మారథాన్ రన్నర్ గోపీ థోనకల్ స్వర్ణ పతకం సాధించాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో కేరళకు చెందిన గోపీ చాంపియన్‌గా నిలిచాడు. 42.195 కి.మీ. దూరాన్ని గోపీ 2 గంటల 15 నిమిషాల 48 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. తద్వారా పురుషుల విభాగంలో ఈ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ రన్నర్‌గా గుర్తింపు పొందాడు. ఆండ్రే పెట్రోవ్ (ఉజ్బెకిస్తాన్-2గం:15ని:51 సెకన్లు) రజతం... బ్యాంబలేవ్ సెవీన్వ్ర్‌డాన్ (మంగోలియా-2గం:16ని:14 సెకన్లు) కాంస్యం గెలిచారు. ఓవరాల్‌గా ఆసియా మారథాన్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారతీయ రన్నర్‌గా గోపీ నిలిచాడు. గతంలో మహిళల విభాగంలో ఆశ అగర్వాల్ (1985లో), సునీత గోదర (1992లో) మాత్రమే స్వర్ణాలు గెలిచారు. 1988 వరకు ఈ మారథాన్ రేసు ఆసియా ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఉండేది. 1988 నుంచి ఆసియా చాంపియన్‌షిప్ నుంచి వేరు చేసి ఈ మారథాన్ రేసును ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు.


బొటాస్‌కు ‘అబుదాబి’ టైటిల్ఫార్ములావన్ సీజన్ చివరి రేసు అబుదాబి గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ విజేతగా నిలిచాడు. నవంబర్ 26న జరిగిన ఈ రేసులో నిర్ణీత 55 ల్యాప్‌లను బొటాస్ గంటా 34 నిమిషాల 14.062 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని సంపాదించాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో, ఎస్తెబన్ ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. 
నిర్ణీత 20 రేసులు ముగిశాక హామిల్టన్ 363 పాయింట్లతో ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ సొంతం చేసుకోగా... 317 పాయింట్లతో వెటెల్ రన్నరప్‌గా... 305 పాయింట్లతో బొటాస్ మూడో స్థానంలో నిలిచారు. 668 పాయింట్లతో మెర్సిడెస్ జట్టు ప్రపంచ కన్‌స్ట్రక్టర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సాధించగా... 187 పాయింట్లతో ఫోర్స్ ఇండియా నాలుగో స్థానంలో నిలిచింది. 


ప్రపంచ స్నూకర్ టైటిల్ విజేత..పంకజ్ భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్‌‌డ్స, స్నూకర్) స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ (32) కెరీర్‌లో 18వ ప్రపంచ కప్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. దోహా లో 2017 నవంబర్ 27న ముగిసిన ప్రపంచ స్నూకర్ ఛాంపియన్‌షిప్‌లో అమీర్ నర్థోష్ (ఇరాన్)ను ఓడించి పంకజ్ ఛాంపియన్‌గా నిలిచాడు.
బెంగళూరుకు చెందిన పంకజ్ గతంలో ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్; 2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్; 2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... మూడు సార్లు ప్రపంచ స్నూకర్ (2017, 2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు. 


ఫ్రాన్స్ కు డేవిస్ కప్ టైటిల్డేవిస్ కప్ టెన్నిస్ టైటిల్‌ను ఫ్రాన్స్ కైవసం చేసుకుంది. పారిస్‌లో 2017 నవంబర్ 26న ముగిసిన ఫైనల్లో బెల్జియంను 3-2 తేడాతో ఫ్రాన్‌‌స ఓడించింది. ఫ్రాన్‌‌సకిది పదో డేవిస్ కప్ టైటిల్.

పాకిస్తాన్ బౌలర్ హఫీజ్ పై మళ్లీ నిషేధం పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ మహమ్మద్ హఫీజ్ బౌలింగ్‌పై అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ మరోసారి నిషేధం విధించింది. గత నెలలో శ్రీలంకతో సీరీస్‌లో భాగంగా జరిగిన మూడో వన్డేలో హఫీజ్ నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేశాడని గుర్తించిన ఐసీసీ.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. 
వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో 2014 డిసెంబర్‌లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్.. రెండోసారి 2015 జూన్‌లో ఏడాది నిషేధానికి గురయ్యాడు.


పుణే ఓపెన్ విజేత యూకీ భారత్‌లో ఈ సంవత్సరం జరిగిన తొలి ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ పుణే ఓపెన్‌లో భారత స్టార్ యూకీ బాంబ్రీ విజేతగా నిలిచాడు. నవంబర్ 18న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో యూకీ 4-6, 6-3, 6-4తో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌ను ఓడించాడు. యూకీ కెరీర్‌లో ఇది ఆరో ఏటీపీ చాలెంజర్ టైటిల్ కాగా ఈ ఏడాది తొలి టైటిల్.


ఏటీపీ వరల్డ్ టూర్ పురుషుల టైటిల్ విజేత దిమిత్రోవ్ పురుషుల టెన్నిస్ సీజన్ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో బల్గేరియా ప్లేయర్ గ్రిగోర్ దిమిత్రోవ్ చాంపియన్‌గా అవతరించాడు. నవంబర్ 19న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో... దిమిత్రోవ్ 7-6, 4-6, 6-3తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై గెలిచాడు. తద్వారా 1998లో అలెక్స్ కొరెత్యా (స్పెయిన్) తర్వాత ఈ టోర్నీలో బరిలోకి దిగిన తొలిసారే టైటిల్ నెగ్గిన తొలి ప్లేయర్‌గా దిమిత్రోవ్ గుర్తింపు పొందాడు. 
విజేతగా నిలిచిన దిమిత్రోవ్‌కు 25,49,000 డాలర్లు (రూ. 16 కోట్ల 58 లక్షలు), రన్నరప్ గాఫిన్‌కు 11,58,000 డాలర్లు (రూ. 7 కోట్ల 53 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 


ఆఫ్గాన్‌కు అండర్-19 ఆసియా కప్ క్రికెట్ అండర్-19 ఆసియా కప్ వన్డే టైటిల్‌ను అఫ్గానిస్తాన్ గెలుచుకుంది. కౌలాలంపూర్‌లో నవంబర్ 19న జరిగిన ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి కప్పును కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలోనే నిష్ర్కమించింది.

టెన్నిస్ క్రీడాకారిణి యానా నొవొత్నాకన్నుమూతచెక్ రిపబ్లిక్ టెన్నిస్ క్రీడాకారిణి యానా నొవొత్నా (49) నవంబర్ 19న మరణించారు. ఆమె కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్నారు. మహిళల డబుల్స్‌లో ప్రపంచ నంబర్ వన్‌గా నిలిచిన నొవొత్నా.. సింగిల్స్‌లో రెండో ర్యాంక్ అందుకున్నారు. 1993లో స్టెఫీగ్రాఫ్ 
(జర్మనీ) చేతిలో, 1997లో మార్టినా హింగిస్
(స్విట్జర్లాండ్) చేతిలో వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్‌లో ఓడిపోయిన నొవొత్నా 1998లో నటాలీ తౌజియట్ (ఫ్రాన్స్)ను ఓడించి టైటిల్ సాధించారు. 1987 నుంచి 1999 వరకు సాగిన కెరీర్‌లో 24 సింగిల్స్, 76 డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. ఇందులో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి.

జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంప్స్ సైనా, ప్రణయ్పదేళ్ల తర్వాత జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో బరిలోకి దిగిన స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మూడోసారి విజేతగా నిలిచింది. నవంబర్ 8న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో రెండో సీడ్ సైనా 21-17, 27-25తో టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ పీవీ సింధు (ఆంధ్రప్రదేశ్)పై విజయం సాధించింది. సైనా 2006, 2007లలో కూడా జాతీయ టైటిల్స్‌ను గెల్చుకుంది. పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున బరిలోకి దిగిన సైనా విజేత హోదాలో రూ. రెండు లక్షల ప్రైజ్‌మనీని అందుకుంది. 



ప్రణయ్‌కు పురుషుల టైటిల్జాతీయ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కేరళ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్.. కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి తొలిసారి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పీఎస్‌పీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ ప్లేయర్ సిక్కి రెడ్డి ఐదోసారి మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఫైనల్లో సిక్కి-అశ్విని ద్వయం 21-14, 21-14తో సంయోగిత-ప్రాజక్తా జంటపై గెలిచింది. 2012లో అపర్ణా బాలన్‌తో, 2014, 2015, 2016లలో ప్రద్న్యా గాద్రెతో కలిసి సిక్కి జాతీయ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. 


ఆసియా సీనియర్ బాక్సింగ్‌లో మేరీకోమ్‌కు స్వర్ణం ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ (34) చాంపియన్‌గా నిలిచింది. 48 కేజీల విభాగం ఫైనల్లో ఆమె 5-0తో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసి పసిడి పతకాన్ని గెలుచుకుంది. 57 కేజీల విభాగంలో భారత్‌కే చెందిన సోనియా లాథెర్ రజత పతకంతో సంతృప్తి పడింది. ఫైనల్లో యిన్ జాన్‌హువా (చైనా) చేతిలో సోనియా ఓడిపోయింది. ఈ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం, రజతం, ఐదు కాంస్యాలు లభించాయి. 
2014 ఇంచియోన్ ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిచిన తర్వాత మేరీకోమ్ ఖాతాలో చేరిన మరో స్వర్ణం ఇదే. మొత్తంగా ఆసియా చాంపియన్‌షిప్‌లో మెరీకోమ్‌కు ఇది ఐదో స్వర్ణం. గతంలో ఆమె 2003లో (46 కేజీలు), 2005లో (46 కేజీలు), 2010లో (51 కేజీలు), 2012లో (51 కేజీలు) స్వర్ణాలు సాధించింది. 2008లో (46 కేజీలు) రజతం దక్కించుకుంది. 


జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్ లలిత్ బాబుఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ ఎం.ఆర్. లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో నవంబర్ 10న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో లలిత్ తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ టోర్నీలో 24 ఏళ్ల లలిత్ బాబు పెట్రోలియం స్పోర్‌‌ట్స ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలువగా... 7.5 పాయింట్లతో మురళి కార్తికేయన్ మూడో స్థానాన్ని సంపాదించాడు. 


జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ స్వ్కాష్ టోర్నీలో సౌరవ్‌కు టైటిల్ భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషాల్ తన కెరీర్‌లో ఏడో ప్రొఫెషనల్ టైటిల్‌ను సాధించాడు. నవంబర్ 10న ముగిసిన జేఎస్‌డబ్ల్యూ-సీసీఐ అంతర్జాతీయ స్క్వాష్ సర్క్యూట్ టోర్నీలో ప్రపంచ 21వ ర్యాంకర్ సౌరవ్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సౌరవ్ 11-6, 11-8, 11-8తో ఐదో సీడ్ నికొలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన సౌరవ్‌కు 7,671 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షలు) లభించింది.


17వ ప్రపంచ బిలియర్డ్స్ చాంప్‌గా పంకజ్ అద్వానీ భారత క్యూ స్పోర్‌‌ట్స (బిలియర్డ్స్, స్నూకర్) ప్లేయర్ పంకజ్ అద్వానీ 17వ సారి ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్(150 అప్ ఫార్మాట్)గా నిలిచాడు. నవంబర్ 12న జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-2 (0-155, 150-128, 92-151, 151-0, 151-6, 151-0, 150-58, 150-21) ఫ్రేమ్‌ల తేడాతో తన చిరకాల ప్రత్యర్థి మైక్ రసెల్ (ఇంగ్లండ్)ను ఓడించాడు. 2016లో బెంగళూరులో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లోనూ పంకజ్ చాంపియన్‌గా నిలిచాడు. 
గతంలో పంకజ్ ఐదుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (150 అప్ ఫార్మాట్-2017, 2016, 2014, 2008, 2005) టైటిల్స్‌ను... ఏడుసార్లు ప్రపంచ బిలియర్డ్స్ (టైమ్ ఫార్మాట్-2015, 2014, 2012, 2009, 2008, 2007, 2005) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ స్నూకర్ (2015, 2003) టైటిల్స్‌ను... రెండుసార్లు ప్రపంచ సిక్స్ రెడ్ స్నూకర్ (2015, 2014) టైటిల్స్‌ను... ఒకసారి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ (2014) టైటిల్‌ను సాధించాడు.


యూఏఈలో ధోని అకాడమీ ప్రారంభం భారత క్రికెటర్ ధోని అకాడమీ.. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ప్రారంభమైంది. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్‌‌ట్స క్లబ్, ఆర్కా స్పోర్‌‌ట్స క్లబ్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ శిక్షణ కేంద్రానికి ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ) అని పేరు పెట్టారు. నవంబర్ 11న ఈ అకాడమీని ధోని లాంఛనంగా ప్రారంభించాడు. 


బ్రెజిల్ గ్రాండ్‌ప్రి విజేత సెబాస్టియన్ వెటెల్ బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. రెండో స్థానంలో వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు. 
తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది. 


పేస్ - రాజాకు నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టైటిల్ భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. భారత్‌కే చెందిన పురవ్ రాజా ద్వయం అమెరికాలో జరిగిన నాక్స్‌విల్లె ఏటీపీ చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సాధించింది. నవంబర్ 13న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ పేస్-పురవ్ రాజా ద్వయం 7-6 (7/4), 7-6 (7/4)తో జేమ్స్ సెరాటిని (అమెరికా)-జాన్ ప్యాట్రిక్ స్మిత్ (ఆస్ట్రేలియా) జోడీపై గెలిచింది. విజేతగా నిలిచిన పేస్ జంటకు 4,650 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


ఫెడ్‌కప్ విజేత అమెరికా ప్రపంచ మహిళల టీమ్ టెన్నిస్ చాంపియన్‌షిప్ ‘ఫెడ్ కప్’ను అమెరికా జట్టు సొంతం చేసుకుంది. యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్‌‌స, ప్రపంచ పదో ర్యాంకర్ కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, అలీసన్ రిస్కీ సభ్యులుగా ఉన్న అమెరికా ఫైనల్లో 3-2తో బెలారస్‌పై గెలిచింది. చివరిసారి 2000లో ఫెడ్ కప్‌ను దక్కించుకున్న అమెరికా తాజా విజయంతో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. 


కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలుకామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో రెండో రోజు భారత్ షూటర్లు రెండు స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో షాజర్ రిజ్వీ 240.7 పాయింట్లతో స్వర్ణాన్ని దక్కించుకోగా, 236 పాయింట్లతో ఓంకార్ సింగ్ రజతం, 214.1 పాయింట్లతో జీతూ రాయ్ కాంస్యం సాధించారు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో పూజా ఘాట్కర్ 249.8 పాయింట్లతో స్వర్ణం సాధించగా అంజుమ్ మౌద్గిల్ 248.7 పాయింట్లతో రజతం గెలిచింది. పోటీల తొలి రోజు హీనా సిద్ధూ (10 మీటర్ల ఎయిర్ పిస్టల్) స్వర్ణం, దీపక్ కుమార్ (10 మీటర్ల ఎయిర్ రైఫిల్) రజతం గెలిచారు.


కామన్వెల్త్ షూటింగ్‌లో గగన్‌కు రజతం 
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ షూటర్ గగన్ నారంగ్ రజత పతకం గెలుచుకున్నాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్ ఫైనల్‌లో గగన్ 246.3 పాయింట్లు సాధించి రజతం గెలవగా, స్వప్నిల్ కుసాలే 225.6 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అన్నురాజ్ సింగ్ కాంస్య పతకం గెలుచుకుంది. 


పద్మశ్రీ కి శ్రీకాంత్ పేరు సిఫారసు భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ పేరును కేంద్ర పౌర పురస్కారం ‘పద్మశ్రీ’కు సిఫారసు చేశారు. ఈ ఏడాది శ్రీకాంత్ నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ గెలవడంతోపాటు మరో సూపర్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. దీంతో నామినేషన్ల గడువు సెప్టెంబర్ 15తో ముగిసినప్పటికీ కేంద్ర మాజీ క్రీడల మంత్రి విజయ్ గోయల్ ప్రత్యేక చొరవతో శ్రీకాంత్ పేరును పరిశీలించాలని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు. 


క్రికెట్‌కు ఆశిష్ నెహ్రా వీడ్కోలు భారత మీడియం ఫేస్ బౌలర్ (లెఫ్టార్మ్) ఆశిష్ నెహ్రా (38) క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికారు. నవంబర్ 1న న్యూఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించాడు. 1999లో అజారుద్దీన్ కెప్టెన్సీలో ఆరంగేట్రం చేసిన నెహ్రా 18 ఏళ్ల 250 రోజుల సుదీర్ఘ కెరీర్ కొనసాగించారు. 17 టెస్టులు, 120 వన్డేలు, 26 టీ20 మ్యాచ్‌లాడిన నెహ్రా మొత్తం 235 వికెట్లు తీసుకున్నాడు. 


కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రకాశ్, అంకుర్ కు స్వర్ణాలు కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు ప్రకాశ్ సంజప్ప, అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాలు గెలిచారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో ప్రకాశ్ నంజప్ప స్వర్ణం నెగ్గగా, అమన్‌ప్రీత్ సింగ్ రజతం, జీతూ రాయ్ కాంస్యం సాధించారు. పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ పసిడి నెగ్గగా మహిళల డబుల్ ట్రాప్‌లో శ్రేయసి సింగ్ రజతం గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్ 15 పతకాలు సాధించింది. 


జాతీయ అంధుల వన్డే టోర్నీ విజేత ఆంధ్రప్రదేశ్ జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ జట్టు టైటిల్‌ను సొంతం చేసుకుంది. ముంబైలో నవంబర్ 3న ముగిసిన ఫైనల్లో ఏడు వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. గుజరాత్ నిర్ణీత 35 ఓవర్లలో 250 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఏపీ జట్టు 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సారథి అజయ్‌రెడ్డి ఈ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నారు. 


ఆసియా కప్ మహిళల హకీ విజేత భారత్ భారత మహిళల జట్టు ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ విజేతగా నిలిచింది. నవంబర్ 5న జపాన్‌లో జరిగిన ఫైనల్లో ‘పెనాల్టీ షూటౌట్’లో 5-4తో చైనాపై విజయం సాధించింది. తద్వారా 2018లో లండన్‌లో జరిగే ప్రపంచకప్‌కు ఆసియా చాంపియన్ హోదాలో నేరుగా అర్హత సాధించింది. 
భారత్ ఈ కప్ గెలవడం ఇది రెండోసారి. గతంలో 1999, 2004, 2009లలో ఫైనల్‌కు చేరినప్పటికీ 2004లో మాత్రమే టైటిల్ నెగ్గింది. ఈ టోర్నీలో సవిత ‘బెస్ట్ గోల్‌కీపర్’ అవార్డును గెల్చుకుంది. 


ఆసియా టూర్ టైటిల్ విజేత శివ్ కపూర్ భారత స్టార్ గోల్ఫర్ శివ్ కపూర్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. నవంబర్ 5న ఢిల్లీలో జరిగిన పానాసోనిక్ ఓపెన్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఈ ఏడాది శివ్ కపూర్‌కిది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా కెరీర్‌లో మూడోది. 2005లో శివ్ కపూర్ తొలిసారి వోల్వో మాస్టర్స్ ఆసియా టూర్ టైటిల్‌ను గెలిచాడు. 


కామన్వెల్త్ షూటింగ్‌లో సత్యేంద్రకు స్వర్ణం కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో చివరిరోజు (నవంబర్ 6) భారత్‌కు పసిడి పతకంతోపాటు రజతం లభించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో సత్యేంద్ర సింగ్ బంగారు పతకం సొంతం చేసుకోగా.. సంజీవ్ రాజ్‌పుత్ రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 
ఆస్ట్రేలియాలో నవంబర్ 6న ముగిసిన కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఓవరాల్‌గా ఆరు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఏడు కాంస్యాలతో కలిపి మొత్తం 20 పతకాలు దక్కించుకుంది. 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ భారత్ కైవసం న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కేరళలో నవంబర్ 7న ముగిసిన మూడో టీ20లో 6 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. దీంతో సిరీస్ భారత్ సొంతం అయింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు రెండూ బుమ్రానే గెలుచుకున్నాడు. 


చెన్నైలో ఏటీపీ చాలెంజర్ టోర్నీ 2018 ఫిబ్రవరి నుంచి చెన్నై ఓపెన్ చాలెంజర్ టోర్నీని నిర్వహించనున్నట్లు తమిళనాడు టెన్నిస్ సంఘం (టీఎన్‌టీఏ) నవంబర్ 7న తెలిపింది. ఇందుకోసం ది అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ), అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) నుంచి అనుమతి తీసుకున్నట్లు వెల్లడించింది. 50వేల డాలర్ల (దాదాపు రూ.33 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తారు. భారత ప్లేయర్లు అంతర్జాతీయ ఆటగాళ్లతో పోటీ పడేందుకు ఈ టోర్నీ ఉపయోగపడనుందని టీఎన్‌టీఏ చీఫ్ అలగప్పన్ తెలిపారు. 




అక్టోబర్ 2017 స్పోర్ట్స్

టెన్నిస్‌కు మార్టినా హింగిస్ వీడ్కోలు స్విట్జర్లాండ్ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌వన్ మార్టినా హింగిస్ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. సింగపూర్‌లో ప్రస్తుతం జరుగుతోన్న డబ్ల్యూటీఏ ఫైనల్స్ తన ఆఖరి టోర్నీ అని 37 ఏళ్ల హింగిస్ అక్టోబర్ 26న ప్రకటించింది. 23 ఏళ్ల క్రితం ప్రొఫెషనల్‌గా మారిన హింగిస్ తన కెరీర్‌లో 5 సింగిల్స్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సహా మొత్తం 25 గ్రాండ్‌స్లామ్‌లు సాధించింది. 17 ఏళ్ల వయసులో అతి పిన్న వయసులో సింగిల్స్ నంబర్‌వన్ ర్యాంక్ సాధించిన ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన హింగిస్... ప్రస్తుతం డబుల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. గతంలో వేర్వేరు కారణాలతో రెండు సార్లు పదేళ్ల పాటు ఆటకు దూరమైన హింగిస్ 2013 నుంచి రెగ్యులర్‌గా డబుల్స్ ఆడుతోంది. 


అమెరికాలో గావస్కర్ గ్రౌండ్భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ పేరిట అమెరికాలో ఓ క్రికెట్ గ్రౌండ్ రూపుదిద్దుకుంది. కెంటకీ రాష్ట్రంలోని లూయిస్ విల్లేలో కొత్తగా నిర్మించిన ఈ మైదానాన్ని స్వయంగా గావస్కరే ప్రారంభించారు. ఇటీవలే జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో లూయిస్ విల్లే మేయర్ గ్రెగ్ ఫిష్చెర్ పాల్గొన్నారు. 42 జట్లు తలపడే ‘మిడ్‌వెస్ట్ క్రికెట్ లీగ్’లో ఈ మైదానం లూయిస్ విల్లే క్రికెట్ క్లబ్‌కు హోమ్ గ్రౌండ్‌గా ఉపయోగపడుతుంది.

షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్, అమన్‌లకు పతకాలు సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ కప్ షూటింగ్ ఫైనల్స్‌లో సంగ్రామ్ దహియా, అమన్‌ప్రీత్ సింగ్ గురికి భారత్ ఖాతాలో రెండు పతకాలు చేరాయి. పురుషుల ‘డబుల్ ట్రాప్’ ఈవెంట్‌లో సంగ్రామ్ రజత పతకం సాధించగా... పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో అమన్‌ప్రీత్ సింగ్ కాంస్య పతకాన్ని దక్కించుకున్నాడు. 
ఆరుగురు పాల్గొన్న డబుల్ ట్రాప్ ఫైనల్లో సంగ్రామ్ 76 పాయింట్లు స్కోరు చేసి రెండో స్థానంలో నిలువగా.. హు బిన్‌యువాన్ (చైనా-79 పాయింట్లు) ప్రపంచ రికార్డు సృష్టించడంతోపాటు స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు. గాస్‌పరానీ దవీ (ఇటలీ-56 పాయింట్లు) కాంస్య పతకాన్ని సంపాదించాడు. భారత్‌కే చెందిన ప్రపంచ నంబర్‌వన్ అంకుర్ మిట్టల్ 45 పాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో అమన్‌ప్రీత్ సింగ్ 202.2 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచాడు. 

శ్రీకాంత్కు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. పారిస్‌లో అక్టోబర్ 29న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ శ్రీకాంత్ 21-14, 21-13తో 40వ ర్యాంకర్, క్వాలిఫయర్ కెంటా నిషిమోటో (జపాన్)పై గెలిచాడు. తద్వారా లిన్ డాన్ (చైనా), లీ చోంగ్ వీ (మలేసియా), చెన్ లాంగ్ (చైనా) తర్వాత ఒకే ఏడాది కనీసం నాలుగు సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతోపాటు ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. 
శ్రీకాంత్ 2017లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్స్ నెగ్గాడు. సింగపూర్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఓవరాల్‌గా శ్రీకాంత్ కెరీర్‌లో ఇది ఆరో సూపర్ సిరీస్ టైటిల్. విజేతకు 24,375 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 15 లక్షల 85 వేలు)తోపాటు 9,200 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


బోపన్న జంటకు ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ టైటిల్ఎర్‌స్టీ ఓపెన్ ఏటీపీ-500 టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత డబుల్స్ నంబర్‌వన్ ప్లేయర్ రోహన్ బోపన్న టైటిల్ సాధించాడు. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో అక్టోబర్ 29న జరిగిన ఫైనల్లో బోపన్న-పాబ్లో క్యువాస్ (ఉరుగ్వే) ద్వయం మార్సెలో డెమోలైనర్ (బ్రెజిల్)-సామ్ క్వెరీ (అమెరికా) జంటపై గెలిచింది.
బోపన్నకు ఈ ఏడాది ఇది మూడో డబుల్స్ టైటిల్ కాగా ఓవరాల్‌గా 16వ టైటిల్. విజేతకు 1,32,030 యూరోల (రూ. 9 లక్షల 96 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 500 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


వియత్నాం ఓపెన్ టైటిల్ విజేత సాకేత్ మైనేనిఆంధ్రప్రదేశ్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 29న హో చి మిన్ సిటీలో జరిగిన ఈ టోర్నీలో సాకేత్-విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) ద్వయం గో సొయెదా-బెన్ మెక్లాచ్లాన్ (జపాన్) జంటపై విజయం సాధించింది. సాకేత్ కెరీర్‌లో ఇది ఏడో ఏటీపీ చాలెంజర్ డబుల్స్ టైటిల్. విజేతకు 3,100 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షలు)తోపాటు 80 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


టీ20ల్లో మిల్లర్ వేగవంతమైన సెంచరీదక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేవిడ్ మిల్లర్ బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో వంద పరుగులు చేసి అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికాకే చెందిన రిచర్డ్ లెవీ (న్యూజిలాండ్‌పై 45 బంతుల్లో 100) పేరిట ఉన్న రికార్డును తిరగ రాశాడు. 


న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ భారత్ కైవసంన్యూజిలాండ్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. అక్టోబర్ 29న జరిగిన చివరి వన్డేలో న్యూజిలాండ్‌పై 6 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కాయి. 
ఇదే మ్యాచ్‌లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ 9000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. తద్వారా అతి తక్కువ కాలంలో (9 ఏళ్ల 72 రోజులు) 9 వేల పరుగులు చేసిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. ఈ మైలురాయిని చేరుకోవడానికి ద్రవిడ్‌కు 9 ఏళ్ల 322 రోజులు, డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)కు 12 ఏళ్లు పట్టాయి.


అండర్-17 ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్భారతదేశంలో తొలిసారి నిర్వహించిన ‘ఫిఫా’ అండర్-17 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. అక్టోబర్ 28న కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 5-2 తేడాతో స్పెయిన్‌ను ఓడించింది. టోర్నీలో నాలుగోసారి ఫైనల్‌కు చేరిన స్పెయిన్ మళ్లీ రన్నరప్‌గా నిలిచింది. ఫాడెన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ టోర్నమెంట్’ అవార్డు దక్కింది. ఇంగ్లండ్ 2017లోనే అండర్-20 ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది. 


ప్రొ కబడ్డీ లీగ్ విజేత పట్నా పైరేట్స్ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-5 విజేతగా పట్నా పైరేట్స్ నిలిచింది. అక్టోబర్ 28న చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో 55-38 స్కోరుతో గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్‌ను ఓడించింది. తద్వారా వరుసగా మూడోసారి పీకేల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
ఈ టోర్నీలో ప్రదీప్ నర్వాల్‌ను పర్‌ఫెక్ట్ రైడర్ (రూ. 50 వేలు), బెస్ట్ డూ ఆర్ డై రైడర్ (రూ.50 వేలు), స్టార్ స్పోర్‌‌ట్స మూమెంట్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ (రూ. 50 వేలు), లీగ్ టాప్ స్కోరర్ (రూ.10 లక్షలు), రైడర్ ఆఫ్ ద టోర్నీ (రూ. 10 లక్షలు), మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ (రూ. 15 లక్షలు) అవార్డులు వరించాయి. ఉత్తమ అరంగేట్ర ఆటగాడు అవార్డు సచిన్ (గుజరాత్; రూ. 10 లక్షలు), డిఫెండర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు సురేందర్ నాడా (హరియాణా; రూ. 10 లక్షలు)కు లభించాయి.


హామిల్టన్‌కు ఫార్ములావన్ ప్రపంచ టైటిల్బ్రిటన్‌కు చెందిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నాలుగోసారి ఫార్ములావన్ ప్రంపంచ టైటిల్‌ను చేజిక్కించుకున్నాడు. టైటిల్ కోసం సెబాస్టియన్ వెటెల్‌తో నెలకొన్న మెక్సికో గ్రాండ్ ప్రి పోటీలో రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ టైటిల్ గెలిచాడు. దీంతో వెటెల్ (ఫెరారీ టీమ్) మిగిలి ఉన్న రెండు గ్రాండ్‌ప్రి (బ్రెజిలియన్, అబుదాబి)లను గెలిచినా హామిల్టన్‌ను చేరుకోలేడు. తద్వారా 2017 ప్రపంచ టైటిల్ హామిల్టన్ వశమైంది.
తొలి సారి 2008లో మెక్‌లారెన్ తరఫున టైటిల్ గెలిచిన హామిల్టన్ తర్వాత మెర్సిడెస్‌తో చేరాడు. 2014, 2015 సంవత్సరాల్లో వరుసగా రెండుసార్లు డ్రైవర్స్ చాంపియన్‌షిప్ గెలిచాడు. ఈ సీజన్‌లో అతను 9 రేసుల్లో గెలిచి 333 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. వెటెల్ 277 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.


ఐసీసీ ర్యాంకుల్లో కోహ్లి, మిథాలీ రాజ్ టాప్భారత క్రికెట్ కెప్టెన్లు విరాట్ కోహ్లి, మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో ఉన్నారు.
అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో 263 పరుగులు చేసిన కోహ్లి 889 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ వన్డే బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్‌‌సలో అగ్రస్థానంలో నిలిచాడు. తద్వారా 1998లో సచిన్ పేరిట ఉన్న 887 రేటింగ్ పాయింట్ల రికార్డును అధిగమించాడు. 
తాజా వన్డే బ్యాట్స్‌ఉమెన్ ర్యాంకింగ్‌‌సలో మిథాలీ ఒక స్థానాన్ని మెరుగుపర్చుకొని 753 రేటింగ్ పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో నిలిచింది. తదుపరి రెండు, మూడు ర్యాంకుల్లో ఎలైస్ పెర్రీ (ఆస్ట్రేలియా; 725), అమి శాటెర్త్‌వైట్ (న్యూజిలాండ్; 720) నిలిచారు.
న్యూజిలాండ్‌పై గెలిచినప్పటికీ భారత్ (119) 2 పాయింట్ల లోటుతో రెండో స్థానంలోనే ఉంది. దక్షిణాఫ్రికా (121) అగ్రస్థానంలో ఉంది.


సీనియర్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో మనోజ్‌కు స్వర్ణంవిశాఖపట్నంలో ముగిసిన జాతీయ సీనియర్ ఎలైట్ పురుషుల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మనోజ్ కుమార్ స్వర్ణపతకం గెలుచుకున్నాడు. అక్టోబర్ 30న జరిగిన 69 కేజీల విభాగం ఫైనల్లో మనోజ్ 4-1తో దుర్యోధన్‌సింగ్‌పై విజయం సాధించాడు.
60 కేజీల విభాగంలో శివ థాపా మనీశ్ చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకున్నాడు. ఈ టోర్నీలో మనోజ్ ‘బెస్ట్ బాక్సర్’గా నిలవగా.. మనీశ్ ‘మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్’ ఘనత దక్కించుకున్నాడు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో ఎన్టీ లాల్‌బియాకిమా (మిజోరం)పై 3-2తో గెలిచి స్వర్ణపతకం సాధించాడు.


కామన్వెల్త్ షూటింగ్‌లో హీనాకు స్వర్ణంకామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ హీనా సిద్ధూ స్వర్ణం సాధించింది. అక్టోబర్ 31న ప్రారంభమైన మహిళల 10 మీ. ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్లో హీనా 240.8 పాయింట్లు స్కోర్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గాలియాబొవిచ్ (238.2), క్రిస్టీ గిల్‌మెన్ (213.7) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. హీనా ఇటీవలే ఢిల్లీలో జరిగిన వరల్డ్‌కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలోనూ పసిడి పతకాన్ని సాధించింది. 


డెన్మార్క్ ఓపెన్ చాంపియన్ కిడాంబి శ్రీకాంత్డెన్మార్క్ ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ కైవసం చేసుకున్నాడు. అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో ప్రపంచ 8వ ర్యాంకర్ శ్రీకాంత్ 21-10, 21-5తో ప్రపంచ 22వ ర్యాంకర్ లీ హున్ ఇల్ (దక్షిణ కొరియా)ను ఓడించి.. కెరీర్‌లో మూడో సూపర్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. విజేతగా నిలిచిన శ్రీకాంత్‌కు 56,250 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 36 లక్షల 58 వేలు)తోపాటు 11,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ లీ హున్ ఇల్‌కు 28,500 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 18 లక్షల 53 వేలు)తోపాటు 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
డెన్మార్క్ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్ భారత ప్లేయర్‌కు లభించడం 37 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1980లో ప్రకాశ్ పదుకొనె ఈ టైటిల్‌ను సాధించగా... ఇపుడు శ్రీకాంత్ ఆయన సరసన నిలిచాడు. మహిళల సింగిల్‌లో మాత్రం 2012లో సైనా నెహ్వాల్ ఈ టైటిల్‌ను సాధించింది. 


హాకీ ఆసియా కప్ విజేత భారత్ సీనియర్ పురుషుల హాకీ ఆసియా కప్‌ని భారత్ గెలుచుకుంది. బంగ్లాదేశ్‌లోని ఢాకా వేదికగా అక్టోబర్ 22న జరిగిన ఫైనల్లో మన్‌ప్రీత్ సింగ్ నాయకత్వంలోని భారత్ 2-1 గోల్స్ తేడాతో మలేసియాను ఓడించింది. తద్వారా పదేళ్ల తర్వాత కప్‌ను కైవసం చేసుకుంది. మొత్తంగా ఎనిమిదోసారి ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరిన భారత్ 2003, 2007, 2017లలో విజేతగా నిలిచి... 1982, 1985, 1989, 1994, 2013లలో రన్నరప్‌గా నిలిచింది. 
టోర్నీ అవార్డులు 
మ్యాన్ ఆఫ్ ద ఫైనల్: ఆకాశ్‌దీప్ సింగ్ (భారత్) 
గోల్ ఆఫ్ ద ఫైనల్: లలిత్ ఉపాధ్యాయ్ (భారత్) 
టోర్నీ బెస్ట్ గోల్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్) 
ప్రామిసింగ్ ప్లేయర్: అర్షద్ హుస్సేన్ (బంగ్లాదేశ్) 
బెస్ట్ గోల్‌కీపర్: ఆకాశ్ చిక్టే (భారత్) 
టాప్ స్కోరర్స్: హర్మన్‌ప్రీత్ సింగ్ (భారత్-7 గోల్స్), ఫైజల్ సారి (మలేసియా-7 గోల్స్) 
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ: ఫైజల్ సారి (మలేసియా) 


హామిల్టన్‌కు అమెరికా గ్రాండ్ ప్రీ టైటిల్ ఫార్ములావన్ సీజన్‌లో భాగంగా జరిగిన అమెరికా గ్రాండ్‌ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. అక్టోబర్ 23న జరిగిన ఈ రేసులో హామిల్టన్ నిర్ణీత 56 ల్యాప్‌లను గంటా 33 నిమిషాల 50.991 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ (ఫెరారీ), రైకోనెన్ (ఫెరారీ), వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు నుంచి నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాలను సంపాదించారు. ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం. 


యూరోపియన్ ఓపెన్‌లో దివిజ్ జంటకు టైటిల్ భారత డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ దివిజ్ శరణ్ తన కెరీర్‌లో మూడో ఏటీపీ టూర్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. యూరోపియన్ ఓపెన్ ట్రోఫీ టోర్నీలో తన భాగస్వామి స్కాట్ లిప్‌స్కీ (అమెరికా)తో కలిసి దివిజ్ శరణ్ డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో దివిజ్ శరణ్-స్కాట్ లిప్‌స్కీ ద్వయం 6-4, 2-6, 10-5తో ‘సూపర్ టైబ్రేక్’లో శాంటియాగో గొంజాలెజ్ (మెక్సికో)-జూలియో పెరాల్టా (చిలీ) జోడీపై విజయం సాధించింది. విజేతగా నిలిచిన దివిజ్-లిప్‌స్కీ జంటకు 31,910 యూరోల (రూ. 24 లక్షల 38 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్‌లో జీతూ-హీనాకు స్వర్ణం ప్రతిష్టాత్మక వరల్డ్ కప్ ఫైనల్స్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షూటర్స్ జీతూ రాయ్ - హీనా సిద్ధూ ద్వయం పసిడి పతకాన్ని గెలుచుకుంది. అక్టోబర్ 24న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో జీతూ-హీనా జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో తొలిసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగాన్ని మెడల్ ఈవెంట్‌గా ప్రవేశపెట్టనున్నారు. గొబెర్‌విల్లీ-ఫౌకెట్ (ఫ్రాన్‌‌స-481.1 పాయింట్లు) జంట రజతం నెగ్గగా... యాంగ్ వీ-కాయ్ జియోజుయ్ (చైనా-418.2 పాయింట్లు) జోడీ కాంస్యం సాధించింది. మొత్తంగా ఈ ఏడాది 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కు లభించిన మూడో స్వర్ణమిది. న్యూఢిల్లీ, గబాలాలలో జరిగిన ప్రపంచకప్ టోర్నీల్లో జీతూ-హీనా జంట పసిడి పతకాలు గెలిచింది.


ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్‌గా రొనాల్డో పోర్చుగల్ జట్టు కెప్టెన్, రియల్ మాడ్రిడ్ క్లబ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో 2017 సంవత్సరానికి గాను ప్రపంచ ఉత్తమ ఫుట్‌బాల్ ప్లేయర్ పురస్కారాన్ని గెల్చుకున్నాడు. ఈ క్యాలెండర్ సంవత్సరంలో రొనాల్డో 48 మ్యాచ్‌లు ఆడి 44 గోల్స్ చేశాడు. అంతేకాకుండా రియల్ మాడ్రిడ్ జట్టుకు లా లీగా (స్పానిష్ లీగ్), చాంపియన్‌‌స లీగ్ టైటిల్స్‌ను అందించాడు. తన అద్భుత ప్రతిభతో వచ్చే ఏడాది రష్యాలో జరిగే ప్రపంచకప్‌కు పోర్చుగల్ అర్హత సాధించడంలో రొనాల్డో కీలకపాత్ర పోషించాడు. 


గగన్‌జీత్‌కు మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్మకావ్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గగన్‌జీత్ భుల్లర్(భారత్) గెలుచుకున్నాడు. మకావ్‌లో అక్టోబర్ 22న ముగిసిన ట్రోఫీలో ఈ టైటిల్ సాధించాడు. భుల్లర్ ఈ టైటిల్ సాధించడం ఇది రెండోసారి. అజితేష్ సందూ (భారత్), అంగెలో క్యూయి(ఫిలిప్పీన్స్) సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

ఫుట్‌బాల్ ఆసియా కప్-2019కు భారత్ అర్హత 
ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2019 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు భారత్ అర్హత సాధించింది. మకావుతో బెంగళూరులో అక్టోబర్ 11న జరిగిన మ్యాచ్‌లో భారత్ 4-1తో గెలిచింది. భారత్ తరఫున రౌలిన్ బోర్జెస్, కెప్టెన్ సునీల్ చెత్రి, జెజె లాల్‌పెకులువా ఒక్కో గోల్ చేశారు. 70వ నిమిషంలో మకావు ఆటగాడు లామ్ కా సెంగ్ సెల్ఫ్ గోల్ సాధించగా... 37వ నిమిషంలో నికొలస్ తరావు మకావుకు తొలి గోల్ అందించాడు. 2019 ఆసియా కప్ యూఏఈలో జరుగుతుంది. 2011 తర్వాత ఈ మెగా ఈవెంట్‌కు భారత్ మరోసారి అర్హత పొందింది. 


ఢిల్లీ హాఫ్ మారథాన్ ప్రచారకర్తగా ఎర్విన్ ఢిల్లీ హాఫ్ మారథాన్ పదో ఎడిషన్ ప్రచారకర్తగా నాలుగుసార్లు ఒలింపిక్ పతక విజేత, అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఆంటోనీ ఎర్విన్ నియమితులయ్యారు. ఒలింపిక్స్‌లో 50 మీ. ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో పతకం సాధించిన అత్యంత యువ ఆటగాడితోపాటు పెద్దవయస్కుడైన ఆటగాడిగా ఎర్విన్ ఘనత సాధించాడు. తొలుత 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో పతకం సాధించిన ఎర్విన్ తాజాగా ముగిసిన రియో ఒలింపిక్స్ (2016)లోనూ పతకం దక్కించుకున్నాడు. ఈక్రమంలో 36 ఏళ్ల వయసులో బంగారు పతకం సాధించిన ఆటగాడిగా ఎర్విన్.. సహచరుడు మైకేల్ ఫెల్‌‌ఫ్స రికార్డును సవరించాడు. 


టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహణకు ఐసీసీ నిర్ణయం అంతర్జాతీయ క్రికెట్‌లో తొమ్మిది దేశాలతో టెస్టు చాంపియన్‌షిప్ నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి - ఐసీసీ అధికారికంగా నిర్ణయించింది. దీంతో పాటు కొత్తగా అంతర్జాతీయ వన్డే లీగ్‌ను కూడా జరుపుతామని ప్రకటించింది. ఇందులో 13 దేశాలు పాల్గొంటాయి. అయితే ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన షెడ్యూల్, పాయింట్ల పద్ధతి, వేదికలను తర్వాత ప్రకటించనున్నారు. అక్టోబర్ 13న ఆక్లాండ్‌లో జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
కీలక నిర్ణయాలు.. 
  • టెస్టు లీగ్‌లో మొత్తం తొమ్మిది జట్లు పాల్గొంటాయి. 2019 నుంచి రెండేళ్ల పాటు ఆరు సిరీస్‌లు ఆడతాయి. ఇందులో ఒక్కో జట్టు మూడు సిరీస్‌లు స్వదేశంలో... మూడింటిని విదేశాల్లో ఆడాల్సి ఉంటుంది. అన్ని మ్యాచ్‌లు ఐదు రోజుల పాటు జరుగుతాయి.
  • ప్రతీ జట్టు కనీసం రెండు టెస్టులు... గరిష్టంగా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంటుంది. చివరగా రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఫైనల్లో తలపడతాయి.
  • 2020-2021లో జరిగే వన్డే లీగ్‌లో మొత్తం 13 దేశాలు పాల్గొంటాయి. ఇందులో 12 శాశ్వత సభ్య దేశాలు కాగా ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ చాంపియన్‌షిప్‌లో విజేత మరో జట్టుగా ఉంటుంది.
  • 2019లో జరిగే వన్డే ప్రపంచకప్ వరకు టాప్-10 సభ్య దేశాలు పరస్పర అంగీకారం మేరకు నాలుగు రోజుల టెస్టులను ప్రయోగాత్మకంగా జరుపుకోవచ్చు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే బాక్సింగ్ డే టెస్టు తొలిసారిగా ఇందుకు వేదికయ్యే అవకాశాలున్నాయి.


ఫెడరర్‌కు షాంఘై మాస్టర్స్ సిరీస్ టైటిల్ షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్‌లో 36 ఏళ్ల స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ చాంపియన్‌గా నిలిచాడు. ఈ మేరకు తన చిరకాల ప్రత్యర్థి, ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్)తో అక్టోబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఫెడరర్ 6-4, 6-3తో విజయం సాధించాడు. తద్వారా సీజన్‌లో ఆరో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఓవరాల్‌గా ఫెడరర్ కెరీర్‌లో ఇది 94వ టైటిల్. 
ఈ విజయంతో అత్యధిక సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఇవాన్ లెండిల్ (94) సరసన ఫెడరర్ సంయుక్తంగా రెండో స్థానానికి చేరుకున్నాడు. అమెరికా స్టార్ జిమ్మీ కానర్స్ (109 టైటిల్స్) అగ్రస్థానంలో ఉన్నాడు. 


హారిక జట్టుకు ‘యూరోపియన్’ టైటిల్ భారత గ్రాండ్‌మాస్టర్ ద్రోణవల్లి హారిక సభ్యురాలిగా ఉన్న బతూమి చెస్ క్లబ్ నోనా జట్టు ప్రతిష్టాత్మక యూరోపియన్ చెస్ క్లబ్ కప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 12 క్లబ్ జట్ల మధ్య జరిగిన ఈ టోర్నీలో హారిక బృందం 17.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించింది. హారిక జట్టులో నానా జాగ్‌నిద్జె, నినో బతియాష్‌విలి, బేలా ఖొటెనాష్‌విలి, మెలియా సలోమి (జార్జియా) మిగతా సభ్యులుగా ఉన్నారు. ఈ టోర్నీలో హారిక తాను ఆడిన ఆరు గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. 


తియాన్‌జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత షరపోవా రష్యా టెన్నిస్ స్టార్ మరియా షరపోవా రెండున్నరేళ్ల తర్వాత తొలి టైటిల్‌ను సొంతం చేసుకుంది. చైనాలో అక్టోబర్ 15న జరిగిన తియాన్‌జిన్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో షరపోవా విజేతగా నిలిచింది. ఫైనల్లో 7-5, 7-6 (8/6)తో అర్యానా సబలెంకా (బెలారస్)పై విజయం సాధించింది. గతేడాది డోపింగ్‌లో పట్టుబడి 15 నెలల నిషేధం ఎదుర్కొన్న షరపోవా ఈ ఏడాది ఏప్రిల్‌లో పునరాగమనం చేసింది. చివరిసారి షరపోవా 2015 మేలో రోమ్ ఓపెన్‌లో టైటిల్ గెలిచింది. 


భారత్‌లో వరల్డ్ రెజ్లింగ్ పోటీలువరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) పోటీలు 2017లో భారత్‌లో జరగనున్నాయి. డిసెంబర్ 8, 9 తేదీల్లో న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో డబ్ల్యూడబ్ల్యూఈ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ పోటీల్లో భారత సంతతికి చెందిన కెనడా జాతీయుడు, ‘ద మాడర్న్ డే ఆఫ్ మహారాజా’గా ప్రసిద్ధి చెందిన జిందర్ మహల్ ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాడు. పంజాబ్‌కు చెందిన యువరాజ్ సింగ్ దేశీ.. 2011లో జిందర్ మహల్ పేరుతో డబ్ల్యూడబ్ల్యూఈలో ప్రఖ్యాతి గాంచాడు. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలో జిందాల్ 50వ చాంపియన్ కాగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్.


అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్తగా అండర్సన్ఐసీసీ 2018 అండర్-19 ప్రపంచకప్ ప్రచారకర్త (Ambassador)గా న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరీ అండర్సన్ అక్టోబర్ 5న నియమితుడయ్యాడు. ఈ టోర్నీని 2018 జనవరి 13-ఫిబ్రవరి 3 మధ్య న్యూజిలాండ్‌లో నిర్వహించనున్నారు. ఇప్పటివరకు భారత్, ఆసీస్‌లు మూడుసార్లు కప్ నెగ్గగా.. పాక్ రెండుసార్లు, విండీస్, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌లు ఒక్కోసారి గెలిచాయి. మొత్తం 17 దేశాలు టోర్నమెంటులో పాల్గొననున్నాయి.


గురు సాయిదత్‌కు బల్గేరియన్ ఇంటర్నేషనల్ టైటిల్బల్గేరియన్ ఇంటర్నేషనల్ ఫ్యూచర్ సిరీస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హైదరాబాద్ అగ్రశ్రేణి క్రీడాకారుడు గురుసాయిదత్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో గురు 21-17, 21-16తో ముహమ్మద్ అలీ కర్ట్‌ను 35 నిమిషాల్లో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 


చైనా ఓపెన్ విజేత నాదల్ చైనా ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ టెన్నిస్ దిగ్గజం రాఫెల్ నాదల్ గెలుచుకున్నాడు. అక్టోబర్ 8న జరిగిన ఫైనల్లో నాదల్ 6-2, 6-1 తేడాతో నిక్ కిర్గియోస్‌ను ఓడించాడు. మొత్తంగా నాదల్ కెరీర్‌లో ఇది 75వ టైటిల్ కాగా ఈ సీజన్‌లో ఆరవది.


హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్జపాన్ గ్రాండ్ ప్రి రేసులో బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్’ పొజిషన్‌తో ప్రధాన రేసును ఆరంభించిన హామిల్టన్ అందరికంటే వేగంగా 53 ల్యాపులను 1 గంటా 27ని.31.194 సెకన్లలో పూర్తిచేశాడు. ఈ సీజన్‌లో అతనికిది ఎనిమిదో టైటిల్ కాగా డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో హామిల్టన్ (306)... వెటెల్ (247) కంటే 59 పాయింట్ల తేడాతో ముందంజలో ఉన్నాడు. 


ఆసియా జూనియర్ చాంపియన్ సామియామయన్మార్‌లో జరిగిన ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌కు చెందిన సామియా ఇమాద్ ఫారుఖీ చాంపియన్‌గా నిలిచింది. అక్టోబర్ 8న జరిగిన అండర్-15 మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సామియా (భారత్) 15-21, 21-17, 21-19తో విడ్జజా స్టెఫాని (ఇండోనేసియా)పై నెగ్గి పసిడి పతకాన్ని కై వసం చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ స్వర్ణంతో పాటు 3 కాంస్య పతకాలను సాధించింది. 


ప్రపంచ ఆర్చరీ యూత్ టోర్నీలో భారత జోడీకి స్వర్ణం ప్రపంచ ఆర్చరీ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన మిక్స్‌డ్ జోడి జెమ్సన్ సింగ్-అంకిత భకట్ రికర్వ్ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. తొమ్మిదో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ జోడి ఫైనల్లో 6-2తో ఎర్డెమ్ ఇర్దినీవ్-స్వెత్లానా గొంబొయెవా (రష్యా) జంటపై గెలిచింది. ప్రపంచ ఆర్చరీ చరిత్రలో భారత మిక్స్‌డ్ టీమ్ సాధించిన నాలుగో స్వర్ణం ఇది. గతంలో దీపిక 2009, 2011లో సాధించింది. 2006లో పల్టొన్ హన్‌‌సడా కూడా టైటిల్ గెలిచింది. పురుషుల టీమ్ ఈవెంట్‌లో జెమ్సన్ సింగ్ మరో పతకం గెలిచాడు. 


పీబీఎల్ మూడో సీజన్ వేలం ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్ వేలం అక్టోబర్ 9న జరిగింది. ఇందులో కొత్త ఫ్రాంచైజీ అహ్మదాబాద్ స్మాష్ మాస్టర్స్ హెచ్‌ఎస్ ప్రణయ్‌ను అత్యధికంగా రూ. 62 లక్షలకు సొంతం చేసుకుంది. గత సీజన్‌లో ప్రణయ్‌కు రూ. 25 లక్షలు మాత్రమే లభించాయి. ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా గత ఏడాది చెల్లించిన మొత్తానికి అదనంగా 25 శాతం ఇస్తూ స్టార్ ఆటగాళ్లను వివిధ జట్లు అట్టి పెట్టుకున్నాయి. 
డిఫెండింగ్ చాంపియన్ చెన్నై స్మాషర్స్ రూ. 48.75 లక్షలకు సింధును, అవధ్ వారియర్స్ రూ. 41.25 లక్షలకు సైనా నెహ్వాల్‌ను కొనసాగించగా...పురుషుల టాప్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్ కోసం అవధ్ రూ. 56.10 లక్షలు వెచ్చించింది. రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ కోసం రూ. 50 లక్షలు ఖర్చు చేసి హైదరాబాద్ హంటర్స్ తమతోనే ఉంచుకుంది. పురుషుల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ విక్టర్ అక్సెల్సన్‌ను అతని పాత జట్టు బెంగళూరు బ్లాస్టర్స్ రూ. 50 లక్షలతో కొనసాగించగా...లీగ్‌లోకి తొలిసారి అడుగు పెట్టిన మహిళల వరల్డ్ నంబర్‌వన్ తై జు యింగ్ కోసం కూడా కొత్త టీమ్ అహ్మదాబాద్ రూ. 52 లక్షలు చెల్లించింది. 
అమల్లోకి ఐసీసీ కొత్త నిబంధనలు 
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) రూపొందించిన కొత్త నిబంధనలు సెప్టెంబర్ 28 నుంచి అమల్లోకి వచ్చాయి. 2000 నుంచి ఇప్పటి వరకు అవసరాన్ని బట్టి ఐసీసీ క్రికెట్ నిబంధనల్లో ఆరు సార్లు మార్పుచేర్పులు చేసింది. 
కొత్త నిబంధనలు 
  • ఇప్పటి వరకు బ్యాట్స్‌మన్ ఒక్కసారి మైదానం వీడితే అతడిని వెనక్కి పిలవడానికి లేదు. అయితే అతను నాటౌట్‌గా తేలితే ఇకపై తర్వాతి బంతి వేసే లోపు మళ్లీ వెనక్కి పిలుచుకోవచ్చు. ‘హ్యాండిల్డ్ ద బాల్’ (వికెట్ల వైపు వెళ్లే బంతిని చేతితో ఆపడం) నిబంధనను పూర్తిగా తొలగించి దానిని ‘అబ్‌స్ట్రక్టింగ్ ద ఫీల్డ్’లోకి కలిపేశారు.
  • బ్యాట్ పొడవు, వెడల్పులో ఎలాంటి పరిమితులు లేకపోయినా... బ్యాట్ మందం 67 మిల్లీ మీటర్లకు మించరాదు. అనుమానం వస్తే అంపైర్లు బ్యాట్ మందాన్ని పరికరంతో పరీక్షిస్తారు. ఇప్పటి వరకు వార్నర్ తదితరులు ఎక్కువ మందం కలిగిన భారీ బ్యాట్‌లు వాడుతున్నారు.
  • ఐసీసీ లెవల్ 4 నిబంధన ప్రకారం మైదానంలో ఆటగాడు హద్దు మీరి దురుసుగా ప్రవర్తిస్తే అంపైర్ అతడిని మొత్తం మ్యాచ్‌లో ఆడకుండా తప్పించవచ్చు. ఉద్దేశపూర్వకంగా నోబాల్ వేసినప్పుడు, బ్యాట్స్‌మన్ క్రీజ్ దాటి చాలా ముందుకు వచ్చి గార్డ్ తీసుకున్నప్పుడు చర్యలు తీసుకునే అధికారాన్ని అంపైర్లకు అప్పజెప్పారు.
  • బౌండరీ వద్ద గాల్లోకి ఎగిరి ఫీల్డర్లు పట్టే క్యాచ్‌లు ఇటీవల తరచుగా కనిపిస్తున్నాయి. బౌండరీ దాటి గాల్లోనే దాన్ని లోపలికి తోసి మళ్లీ వాటిని అందుకుంటున్నారు. అయితే ఇందులో మార్పు చేశారు. ఇకపై ఫీల్డర్ బంతిని తాకే సమయంలో కూడా అతను బౌండరీ లోపలే ఉండాలి. లేదంటే బౌండరీగా పరిగణిస్తారు.
  • బౌలర్ బంతిని విసిరిన తర్వాత క్రీజులోకి చేరేలోపు రెండు సార్లు నేలను తాకితే దానిని నోబాల్‌గా పరిగణిస్తారు. పిచ్‌కు దూరంగా బంతి పడినా దానిని నోబాల్‌గానే ప్రకటిస్తారు. నోబాల్ కీపర్‌కు అందకుండా వెళ్లి బౌండరీని తాకితే బౌలర్ నోబాల్ మాత్రమే వేసినట్లు. బైస్‌ను అతని ఖాతాలో కలపరు.
  • బ్యాట్స్‌మన్ షాట్ కొట్టిన తర్వాత బంతి ఫీల్డర్ లేదా వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగిలి వచ్చినా సరే... ఫీల్డర్ క్యాచ్ పడితే దానిని అవుట్‌గా పరిగణిస్తారు. ఇప్పటి వరకు అలా వస్తే అది నాటౌట్‌గా ఉండేది.
  • బ్యాట్స్‌మన్ పరుగు పూర్తి చేసే సమయంలో ఫీల్డర్/కీపర్ వికెట్లు పడగొట్టడానికి ముందే అతని బ్యాట్‌గానీ, అతనుగానీ క్రీజులో చేరి... ఆ తర్వాత బ్యాట్ గాల్లోకి ఎగరడం లేదా బ్యాట్స్‌మన్ నియంత్రణ కోల్పోయినా అతను సురక్షితంగా క్రీజులో అడుగు పెట్టినట్లే లెక్క. దానిని రనౌట్‌గా పరిగణించరు.
  • అంతర్జాతీయ టి20ల్లో కూడా అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి (డీఆర్‌ఎస్)ను అమలు చేస్తారు. ఒక ఇన్నింగ్‌‌సలో ఒక రివ్యూకు అవకాశం ఉంటుంది. టెస్టుల్లో రివ్యూ చేసిన సమయంలో ‘అంపైర్ నిర్ణయం’ సరైనదిగా డీఆర్‌ఎస్ చూపించినప్పుడు జట్టు ఒక రివ్యూను కోల్పోదు. దీని వల్ల ఇకపై ఇన్నింగ్‌‌సకు 2 రివ్యూలు మాత్రమే ఉంటాయి. 80 ఓవర్ల తర్వాత అదనంగా మరో 2 రివ్యూలు చేరడం ఉండదు.

అండర్-14 ప్రపంచ చెస్ చాంపియన్ ధనుమూరి జిషిత ఉరుగ్వే రాజధాని మాంటివీడియోలో జరిగిన ప్రపంచ యూత్ చెస్ చాంపియన్‌షిప్ అండర్-14 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ధనుమూరి జిషిత టైటిల్‌ను దక్కించుకుంది. నిర్ణీత 11 రౌండ్లకుగాను జిషిత తొమ్మిది పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. ఈ విజయంతో జిషిత ఆంధ్రప్రదేశ్ నుంచి అండర్-14 బాలికల విభాగంలో విశ్వవిజేతగా నిలిచిన మూడో క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో కోనేరు హంపి (2000లో స్పెయిన్‌లో), ద్రోణవల్లి హారిక (2004లో గ్రీస్‌లో) ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా భారత్ నుంచి ఈ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆరో క్రీడాకారిణి జిషిత. హంపి, హారికలతోపాటు పద్మిని రౌత్ (2008లో), మహాలక్ష్మి (2012లో), వైశాలి (2015లో) కూడా టైటిల్స్‌ను సాధించారు. 
రన్నరప్‌గా అర్జున్ అండర్-14 ఓపెన్ విభాగంలో వరంగల్ జిల్లాకు చెందిన ఎరిగైసి అర్జున్ రన్నరప్‌గా నిలిచాడు. నిర్ణీత 11 రౌండ్లు పూర్తయ్యాక అర్జున్ 9 పాయింట్లతో రెండో స్థానాన్ని పొందాడు. అండర్-18 బాలికల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సాక్షి చిత్లాంగె ఎనిమిది పాయింట్లతో రన్నరప్‌గా నిలిచి రజత పతకాన్ని సాధించింది.


ఆసియా ఇండోర్ క్రీడల్లో 11వ స్థానంలో భారత్ తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గబాత్‌లో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో భారత్ 9 స్వర్ణాలు, 12 రజతాలు, 19 కాంస్యాలతో కలిపి మొత్తం 40 పతకాలతో 11వ స్థానంలో నిలిచింది. 245 పతకాల(89 స్వర్ణాలు, 70 రజతాలు, 86 కాంస్యాల)తో తుర్క్‌మెనిస్తాన్ తొలి స్థానంలో నిలవగా.. 42 స్వర్ణాలు, 32 రజతాలు, 23 కాంస్యాలతో కలిపి మొత్తం 97 పతకాలతో చైనా రెండో స్థానంలో నిలిచింది. ఐరాన్ 118 పతకాలతో మూడో స్థానంలో ఉంది. 


ప్రపంచ బ్యాడ్మింటిన్ సమాఖ్య ర్యాంకింగ్స్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్ 28న ప్రకటించిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో భారత్ నుంచి తొలిసారి ఐదుగురు క్రీడాకారులు టాప్-20లో నిలిచారు. కిడాంబి శ్రీకాంత్ 9వ స్థానంలో, హెచ్‌ఎస్ ప్రణయ్ 15వ స్థానంలో, సాయిప్రణీత్ 17వ స్థానంలో, సమీర్ వర్మ 19వ స్థానంలో, అజయ్ జయరామ్ 20వ స్థానంలో ఉన్నారు. మహిళల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో పీవీ సింధు రెండో స్థానంలో, సైనా నెహ్వాల్ 12వ స్థానంలో కొనసాగుతున్నారు.

దులీప్ ట్రోఫీ విజేత ఇండియా ‘రెడ్’ 
దేశవాళీ క్రికెట్ సీజన్‌లో తొలి టోర్నమెంట్ దులీప్ ట్రోఫీలో ఇండియా ‘రెడ్’ జట్టు విజేతగా నిలిచింది. ఇండియా ‘బ్లూ’తో జరిగిన ఫైనల్లో ఇండియా ‘రెడ్’ 163 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన వాషింగ్టన్ సుందర్‌కు (130 పరుగులు; 11 వికెట్లు) ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది. 


మలేసియా గ్రాండ్ ప్రి విజేత వెర్‌స్టాపెన్మలేసియా గ్రాండ్‌ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్(20) విజేతగా నిలిచాడు. నెదర్లాండ్‌‌సకు చెందిన ఈ డ్రైవర్ నిర్ణీత 56 ల్యాప్‌లను అందరికంటే వేగంగా గంటా 30 నిమిషాల 01.290 సెకన్లలో ముగించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రికియార్డో (రెడ్‌బుల్) మూడో స్థానంలో, వెటెల్ (ఫెరారీ) నాలుగో స్థానంలో, బొటాస్ (మెర్సిడెస్) ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్ ఆరో స్థానాన్ని సంపాదించగా... ఒకాన్ పదో స్థానాన్ని పొందాడు. 


ఆసీస్‌తో వన్డే సీరీస్‌ను గెలుచుకున్న భారత్ ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను భారత్ 4-1తో గెలుచుకుంది. అక్టోబర్ 1న జరిగిన చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. సిరీస్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 

చైనా, రష్యాపై ఐడబ్ల్యూఎఫ్ ఏడాది నిషేధంబీజింగ్ (2008), లండన్ (2012) ఒలింపిక్స్‌లో చైనా, రష్యా వెయిట్‌లిఫ్టర్లకు నిర్వహించిన డోప్ టెస్టులను మళ్లీ పరీక్షించగా... కనీసం మూడు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దాంతో ఈ రెండు దేశాలపై అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) ఏడాదిపాటు నిషేధం విధించింది. ఫలితంగా ఏడాదిపాటు నిషేధం ఎదుర్కొంటున్న దేశాలు అర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, మాల్డొవా, కజకిస్తాన్, టర్కీ, ఉక్రెయిన్ సరసన చైనా, రష్యా కూడా చేరాయి. ఈ తొమ్మిది దేశాలు ఈ ఏడాది డిసెంబర్‌లో అమెరికాలో జరిగే ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌కు దూరమయ్యాయి. వచ్చే ఏడాది జరిగే ఆసియా క్రీడలకు కూడా చైనా లిఫ్టర్లు దూరం కానున్నారు.