Sunday, 11 February 2018

జనవరి 2018 స్పోర్ట్స్

ఐపీఎల్ - 2018 వేలంఐపీఎల్ సీజన్ 11కు సంబంధించిన 2018 వేలం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గతేడాదిలాగే ఈ ఏడాదీ ఫ్రాంచైజీలన్నీ వేలంలో అతనిపైనే గాలం వేశాయి. మొత్తానికి రూ.12.50 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ వశమయ్యాడు స్టోక్స్. గతేడాది (రూ. 14.50 కోట్లు; పుణే)తో పోలిస్తే 2 కోట్లు తక్కువైనా... అప్పుడు ఇప్పుడు వేలంలో అగ్రస్థానం అతనికే లభించింది. ఇదే జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీశ్ పాండేను రూ.11 కోట్లకు దక్కించుకుంది. 
2018 వేలంలో..
అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య - 169
మొత్తం భారత ఆటగాళ్లు - 113 
అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు - 56 
మొత్తం విదేశీ ఆటగాళ్లు - 71 
ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం - రూ. 431 కోట్ల 70 లక్షలు 

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రోజర్ ఫెడరర్ 
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందడం ద్వారా 36 ఏళ్ల రోజర్ తన కెరీర్‌లో 20వ టైటిల్‌ను గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్... 
టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్. దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. 


ఇండోనేషియా ఓపెన్ విజేత తై జు యింగ్
ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ) గెలుచుకుంది. జనవరి 28న జరిగిన ఫైనల్లో తై జుయి యింగ్.. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 


ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కరోలిన్ వోజ్నియాకి
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను డెన్మార్ స్టార్ కరోలిన్ వోజ్నియాకి సొంతం చేసుకుంది. జనవరి 27న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా 11 ఏళ్ల తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. 


టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 27న ముగిసిన మూడో టెస్టును భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికా వశమైంది.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్ తరఫున గతంలో ద్రవిడ్, సచిన్, అశ్విన్ దీనిని గెల్చుకున్నారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన కోహ్లి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించడంతో పాటు ఆ రెండు టీమ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపిక కావడం కోహ్లికి లభించిన మరో అరుదైన గౌరవం. 
మరో ప్రధాన అవార్డు ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు లభించింది. ఇంగ్లండ్‌పై భారత యువ లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్ (6/25) 2017 టి20 అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు హసన్ అలీ (పాకిస్తాన్)కు దక్కగా... అఫ్ఘానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. 
ఐసీసీ టెస్టు ఎలెవన్, వన్డే ఎలెవన్ జట్లను కూడా ప్రకటించింది. టెస్టు జట్టులో భారత్ తరఫున చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. మూడో డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, పేస్ అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా వన్డే టీమ్‌లోకి ఎంపికయ్యారు. వార్నర్, స్టోక్స్, డి కాక్ రెండు జట్లలోనూ ఉన్నారు. 
ఐసీసీ టెస్టు ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), ఎల్గర్, వార్నర్, స్మిత్, పుజారా, స్టోక్స్, డి కాక్, అశ్విన్, స్టార్క్, రబడ, అండర్సన్. 
ఐసీసీ వన్డే ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), వార్నర్, రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డివిలియర్స్, డి కాక్, స్టోక్స్, బౌల్ట్, హసన్ అలీ, రషీద్ ఖాన్, బుమ్రా.
అవార్డు విజేతలు
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్:
 స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: హసన్ అలీ(పాకిస్తాన్)
ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్: పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడం.
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్: మరాయిస్ ఎరాస్‌మస్ (దక్షిణాఫ్రికా)


900 రేటింగ్ పాయింట్ల మార్క్‌ని అందుకున్న కోహ్లీ జనవరి 18న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్‌‌సలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు-1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 
గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) 900 పాయింట్ల మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు. 


అంధుల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్అంధుల క్రికెట్ వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి కప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2014లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలుచుకుంది. గతేడాది టి20 వరల్డ్‌కప్ సైతం సొంతం చేసుకుంది.
బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్‌‌స ఆడిన సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.


రిషబ్ పంత్ సూపర్ ఫాస్ట్ సెంచరీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (38 బంతుల్లో 116 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్‌‌స ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి.. భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డుని నెలకొల్పాడు. జనవరి 14న ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఢిల్లీ విజయాన్నందుకుంది.
వేగవంతమైన సెంచరీ రికార్డులో.. పంత్ కంటే ముందు వరుసలో గేల్ (30 బంతుల్లో 100) ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌పై బెంగళూరు తరఫున గేల్ ఈ ఘనత సాధించాడు. 


పీబీఎల్ 2017-18 చాంపియన్ హైదరాబాద్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ విజేతగా నిలిచింది. జనవరి 14న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4-3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించి.. తొలిసారి పీబీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 

స్కీయింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి అంచల్ ఠాకూర్ స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో స్లాలోమ్ రేస్ విభాగంలో అంచల్ కాంస్య పతకం గెలిచింది.

జాతీయ సీనియర్ కబడ్డీ చాంప్స్ హిమాచల్, మహారాష్ట్రజాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజేతలుగా నిలిచాయి. జనవరి 5న హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 38-35తో ఇండియన్ రైల్వేస్‌పై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల టైటిల్ పోరులో మహారాష్ట్ర 34-29తో సర్వీసెస్‌ను ఓడించింది. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షులు జేఎస్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.


డోపింగ్‌లో పట్టుబడ్డ యూసుఫ్ పఠాన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడి.. ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతేడాది మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. అయితే ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు అతని నిషేధాన్ని తగ్గించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ ఐదు నెలల నిషేధంతో సరిపెట్టింది. 2018 జనవరి 14న ఈ నిషేధం ముగుస్తుందని బోర్డు ప్రకటించింది. 


టాటా ఓపెన్ మహారాష్ట్ర విజేత సిమోన్టాటా ఓపెన్ మహారాష్ట్ర టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గైల్స్ సిమోన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్ ఫైనల్లో 7-6 (7/4), 6-2తో ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్‌కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


ఫెడరర్, బెన్సిచ్‌లకు హాప్‌మన్ కప్ - 2017ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 6న జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. తొలుత ఫైనల్స్ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6-7 (4/7), 6-0, 6-2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6-4, 6-1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్-బెన్సిచ్ జోడీ 4-3 (5/3), 4-2తో కెర్బర్-జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. 
30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు. 


యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సీరీస్‌ని ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుంది. జనవరి 8న ముగిసిన సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్‌‌స 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్‌‌సకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.


వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017 విజేత ఆనంద్ మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు. 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. 

రంజీ ట్రోఫీ - 2017 చాంపియన్ విదర్భ విదర్భ జట్టు రంజీ ట్రోఫీ సరికొత్త విజేతగా నిలిచింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జనవరి 1న ముగిసిన ఫైనల్లో విదర్భ 9 వికెట్ల తేడాతో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీపై విజయం సాధించి.. ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. 


వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఆనంద్‌కు కాంస్యం వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు.
 

డిసెంబర్ 2017 స్పోర్ట్స్

తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్లోకి విదర్భ రంజీ ట్రోఫీ చరిత్రలో విదర్భ జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ మేరకు డిసెంబర్ 21న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌‌సలో ముగిసిన రంజీ ట్రోఫీ రెండో సెమీఫైనల్లో విదర్భ 5 పరుగుల తేడాతో కర్ణాటకను ఓడించింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి 12 వికెట్లు పడగొట్టిన గుర్బానికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. డిసెంబర్ 29 నుంచి ఇండోర్‌లో జరిగే ఫైనల్లో ఢిల్లీతో విదర్భ తలపడుతుంది.

బర్మింగ్‌హామ్‌లో 2022 కామన్వెల్త్ గేమ్స్ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ నగరం 2022 కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులను దక్కించుకుంది. ఈ మేరకు సీడబ్ల్యూజీ సమాఖ్య అధ్యక్షుడు లూయిస్ మార్టిన్ డిసెంబర్ 21న వెల్లడించారు. నిజానికి 2022కు సంబంధించి 2015లోనే డర్బన్‌కు ఆతిథ్య హక్కులు కట్టబెట్టారు. అయితే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దక్షిణాఫ్రికా తమ వల్ల కాదని చేతులెత్తేయడంతో మరో వేదికను ఎంపిక చేయాల్సివచ్చింది. 2022 సంవత్సరం జూలై 27 నుంచి 7 వరకు జరగనున్న ఈ మెగా ఈవెంట్ బడ్జెట్ 14 వేల కోట్లు (1.845 బిలియన్ యూరోలు)గా నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో గ్రేట్ బ్రిటన్‌లో మరో నగరం అంతర్జాతీయ క్రీడా వేదికగా మారనుంది. మాంచెస్టర్ (2002 కామన్వెల్త్), లండన్ (2012 ఒలింపిక్స్), గ్లాస్గో (2014 కామన్వెల్త్) ఇప్పటికే మెగా ఈవెంట్స్‌కు వేదికలుగా నిలిచాయి. 


కృష్ణపట్నంలో జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం పోర్టులో జాతీయస్థాయి సెయిలింగ్ పోటీలు డిసెంబర్ 21న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. యాచెట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సీనియర్ యూత్ నేషనల్ చాంపియన్ షిప్ పేరుతో తలపెట్టిన ఈ పోటీలను పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి ప్రారంభించారు. ఇక్కడే డిసెంబర్ 27 నుంచి 31వ తేదీ వరకు తొమ్మిదోవ ఇంటర్నేషనల్ యూత్ సెయిలింగ్ పోటీలు జరగనున్నాయి. వీటిల్లో భారతదేశంతోపాటు ఆసియా దేశాల్లోని 400 మంది సెయిలర్లు పాల్గొంటారు.

టీ20ల్లో రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ 
అంతర్జాతీయ టీ 20ల్లో వేగవంతమైన సెంచరీ రికార్డుని భారత బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ సమం చేశాడు. డిసెంబర్ 22న ఇండోర్‌లో శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో రోహిత్.. 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. తద్వారా ఇటీవలే బంగ్లాదేశ్‌పై డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా) నమోదు చేసిన 35 బంతుల్లోనే శతకం రికార్డుని రోహిత్ శర్మ సమం చేశాడు. 


విజేందర్‌కు ఆసియా పసిఫిక్ సూపర్ టైటిల్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో అడుగు పెట్టినప్పటి నుంచి ఓటమి ఎరుగకుండా దూసుకెళ్తున్న భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో వరుసగా పదో విజయం వచ్చి చేరింది. ఘనా బాక్సర్ ఎర్నెస్ట్ అముజుతో డిసెంబర్ 23న జైపూర్‌లో జరిగిన బౌట్‌లో విజేందర్ ఏకపక్ష విజయాన్ని సాధించాడు. మూడు నిమిషాల నిడివిగల 10 రౌండ్ల బౌట్‌లో విజేందర్ పూర్తి ఆధిపత్యం చలాయించాడు. బౌట్‌ను పర్యవేక్షించిన ముగ్గురు న్యాయ నిర్ణేతలు విజేందర్‌కు 100 పాయింట్ల చొప్పున ఇవ్వగా... అముజుకు 90 పాయింట్లు మాత్రమే ఇచ్చారు. ఈ విజయంతో 32 ఏళ్ల విజేందర్ డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 


గల్యమ్ జరిల్‌గపోవ్ బాక్సింగ్ టోర్నీలో శ్యామ్ కుమార్‌కు స్వర్ణం గల్యమ్ జరిల్‌గపోవ్ స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు మెరిశారు. మూడు స్వర్ణాలతోపాటు ఒక్కో రజత, కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు. కజకిస్తాన్‌లోని కరాగండ పట్టణంలో డిసెంబర్ 24న ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ 49 కేజీల విభాగంలో పసిడి పతకాన్ని కై వసం చేసుకున్నాడు. జాతీయస్థాయి పోటీల్లో రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహించే వైజాగ్ బాక్సర్ శ్యామ్ ఫైనల్లో 3-0తో జన్‌సెతోవ్ (కిర్గిస్తాన్)పై... సెమీఫైనల్లో 4-1తో అయితోజనోవ్ (రష్యా)పై గెలిచాడు. భారత్‌కే చెందిన నమన్ తన్వర్ (91 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) కూడా స్వర్ణ పతకాలను గెల్చుకున్నారు. నమన్ తన్వర్‌కు టోర్నమెంట్ బెస్ట్ బాక్సర్ పురస్కారం కూడా లభించింది. మనీశ్ కౌశిక్ (60 కేజీలు) రజతం... మన్‌దీప్ జాంగ్రా (75 కేజీలు) కాంస్య పతకం సాధించారు. 


శ్రీలంకతో టీ20 సీరీస్‌ను కైవసం చేసుకున్న భారత్ శ్రీలంకతో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సీరీస్‌ను భారత్ 3-0 తేడాతో గెలుచుకుంది. డిసెంబర్ 24న జరిగిన ఆఖరి టి20లో భారత్ 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది. ఉనాద్కట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. తాజా విజయంతో భారత్ ఐసీసీ టి20 ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానానికి ఎగబాకింది. 

టీ20లో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడు వాషింగ్టన్అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా వాషింగ్టన్ సుందర్ (18 ఏళ్ల 80 రోజులు) రికార్డు సృష్టించాడు. ముంబైలో శ్రీలంకతో జరిగిన టి20 మ్యాచ్‌లో ఆడటం ద్వారా.. సుందర్ ఈ రికార్డు నమోదు చేశాడు. 
భారత్ తరఫున అరంగేట్రం చేసిన పిన్న వయస్సు టాప్-5 క్రికెటర్లలో సుందర్ తర్వాత రిషభ్ పంత్ (19 ఏళ్ల 120 రోజులు; ఇంగ్లండ్‌పై ఫిబ్రవరి 1న, 2017).. ఇషాంత్ (19 ఏళ్ల 152 రోజులు; ఆస్ట్రేలియాపై ఫిబ్రవరి 1న, 2008)... రైనా (20 ఏళ్ల నాలుగు రోజులు; దక్షిణాఫ్రికాపై డిసెంబర్1న, 2006)... రవీంద్ర జడేజా (20 ఏళ్ల 66 రోజులు; శ్రీలంకపై ఫిబ్రవరి 10న, 2009) ఉన్నారు. 


ఐసీసీటి20 ర్యాంకింగ్స్ లో రెండోస్థానంలో భారత్ శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు ఐసీసీ టి20 ర్యాంకింగ్‌‌సలో 121 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. 124 పాయింట్లతో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉండగా... ఇంగ్లండ్ మూడు, న్యూజిలాండ్ నాలుగు, వెస్టిండీస్ అయిదో స్థానంలో నిలిచాయి. వ్యక్తిగత ర్యాంకింగ్‌‌సలో 824 పాయింట్లతో నంబర్ వన్‌గా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి వివాహం కారణంగా లంకతో సిరీస్ ఆడలేదు. దీంతో 48 పాయింట్లు కోల్పోయి 776 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఫించ్ (784 పాయింట్లు), విండీస్ ఆటగాడు ఎవిన్ లూయీస్ (780) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య నాలుగు రోజుల టెస్ట్ సంప్రదాయ టెస్టుకు కాస్త భిన్నంగా నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, జింబాబ్వేల మధ్య జరిగింది. దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ వేదికగా డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ డే అండ్ నైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్‌‌స, 120 పరుగులతో జింబాబ్వే ఓడిపోయింది. 
1972-73 తర్వాత ఐదు రోజులు కాకుండా ఒక టెస్టు నాలుగు రోజుల్లో జరగనుండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఆరు రోజులు, కొన్ని సార్లయితే మూడు నుంచి పది రోజుల టెస్టులు కూడా జరిగాయి. 1938-39లో చివరిసారిగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య డర్బన్‌లో జరిగిన పది రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 1972 సీజన్ తర్వాత టెస్టు ప్రామాణికంగా ఐదు రోజుల ఆటైంది. 


జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా రికార్డు జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా సయ్యద్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది. 25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో అనీసా (హరియాణా) 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. శీతల్ శివాజీ థోరాట్, రాహీ సర్ణోబత్‌లు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. 


క్రీడాకారుల్లో ఆల్‌టైమ్ ధనవంతుడు జోర్డాన్అత్యధిక ధనవంతమైన ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్రీడాకారుల జాబితాలో అమెరికా బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు మైకేల్ జోర్డాన్ అగ్రస్థానంలో ఉన్నాడు. జోర్డాన్ మొత్తం సంపాదన రూ. 11,881 కోట్లు (1.85 బిలియన్ డాలర్లు). ‘ఫోర్బ్స్’ మేగజైన్ డిసెంబర్14న విడుదల చేసిన Highest-Paid Athletes Of All-Time నివేదిక ఈ వివరాలు వెల్లడించింది.
ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గోల్ఫర్లు టైగర్ వుడ్‌‌స (రూ.10,918 కోట్లు - 1.7 బిలియన్ డాలర్లు), అర్నాల్డ్ పాల్మర్ (రూ.8991 కోట్లు - 1.4 బిలియన్ డాలర్లు) ఉన్నారు. నాలుగు, ఐదు స్థానాల్లో జాక్ నిక్‌లాస్ రూ.7707 కోట్ల (1.2 బిలియన్ డాలర్లు) ఫార్ములావన్ లెజెండ్ మైకేల్ షుమాకర్ (రూ. 6422 కోట్లు; ఒక బిలియన్ డాలర్లు) కొనసాగుతున్నారు.


బీబీసీ అత్యుత్తమ క్రీడాకారుడిగా ఫెడరర్స్విట్జర్లాండ్ టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఏటా అందించే అత్యుత్తమ విదేశీ క్రీడాకారుడి పురస్కారానికి ఎంపికయ్యాడు. ఫెడరర్‌కు ఈ పురస్కారం లభించడం ఇది నాలుగోసారి. 2004, 2006, 2007లో ఈ అవార్డును గెలుచుకున్నాడు.
1960 లో ప్రవేశపెట్టిన ఈ అవార్డులను ఇప్పటివరకు బాక్సింగ్ క్రీడాకారుడు మొహమ్మద్ అలీ (అమెరికా-1973, 1974, 1978), అథ్లెట్ ఉసేన్ బోల్ట్ (జమైకా-2008, 2009, 2012) మూడుసార్లు చొప్పున గెల్చుకున్నారు.


వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ రన్నరప్‌గా సింధు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ ఫైనల్ పోరులో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ఓడిపోయింది. డిసెంబర్ 17న జరిగిన ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ సింధు ప్రపంచ రెండో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్) చేతిలో ఓడిపోయింది. విజేత యామగుచికి 80 వేల డాలర్ల (రూ. 51 లక్షల 26 వేలు) ప్రైజ్‌మనీ... 11 వేల ర్యాంకింగ్ పాయింట్లు; రన్నరప్ సింధుకు 40 వేల డాలర్ల (రూ. 25 లక్షల 63 వేలు) ప్రైజ్‌మనీ... 9,350 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.


శ్రీలంకతో వన్డే సీరీస్ కైవసం చేసుకున్న భారత్ శ్రీలంకతో జరిగిన వన్డే సీరీస్‌ను భారత్ 2 - 1 తేడాతో కైవసం చేసుకుంది. డిసెంబర్ 17న విశాఖపట్నం వేదికగా జరిగిన మూడో వన్డేలో విజయం సాధించిన టీమ్ ఇండియా.. సీరీస్‌ను గెలుచుకుంది. కుల్దీప్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ సిరీస్’ అవార్డులు లభించాయి. కాగా భారత్‌కిది వరుసగా ఎనిమిదో ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయం. 

కామన్వెల్త్ రెజ్లింగ్‌లో సుశీల్‌కు స్వర్ణం మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టోర్నీలో బరిలోకి దిగిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. 74 కేజీల విభాగం ఫైనల్లో ఆకాశ్ ఖుల్లర్ (న్యూజిలాండ్)ను సుశీల్ చిత్తుగా ఓడించాడు. మహిళల విభాగంలో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ 62 కేజీల విభాగం ఫైనల్లో 13-2తో తైలా తుహినే (న్యూజిలాండ్)ను ఓడించి స్వర్ణం దక్కించుకుంది.

యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్‌ల మధ్య జరిగే ప్రతిష్టాత్మక యాషెస్ సీరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మరో రెండు టెస్టులు ఉండగానే స్మీత్ బృందం 3-0తో సీరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 18న ముగిసిన మూడో టెస్టులో స్మిత్ సేన ఇన్నింగ్‌‌స 41 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. 


టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో బ్రాడ్‌మన్ తర్వాత స్మిత్టెస్ట్ క్రికెట్ రేటింగ్స్‌లో దివంగత ఆస్ట్రేలియన్ దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ స్మీవెన్ స్మిత్ కొనసాగుతున్నాడు. తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌‌సలో 945 పాయింట్లతో స్మీత్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్ గ్రేట్ లెన్ హటన్ (945) రికార్డును సమం చేసిన 28 ఏళ్ల స్మిత్... ఆస్ట్రేలియన్ ‘డాన్’కు కేవలం 16 పాయింట్ల దూరంలోనే ఉన్నాడు. బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. సగటుల్లోనూ స్మిత్ (62.32), బ్రాడ్‌మన్ (99.94) తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ నూటికి చేరువగా ఉన్న ఆ దిగ్గజాన్ని అందుకోవడం కష్టమే.

ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌గా రొనాల్డోప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ప్రతిష్టాత్మక ‘బ్యాలన్ డి ఓర్’ అవార్డును 2017 సంవత్సరానికి క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్) గెలుచుకున్నాడు. రొనాల్డో ఈ అవార్డు గెలుచుకోవడం ఇది ఐదోసారి. దీంతో మరో ఆటగాడు లయొనల్ మెస్సీ రికార్డును సమం చేశాడు. ఈ పోటీలో మెస్సీ రెండో స్థానంలో నిలవగా, నెయ్‌మార్‌కు మూడో స్థానం దక్కింది. 


హాకీ వరల్డ్ లీగ్ టోర్నీలో భారత్‌కు కాంస్యంఒరిస్సాలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ (హెచ్‌డబ్ల్యూఎల్) ఫైనల్స్ టోర్నీలో భారత్ కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ప్రపంచ మాజీ చాంపియన్ జర్మనీతో డిసెంబర్ 10న జరిగిన కాంస్య పతక పోరులో టీమిండియా 2-1 గోల్స్ తేడాతో గెలిచి మూడోస్థానంలో నిలిచింది.
ఫైనల్లో ఆస్ట్రేలియా 2-1తో రియో ఒలింపిక్స్ విజేత అర్జెంటీనాను ఓడించి వరుసగా రెండోసారి హెచ్‌డబ్ల్యూఎల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 


రోహిత్ శర్మ డబుల్ సెంచరీల రికార్డుభారత్, శ్రీలంకల మధ్య డిసెంబర్ 13న మొహాలిలో జరిగిన వన్డేలో రోహిత్ శర్మ మూడో డబుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 153 బంతుల్లో 208 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. రోహిత్‌కు ఇది మూడో డబుల్ సెంచరీ. ఆస్ట్రేలియాపై 209 (2013లో బెంగళూరులో), శ్రీలంకపై 264 (2014లో కోల్‌కతాలో) డబుల్ సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు సచిన్, సెహ్వాగ్, క్రిస్ గేల్, గప్టిల్ మాత్రమే ఒక్కో డబుల్ సెంచరీ సాధించారు.


యూత్ బాక్సర్ ఆఫ్ ఇయర్‌గా సచిన్ సివాచ్భారత ప్లేయర్, సచిన్ సివాచ్ ఈ ఏడాదికిగాను ఆసియా యూత్ బాక్సింగ్ సమాఖ్య(ఎబీసీ) ఉత్తమ బాక్సర్‌గా ఎంపికయ్యాడు. గతేడాది ప్రపంచ టైటిల్‌ను సాధించిన సచిన్.. ఈ ఏడాది యూత్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతోపాటు ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకున్నాడు.
భారత్‌కు చెందిన లెన్నీ డి గామకు ఆసియా ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫిషియల్ అవార్డు వచ్చింది. ఆసియా జూనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌తోపాటు ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లోనూ లెన్నీ సేవలందించారు.


ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో అభిషేక్‌కు స్వర్ణంఢాకాలో జరుగుతున్న ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఢిల్లీకి చెందిన అభిషేక్ వర్మ స్వర్ణం సాధించాడు. నవంబర్ 29న ముగిసిన ఫైనల్లో అభిషేక్ పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కిమ్ జాంగ్‌హో (దక్షిణ కొరియా) పై విజేతగా నిలిచాడు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతి సురేఖ మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. ఈ పోటీల్లో అభిషేక్ వర్మ, జ్యోతి సురేఖలకు ఇది రెండో పతకం. ఇది వరకే వీరు మిక్స్‌డ్ కాంపౌండ్ విభాగంలో స్వర్ణం గెలిచారు. 


పదో నంబర్ జెర్సీకి వీడ్కోలు పలికిన బీసీసీఐసచిన్ టెండూల్కర్ ధరించిన పదో నంబర్ జెర్సీకి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనధికారికంగా వీడ్కోలు చెప్పింది. దీంతో ఇక ఆ నంబర్ ను ఆటగాళ్లెవరూ ధరించరు. 2013లో సచిన్ రిటైరయ్యాక ఆ జెర్సీని ఎవరూ వాడలేదు. 2017లో శార్దుల్ ఠాకూర్ తొలి మ్యాచ్‌లో పదో నంబర్ జెర్సీతో కనిపించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో వివాదం రేగడంతో ఆటగాళ్లెవరూ ఆ నంబర్ జెర్సీపై ఆసక్తి చూపడం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ నంబర్‌కూ అధికారికంగా టాటా చెప్పే అవకాశం బీసీసీకు లేదు. 


వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్‌లో మీరాబాయికి స్వర్ణంఅమెరికాలోని అనహెమ్‌లో జరుగుతున్న ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మణిపూర్ వెయిట్ లిఫ్టర్ సయిఖోమ్ మీరాబాయి చాను రెండు బంగారు పతకాలు గెలుచుకుంది. చాను 48 కేజీల కేటగిరీలో స్నాచ్‌లో 85, క్లీన్ అండ్ జెర్క్‌లో 109 కేజీలతో మొత్తం 194 కేజీల బరువెత్తి అగ్రస్థానంలో నిలిచింది. తద్వారా కరణం మల్లేశ్వరి తర్వాత (22 ఏళ్ల అనంతరం) ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ కాంస్య పతక విజేత అయిన మల్లేశ్వరి 1994, 1995 ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌ల్లో వరుసగా స్వర్ణ పతకాలు గెలిచింది.
ఈ ఈవెంట్‌లో 193 కేజీల బరువెత్తిన సుక్చరొన్ తున్యా (థాయ్‌లాండ్) రజతం గెలుపొందగా, సెగురా అనా (182 కేజీలు; ఐర్లాండ్) కాంస్య పతకం దక్కించుకుంది. డోపింగ్‌తో రష్యా, చైనా, కజకిస్తాన్, ఉక్రెయిన్, అజర్‌బైజాన్‌లకు చెందిన లిఫ్టర్లు ఇందులో పాల్గొనే అవకాశం కోల్పోయారు.


మహిళల అండర్-19 విజేత ఆంధ్రా జట్టుబీసీసీఐ మహిళల అండర్-19 వన్డే టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు జాతీయ చాంపియన్‌గా నిలిచింది. గుంటూర్‌లో నవంబర్ 30న జరిగిన ఫైనల్లో ముంబై జట్టుపై 47 పరుగులతో గెలుపొంది టైటిల్‌ను కై వసం చేసుకుంది. 
ఈ టోర్నీలో ‘బెస్ట్ బ్యాట్స్‌మన్ ఆఫ్ ద టోర్నీ’గా ముంబైకి చెందిన జెమీమా (1013 పరుగులు) ఎంపికవగా, ఫాతిమా జఫర్ (26 వికెట్లు) ‘బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డును గెలుచుకుంది.

ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో జ్యోతి సురేఖకు స్వర్ణంఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ స్వర్ణ పతకం గెలుచుకుంది. నవంబర్ 30న జరిగిన మహిళల కాంపౌండ్ టీమ్ విభాగంలో జ్యోతి సురేఖ, పర్వీనా, త్రిషాలతో కూడిన భారత జట్టు 230-227తో కొరియాపై గెలుపొందింది. సురేఖ ఇది వరకే కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్యం, మిక్స్‌డ్ కాంపౌండ్ ఈవెంట్‌లో రజతాన్ని గెలుచుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ 2 స్వర్ణాలు, 3 రజతాలు, ఒక కాంస్యాన్ని సాధించింది.


వరుస టెస్టు విజయాలతో భారత్ ప్రపంచ రికార్డుశ్రీలంకతో డిసెంబర్ 6న ముగిసిన మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో గెలుచుకోవడం ద్వారా భారత్ 9 వరుస టెస్టు విజయాలతో ప్రపంచ రికార్డును సమం చేసింది. దీంతో ఈ ఘనత సాధించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల సరసన భారత్ నిలిచింది. ఈ సిరీస్‌లో రెండు డబుల్ సెంచరీలు చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 2015 నుంచి శ్రీలంక, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై భారత్ వరుస విజయాలు సాధించింది.