Wednesday, 11 October 2017

ఆగస్టు 2017 స్పోర్ట్స్

ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధుకు రజతంప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు రజతం దక్కించుకుంది. ఆగస్టు 27న గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నోజోమి ఒకుహారా సింధును ఓడించి స్వర్ణం గెలుచుకుంది. 2013, 2014లలోను సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. తాజాగా రజతం గెలవడం ద్వారా ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది.
ఇదే టోర్నీ సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్‌కు కాంస్యం దక్కింది. మొత్తంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి. నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ గెలుపొందిన మొత్తం పథకాలు 7.


జాతీయ స్క్వాష్ చాంప్ జోష్నా, సౌరవ్ జాతీయ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప (తమిళనాడు) 15వ సారి, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ గోషాల్ (తమిళనాడు) 12వ సారి చాంపియన్స్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో జోష్నా 3-1తో లక్ష్య (తమిళనాడు)పై, సౌరవ్ 3-1తో మహేశ్ (మహారాష్ట్ర)పై గెలిచారు. 


బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన రేసులో గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. హామిల్టన్‌కు ఈ ఏడాది ఇది ఐదో టైటిల్ కాగా కెరీర్‌లో 200వది. 
 

ప్రొఫెషనల్ కెరీర్‌లో మేవెదర్‌కు 50వ విజయం అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. ఆగస్టు 28న జరిగిన ‘సూపర్ ఫైట్’ బౌట్‌లో 40 ఏళ్ల మేవెదర్ కానర్ మెక్‌గ్రెగోర్ (ఐర్లాండ్)పై టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయం సాధించాడు. తద్వారా పోటీపడిన 50 బౌట్‌లలోను విజేతగా నిలిచిన మేవెదర్, 49 వరుస విజయాలతో అమెరికా హెవీవెయిట్ ప్రొఫెషనల్ బాక్సర్ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో ఖరీదైన బౌట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ పోటీ ద్వారా మేవెదర్ సుమారు 20 కోట్ల డాలర్లు (రూ.1,277 కోట్లు)... మెక్‌గ్రెగోర్ సుమారు 10 కోట్ల డాలర్లు (రూ. 638 కోట్లు) ఆర్జించారు.
2015లో మ్యానీ పకియావ్ (ఫిలిప్పీన్స్‌)తో జరిగిన బౌట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన మేవెదర్ కెరీర్‌లో 50వ విజయం సాధించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు.


క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం ప్రత్యేక పోర్టల్ క్షేత్ర స్థాయి నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు కేంద్ర క్రీడా శాఖ రూపొందించిన ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ’ పోర్టల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆగస్టు 28న ఆవిష్కరించారు. ఎనిమిదేళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఏదైనా క్రీడల్లో నైపుణ్యం ఉంటే www.nationalsportstalenthunt.com పోర్టల్‌లో తమ బయోడేటా లేక వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి క్రీడా శాఖ తగినవారిని ఎంపిక చేసి తమ ‘సాయ్’ కేంద్రాల్లో శిక్షణ ఇస్తుంది. అలాగే ఎనిమిదేళ్లపాటు రూ.5 లక్షల చొప్పున వెయి్య స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. 


బీసీసీఐ ఆఫీస్ బేరర్లను తొలగించండి : సీఓఏ 
జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు తీరుపై పరిపాలక కమిటీ (సీఓఏ) తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయంలో ఏమాత్రం సహకారం అందించడం లేదని, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుధ్ చౌదరి, కార్యదర్శి అమితాబ్ చౌదరి సహా ఆఫీస్ బేరర్లను తొలగించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ మేరకు తమ ఐదో స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందించింది. ఈ 26 పేజీల నివేదికలో బోర్డు పనితీరుపై ఘాటుగా స్పందించింది.

బల్గేరియా ఓపెన్ సింగిల్స్ విజేత లక్ష్య సేన్ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్, భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ సీనియర్ స్థాయిలో బల్గేరియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 17న పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ 18-21, 21-12, 21-17తో రెండో సీడ్ జ్వొనిమిర్ దుర్కిన్‌జాక్ (క్రొయేిషియా)పై గెలుపొందాడు. ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పీటర్ గేడ్ (డెన్మార్క్) వద్ద పది రోజులపాటు శిక్షణ తీసుకున్న లక్ష్యసేన్ ఈ ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కూడా నిలిచాడు. 


ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత శివాని పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడా కారిణి గద్దె రుత్విక శివాని చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక శివాని 21-10, 21-13తో ఐదో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచే క్రమంలో ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన రుత్విక శివాని తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రుత్విక నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.
 

హాకీ ఆసియాకప్ స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్ బంగ్లాదేశ్‌లో అక్టోబర్ నుంచి జరిగే ఆసియాకప్ హాకీ టోర్నీకి హీరో మోటోకార్ప్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత బంగ్లా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ ఢాకాలోని మౌలానా భషానీ జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కి తాము భాగస్వామిగా వ్యవహరిస్తున్నామని, ప్రస్తుతం దీన్ని ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్)కు విస్తరిస్తున్నామని హీరో సంస్థ చీఫ్ పవన్ ముంజాల్ తెలిపారు. 


ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నాదల్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సంఘం (ఏటీపీ) ఆగస్టు 21న విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. 2014 జూలై తర్వాత నాదల్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు టాప్ ర్యాంకులో ఉన్న ఆండీ ముర్రే (బ్రిటన్) రెండోస్థానానికి పడిపోయాడు. ఇటీవల జరిగిన సిన్సినాటీ టోర్నీలో నాదల్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. గాయం కారణంగా ముర్రే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ర్యాంకింగ్‌‌సలో నాదల్ ఎగబాకాడు. 
తాజా ర్యాంకింగ్‌‌సలో నాదల్, ముర్రే , రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), నోవాక్ జొకోవిచ్ (సెర్బియా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), దిమిత్రోవ్, కీ నిషికోరి (జపాన్) వరుసగా తొలి పది స్థానాల్లో నిలిచారు. 


ఫిబా ఆసియా కప్ విజేత ఆస్ట్రేలియా ఫిబా ఆసియా బాస్కట్‌బాల్ కప్ (ఫిబా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్)ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఆగస్టు 21న జరిగిన ఫైనల్లో ఆసీస్ 79-56తో ఇరాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఇదే తొలిసారి. చైనా అత్యధికంగా 16 సార్లు ఈ కప్‌ను కైవసం చేసుకుంది. 


‘సిన్సినాటి’ చాంపియన్స్ దిమిత్రోవ్, ముగురుజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), మహిళల సింగిల్స్‌లో ముగురుజా (స్పెయిన్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో దిమిత్రోవ్ 6-3, 7-5తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై... నాలుగో సీడ్ ముగురుజా 6-1, 6-0తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై విజయం సాధించారు. చాంపియన్‌‌సగా నిలిచిన దిమిత్రోవ్‌కు 9,54,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 12 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... ముగురుజాకు 5,22,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 35 లక్షలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


ప్రపంచ అథ్లెటిక్స్‌లో బార్బరా స్పొటకోవాకు స్వర్ణం 
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవా స్వర్ణం గెలుచుకుంది. ఆగస్టు 9న జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 36 ఏళ్ల స్పొటకోవా ఈటెను 66.76 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించింది. తద్వారా 2007 ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన స్పొటకోవా పదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. 
పురుషుల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ వేడ్ వాన్ నికెర్క్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 43.98 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. 


పారా అథ్లెట్ సువర్ణారాజ్‌కు ఎన్‌సీపీఈడీపీ పురస్కారం ప్రముఖ పారా అథ్లెట్ సువర్ణారాజ్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వికలాంగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నందుగు గుర్తింపుగా National Centre for Promotion of Employment for Disabled People(NCPEDP) అందజేసే Mphasis Universal Design Award for 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. 


కెరీర్ చివరి రేసులో విఫలమైన ఉసేన్ బోల్డ్ జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుని పూర్తి చేయకుండానే కెరీర్ ముగించాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 12న జరిగిన 4 × 100 మీటర్ల రిలేలో తొడ కండరాలు పట్టేయడంతో బోల్ట్ రేసుని ముగించలేకపోయాడు.
ఈ రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్‌బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్‌లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. 
అన్నీ స్వర్ణాలే... బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (100 మీ.) నెగ్గాడు. ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4×100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. 


ఆసియా షాట్‌గన్ పోటీల్లో రష్మీ జంటకు స్వర్ణంఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజైన ఆగస్టు 13న భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ తన భాగస్వామి మేరాజ్ అహ్మద్ ఖాన్‌తో కలిసి భారత్‌కు స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో రష్మీ-మేరాజ్ ద్వయం 28-27తో లియూ జియాంగ్‌చి-గావో జియాన్‌మీ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఈ పోటీల్లో ఓవరాల్‌గా భారత్ ఎనిమిది పతకాలు సాధించింది. 
 

జావెలిన్ త్రో ఫైనల్లో దవీందర్‌కు 12వ స్థానంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన దవీందర్ సింగ్.. ఫైనల్లో 12వ స్థానంలో నిలిచాడు. అతను ఈటెను 80.02 మీటర్ల దూరం విసిరాడు. 


విదేశీగడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆగస్టు 14న ముగిసిన మూడో టెస్టులో 171 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. తద్వారా విదే శాల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇటువంటి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. గతంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో నెగ్గింది. మూడో టెస్టులో రాణించిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.. సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 


టెస్టుల్లో ధోని రికార్డుని అధిగమించిన కోహ్లి విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ఈ ఘనతను నమోదు చేశాడు. గతంలో ధోని ఆరు విదేశీ టెస్టు విజయాల్ని సాధించగా శ్రీలంకపై విజయం కోహ్లీకి ఏడోది. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ తన కెరీర్‌లో 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించాడు. భారత కెప్టెన్ గా గంగూలీ 49 టెస్టులకు సారథ్యం వహించగా, ధోని 60 టెస్టులకు, కోహ్లి 29 టెస్టులకు సారథిగా పనిచేశాడు. 


అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రోజర్స్ కప్ఏటీపీ మాస్టర్స్ సిరీస్ రోజర్స్ కప్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గెలుచుకున్నాడు. మాంట్రియల్ (కెనడా)లో ఆగస్టు 15న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)ను అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హెర్బర్ట్, మహుట్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది.

ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లులండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత తాను రిటైరవుతున్నట్లు ప్రకటించిన జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. ఈ మేరకు ఆగస్టు 1న బోల్ట్ తల్లిదండ్రులు వెల్లెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ ఈ బూట్లను అతనికి అందజేశారు. 
ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. 
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 4న జరగనున్న రేసు బోల్ట్ కెరీర్‌లో చివరి పరుగుపందెం. 


నెమార్ కోసం 1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీబ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెమార్ జూనియర్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్-జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్ జట్టు భారీ మొత్తం చెల్లించింది. ప్రొఫెషనల్ లీగ్‌‌సలో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెమార్ ఇక నుంచి పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెమార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది. అయితే నెమార్‌ను ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ.1,661 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది. 2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెమార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. దీంతో ఇది ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీగా నిలిచింది. 


ఆసియా షాట్‌గన్ షూటింగ్‌లో అంకుర్‌కు స్వర్ణం
 

ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ-70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్‌షమ్సీ (యూఏఈ-53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. 


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫరాకు స్వర్ణం 
లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా స్వర్ణం సాధించాడు. ఆగస్టు 5న జరిగిన పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో వరుసగా మూడో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. 


డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ విజేత విజేందర్భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో ఆగస్టు 5న జరిగిన బౌట్‌లో 3-0తో విజయం సాధించాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను విజేందర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. 


చివరి 100 మీటర్ల రేసులో బోల్ట్‌కు కాంస్యం 
జమైకా దిగ్గజం ఉసేన్ బోల్డ్ తన చివరి 100 మీటర్ల రేసులో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసులో ఉసేన్ బోల్డ్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలువగా... క్రిస్టియన్ కోల్మన్ 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
బోల్ట్ రికార్డులు 
ఒలింపిక్స్ (2008, 2012, 2016): 8 స్వర్ణాలు 
ప్రపంచ చాంపియన్‌షిప్ (2007, 2009, 2011, 2013, 2015, 2017): 11 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం 
ఇతర అంతర్జాతీయ పతకాలు: 4 స్వర్ణాలు, 3 రజతాలు 
బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు
100 మీ. పరుగు: 9.58 సెకన్లు
200 మీ. పరుగు: 19.19 సెకన్లు
4×100 మీ. రిలే: 36.84 సెకన్లు (జమైకా జట్టులో సభ్యుడు) 


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టోరి బోవికి స్వర్ణం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన అథ్లెట్ టోరి బోవీ స్వర్ణం సాధించింది. ఆగస్టు 7న జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో ఆమె 10.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఫేవరేట్ ఎలైన్ థాంప్సన్ (జమైకా) 5వ స్థానంలో నిలిచింది. ఐవరీ కోస్ట్‌కు చెందిన మారి జోన్ రజతం, నెదర్లాండ్స్‌కు చెందిన షిప్పర్స్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 
పురుషుల షాట్‌పుట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన థామస్ వాల్ష్ గుండును 22.02 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు స్వర్ణంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్ రోజస్ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్-14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. 


టెస్టుల్లో ఆల్‌రౌండర్ గా జడేజా
ఆగస్టు 8న విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్‌‌స ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా అగ్రస్థానం అందుకున్నాడు. జడేజా 438 పాయింట్లతో తొలిస్థానం కైవసం చేసుకోగా ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న షకీబ్ ఉల్ హసన్ (బంగ్లాదేశ్) 431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్‌‌సలోనూ జడేజా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. 
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌‌సలో పుజారా (888 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (813 పాయింట్లు) ఐదో స్థానంలో, రహానే (776 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్) వరుసగా తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు. 

Wednesday, 23 August 2017

జులై 2017 స్పోర్ట్స్

జోర్డాన్ ఓపెన్ చాంప్ స్నేహిత్అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) జూనియర్ సర్క్యూట్ జోర్డాన్ ఓపెన్ టీటీ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సురవజ్జుల ఫిడేల్ రఫీక్ స్నేహిత్ విజేతగా నిలిచాడు. జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జూలై 27న జరిగిన బాలుర సింగిల్స్ ఫైనల్లో స్నేహిత్ 4-1 (12-10, 7-11, 11-9, 11-4, 11-6)తో జీత్ చంద్ర (భారత్)పై గెలుపొందాడు. డబుల్స్‌లో భారత్‌కే చెందిన అనుక్రమ్ జైన్‌తో కలిసి రజతాన్ని గెలిచిన స్నేహిత్ ఒకరోజు వ్యవధిలోనే సింగిల్స్‌లో స్వర్ణాన్ని కై వసం చేసుకున్నాడు. కాగా స్నేహిత్ కెరీర్‌లో ఇదే తొలి అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్.


ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు ద్యుతీచంద్అర్హత ప్రమాణ సమయం (11.26 సెకన్లు) అందుకోలేకపోయినా... ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు రావాలని భారత మహిళా స్ప్రింటర్ ద్యుతీచంద్‌కు ఆహ్వానం లభించింది. మహిళల 100 మీటర్ల విభాగంలో నిర్ణీత ఎంట్రీల సంఖ్య 56కు చేరుకోకపోవడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన వారిని ఆహ్వానించాలని నిర్ణయించింది. దాంతో ద్యుతీచంద్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ సీజన్‌లో ద్యుతీచంద్ అత్యుత్తమ సమయం 11.30 సెకన్లు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ ఆగస్టు 4 నుంచి 13 వరకు లండన్‌లో జరుగుతుంది. ఒడిషాకు చెందిన ద్యుతీచంద్‌కు కోచ్‌గా తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ వ్యవహరిస్తున్నారు. 


పారిస్‌లో 2024 ఒలింపిక్స్2024, 2028లలో జరిగే ఒలింపిక్స్ క్రీడల వేదికలను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) జూలై 31న ప్రకటించింది. 2024లో ఈ క్రీడలకు పారిస్ (ఫ్రాన్‌‌స), 2028లో లాస్ ఏంజిల్స్ (అమెరికా) నగరాలు ఆతిథ్యమిస్తాయి. గతంలో పారిస్‌లో రెండుసార్లు (1900, 1924)లో ఒలింపిక్స్ జరిగాయి. సరిగ్గా వందేళ్ల తర్వాత ఈ ‘సిటీ ఆఫ్ లవ్’ మళ్లీ ఒలింపిక్స్ కోసం సిద్ధం కానుంది. లాస్ ఏంజిల్స్ (1932, 1984) కూడా ఇప్పటికే రెండుసార్లు ఒలింపిక్స్‌ను నిర్వహించింది. 2020లో జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 


ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించిన అమెరికా స్విమ్మర్ అమెరికా స్విమ్మర్ సెలెబ్ డ్రెస్సెల్ ఒకే రోజు 3 స్వర్ణాలు సాధించి అరుదైన రికార్డు నెలకొల్పాడు. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఫినా వరల్డ్ అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ - 2017లో భాగంగా జూలై 31న జరిగిన 50 మీటర్ల ఫ్రీ స్టయిల్, 100 మీటర్ల బటర్‌ఫ్లై, 4 × 100 మీటర్ మిక్స్‌డ్ ఫ్రీ స్టయిల్ ఈవెంట్లలో తొలి స్థానంలో నిలిచాడు. తద్వారా 3 స్వర్ణాలు గెలిచి అంతర్జాతీయ పోటీల్లో ఈ తరహా రికార్డును నెలకొల్పిన తొలి ఆటగాడిగా డ్రెస్సెల్ గుర్తింపు పొందాడు.


వెటెల్‌కు హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్ఫార్ములావన్ రేసులో హంగేరీ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ గెలుచుకున్నాడు. బుడాపెస్ట్‌లో జూలై 30న జరిగిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, రైకోనెన్‌కు రెండో స్థానం లభించింది.

జూడోలో భారత్‌కు నాలుగు పతకాలుకామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో తొలిరోజు భారత జట్టు నాలుగు పతకాలు గెలుచుకుంది. బహమాస్‌లోని నసావూ నగరంలో జరిగిన జూడో క్రీడాంశంలో భారత్‌కు ఒక స్వర్ణం, 3 కాంస్య పతకాలు లభించాయి. బాలుర 73 కేజీల విభాగంలో హరియాణాకు చెందిన సోని 10-0తో ఉరోస్ (ఆస్ట్రేలియా)పై గెలిచి విజేతగా నిలిచాడు. కాగా ఆశిష్ (60 కేజీలు), బాలికల విభాగంలో చానమ్ రెబీనా దేవి (57 కేజీలు), అంతిమ్ యాదవ్ (48 కేజీలు) కాంస్య పతకాలను సాధించారు.

మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్‌కు చేరింది. జూలై 20న ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ 36 పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ 115 బంతుల్లో 171 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో అజేయంగా నిలిచింది. జూలై 23న లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇంగ్లండ్ జట్టుతో భారత్ తలపడుతుంది. 


డోపింగ్‌లో పట్టుబడ్డ మన్‌ప్రీత్ కౌర్భారత మేటి అథ్లెట్ మన్‌ప్రీత్ కౌర్ జూలై 19న డోపింగ్‌లో పట్టుబడింది. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో షాట్‌పుట్‌లో స్వర్ణం నెగ్గిన ఆమె ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది. తాజాగా డోపింగ్‌లో దొరకడంతో ఇప్పుడు స్వర్ణం, బెర్త్ రెండూ కోల్పోనుంది. ఆమె నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా ‘ఎ’ శాంపిల్‌లో నిషిద్ధ డిమిథైల్‌బుటిలమైన్ ఉత్ప్రేరకాన్ని తీసుకున్నట్లు తేలింది. 


మహిళల ప్రపంచకప్ విజేత ఇంగ్లండ్తొలిసారి వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలవాలని భావించిన భారత మహిళల జట్టుకు నిరాశే మిగిలింది. జూలై 23న లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్ 9 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అన్య షబ్‌స్రోల్ (6/46) కు దక్కగా అత్యధిక పరుగులు చేసిన బీమాంట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కింది.


పారా అథ్లెటిక్స్‌లో శరద్‌కు రజతంప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు రెండు పతకాలు గెల్చుకున్నారు. జూలై 23న జరిగిన పురుషుల హైజంప్ టి-42 ఈవెంట్‌లో శరద్ కుమార్ రజతం... వరుణ్ భాటి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. బిహార్‌కు చెందిన శరద్ 1.84 మీటర్ల ఎత్తు ఎగిరి రెండో స్థానాన్ని పొందగా... ఉత్తరప్రదేశ్‌కు చెందిన వరుణ్ భాటి 1.77 మీటర్ల ఎత్తుకు ఎగిరి మూడో స్థానాన్ని సాధించాడు. సామ్ గ్రెవీ (అమెరికా-1.86 మీటర్లు) స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకున్నాడు.

పారా అథ్లెటిక్స్‌లో కరమ్‌జ్యోతికి కాంస్యంప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన కరమ్‌జ్యోతి దలాల్‌కు కాంస్య పతకం లభించింది. మహిళల ఎఫ్-55 డిస్కస్ త్రో ఈవెంట్‌లో ఆమె డిస్క్‌ను 19.02 మీటర్ల దూరం విసిరి మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఇంతకుముందు జావెలిన్ త్రోలో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం, క్లబ్ త్రోలో అమిత్ సరోహా రజతం సాధించారు.


విష్ణు జోడీకి ప్రెసిడెంట్స్ కప్ టైటిల్హైదరాబాద్‌కు చెందిన విష్ణువర్ధన్ ప్రెసిడెంట్స్ కప్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానా నగరంలో జూలై 22న జరిగిన ఫైనల్లో విష్ణువర్ధన్ (భారత్)-తొషిహిదె మత్సుయ్ (జపాన్) జోడీ ‘సూపర్ టైబ్రేక్’లో ఎవ్‌గెని కర్లోవ్‌స్కీ-తుర్నెవ్ (రష్యా) జంటపై గెలిచింది. జూన్‌లో భారత్‌కే చెందిన శ్రీరామ్ బాలాజీతో కలిసి విష్ణు ఫెర్గానా ఓపెన్ టైటిల్‌ను గెలిచాడు.


ప్రణయ్‌కు యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి టైటిల్భారత అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్‌ఎస్ ప్రణయ్ యూఎస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. జూలై 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో భారత్‌కే చెందిన పారుపల్లి కశ్యప్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రణయ్‌కి ఇది నాలుగో అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. గతంలో వియత్నాం ఓపెన్ గ్రాండ్‌ప్రి, ఇండోనేసియా మాస్టర్స్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2014లో), స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ (2016లో) టోర్నీలలో టైటిల్స్ సాధించాడు. విజేతగా నిలిచిన ప్రణయ్‌కు 9,000 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 5 లక్షల 79 వేలు)తోపాటు 7,000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ కశ్యప్‌కు 4,560 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 93 వేలు)తోపాటు 5,950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో జీల్, సచిన్‌కు స్వర్ణాలుబహమాస్‌లో జూలై 24న ముగిసిన కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో భారత్ ఓవరాల్‌గా నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, ఆరు కాంస్య పతకాలను సాధించి మొత్తం 11 పతకాలతో ఏడో స్థానంలో నిలిచింది. చివరిరోజు టెన్నిస్‌లో జీల్ దేశాయ్ బాలికల సింగిల్స్ విభాగంలో స్వర్ణం సాధించగా... బాక్సింగ్‌లో సచిన్ స్వర్ణం సాధించాడు. బాలుర సింగిల్స్‌లో సిద్ధాంత్ బంతియా కాంస్య పతకాన్ని గెలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో జీల్ దేశాయ్-సిద్ధాంత్ ద్వయం బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది.


ఐదేళ్ల తర్వాత భారత్‌లో డబ్ల్యూటీఏ టోర్నీఐదేళ్ల తర్వాత డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు భారత్ వేదికైంది. ముంబై ఓపెన్ పేరుతో 2017 నవంబర్‌లో డబ్ల్యూటీఏ టోర్నమెంట్ జరగనుంది. 2012లో చివరిసారిగా పుణేలో డబ్ల్యూటీఏ టోర్నీ జరిగింది. దీని వల్ల ప్రపంచ టాప్-50 క్రీడాకారిణులతో తలపడే అవకాశం భారత అమ్మాయిలకు లభిస్తుంది. మెయిన్ డ్రా, క్వాలిఫయింగ్‌లో చెరో నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇస్తారు. చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నీ కూడా ఈ సారి మహారాష్ట్రకు తరలింది. ఇప్పుడిది ‘మహారాష్ట్ర ఓపెన్’ పేరుతో పుణేలో జరగనుంది. 


భారత్‌లో ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ప్రపంచ పురుషుల బాక్సింగ్ తొలి చాంపియన్‌షిప్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. ఈ మేరకు మాస్కోలో జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబా)ఆతిథ్య వేదికల్ని ఖరారు చేసింది. 2019 టోర్నీకి సోచి, 2021 ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిస్తాయని ఐబా అధ్యక్షుడు చింగ్ కూవు తెలిపారు. ఇప్పటికే వచ్చే ఏడాది మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత్‌లో ఖరారైంది. 1990లో ప్రపంచకప్ ముంబైలో, 2010లో కామన్వెల్త్ గేమ్స్ న్యూఢిల్లీలో జరిగాయి. 

మహిళల వన్డే క్రికెట్‌లో మిథాలీ అత్యధిక పరుగుల రికార్డు భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు సాధించింది. 183 వన్డేల్లో ఆమె 6,028 పరుగులు సాధించింది. చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఇంత కాలం ఉన్న 5,992 పరుగుల రికార్డును మిథాలీ అధిగమించింది. ఎడ్వర్డ్స్ 180 ఇన్నింగ్‌‌సలలో ఈ రికార్డు సాధించగా, మిథాలీకి 164 ఇన్నింగ్‌‌సలు మాత్రమే సరిపోయాయి. ఈ క్రమంలో మహిళల వన్డేల్లో 6 వేల పరుగులు చేసిన తొలి క్రీడాకారిణిగా కూడా మిథాలీ గుర్తింపు తెచ్చుకుంది. 
35 ఏళ్ల మిథాలీ రాజ్ 1999 జూన్ 26న ఐర్లాండ్‌తో తొలి వన్డే మ్యాచ్ ఆడింది. 106 మ్యాచ్‌లలో ఆమె జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం విశేషం. వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ భారత్‌కే చెందిన జులన్ గోస్వామి (189) పేరిట రికార్డు ఉండగా, ఇప్పుడు బ్యాట్స్‌మన్ జాబితాలో కూడా భారతీయురాలే అగ్రస్థానానికి చేరింది. 


జావెలిన్ త్రోలో సుందర్ సింగ్‌కు స్వర్ణంలండన్‌లో జరిగిన ప్రపంచ పారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఎఫ్-46 జావెలిన్ త్రో ఈవెంట్‌లో సుందర్ సింగ్ గుర్జర్ స్వర్ణం గెలుచుకున్నాడు. జూలై 15న జరిగిన ఈవెంట్‌లో సుందర్ ఈటెను 60.36 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 


విక్టోరియా ఓపెన్ టోర్నీ విజేత హరీందర్ఆస్ట్రేలియాలో జరిగిన విక్టోరియా ఓపెన్ టోర్నీ టైటిల్‌ను భారత స్క్వాష్ ప్లేయర్ హరీందర్ పాల్ సంధూ కైవసం చేసుకున్నాడు. జూలై 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మూడో సీడ్ సంధూ 12-14, 11-3, 11-4, 11-7తో టాప్ సీడ్, స్థానిక ప్లేయర్, రెక్స్ హెండ్రిక్స్‌పై విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. గతవారం సౌత్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను సంధూ నెగ్గాడు. 


వింబుల్డన్ మహిళల సింగిల్స్ విజేత ముగురుజా వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్పెయిన్ స్టార్ గార్బిన్ ముగురుజా దక్కించుకుంది. జూలై 15న జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. విజేతగా నిలిచిన ముగురుజాకు 22 లక్షల పౌండ్లు (రూ. 18 కోట్ల 53 లక్షలు), రన్నరప్ వీనస్‌కు 11 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 


వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత ఫెడరర్ వింబుల్డన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెడరర్ సొంతం చేసుకున్నాడు. జూలై 16న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్, మూడోసీడ్ ఫెడరర్ 6-3, 6-1, 6-4తో ప్రపంచ ఆరో ర్యాంకర్, ఏడోసీడ్ మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై విజయం సాధించాడు. తద్వారా ఓపెన్ శకంలో వింబుల్డన్‌ను అత్యధికంగా ఎనిమిది సార్లు నెగ్గిన ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.


జాతీయ అథ్లెటిక్స్‌లో ఓవరాల్ చాంప్ కేరళ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జరిగిన జాతీయ సీనియర్ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కేరళ జట్టు ఓవరాల్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కేరళ 159 పాయింట్లతో తొలి స్థానంలో నిలవగా.. 110 పాయింట్లతో తమిళనాడు రెండో స్థానంలో, 101.500 పాయింట్లతో హరియాణా మూడో స్థానంలో నిలిచాయి. ఒక స్వర్ణం, మూడు రజతాలు గెలిచిన ఆతిథ్య ఆంధ్రప్రదేశ్ జట్టు 42.500 పాయింట్లతో తొమ్మిదో స్థానంతో, ఒక కాంస్య పతకం సాధించిన తెలంగాణ ఐదు పాయింట్లతో 20వ స్థానంతో సరిపెట్టుకున్నాయి.

భారత్ క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ భారత క్రికెట్ జట్టు బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్ ఎంపికయ్యారు. ఇప్పటి వరకు బ్యాటింగ్ కోచ్‌గా పని చేస్తున్న సంజయ్ బంగర్‌కు అసిస్టెంట్ కోచ్ హోదా దక్కగా.. ఆర్. శ్రీధర్ ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగుతారు. జూలై 18న బీసీసీఐ ఈ ఎంపికను ప్రకటించింది. హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు ఈ ముగ్గురి పదవీ కాలం కూడా 2019 వన్డే వరల్డ్ కప్ వరకు ఉంటుంది. గతంలో రవిశాస్త్రి డెరైక్టర్‌గా ఉన్న సమయంలో కూడా ఈ ముగ్గురే ఆయనతో కలిసి పని చేశారు. 


బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్ నెగ్గిన హామిల్టన్
ఫార్ములావన్ బ్రిటిష్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను లూయిస్ హామిల్టన్ వరుసగా నాలుగోసారి సొంతం చేసుకున్నాడు. సిల్వర్‌స్టోన్(బ్రిటన్) లో జూలై 16న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలవగా, వాల్టేరి బొట్టాస్ రెండో స్థానం సాధించాడు.

ఆసియా స్నూకర్ చాంపియన్ భారత్ ఆసియా స్నూకర్ టీమ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ‘ఎ’ జట్టు విజేతగా నిలిచింది. పాకిస్తాన్ ‘బి’తో జూలై 5న జరిగిన ఫైనల్లో భారత్ ‘ఎ’ జట్టు 3-0తో విజయం సాధించింది. ఈ టోర్నీలో పంకజ్ అద్వానీ అజేయంగా నిలిచి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. పంకజ్ అద్వానీ, లక్ష్మణ్ రావత్, మల్కీత్ సింగ్‌లతో కూడిన భారత బృందానికి అశోక్ శాండిల్య కోచ్‌గా వ్యవహరించారు.

ఆసియా అథ్లెటిక్స్‌లో మన్‌ప్రీత్, లక్ష్మణన్‌కు స్వర్ణాలుఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు భారత అథ్లెట్లు 2 స్వర్ణాలు, ఒక రజతం, 4 కాంస్య (మొత్తం 7) పతకాలు సాధించారు. మన్‌ప్రీత్‌తో పాటు జి. లక్ష్మణన్ స్వర్ణాన్ని గెలుచుకున్నాడు. మహిళల షాట్‌పుట్ విభాగంలో మన్‌ప్రీత్ గుండును 18.28మీ. దూరం విసిరి విజేతగా నిలిచి పసిడి పతకం గెలుచుకుంది. పురుషుల 5000మీ. పరుగు ఈవెంట్‌ను గోవిందన్ లక్ష్మణన్ 14ని.54.48 సెకన్లలో పూర్తిచేసి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. దీంతో లండన్ వేదికగా ఆగస్టులో జరుగనున్న వరల్డ్ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. మన్‌ప్రీత్ ఇప్పటికే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.


ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు 4 స్వర్ణాలు ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ రెండో రోజు పోటీల్లో భారత అథ్లెట్లు 4 స్వర్ణాలు గెలుచుకున్నారు. పురుషుల, మహిళల 400 మీటర్ల విభాగాల్లో వరుసగా మొహమ్మద్ అనస్ (45.77 సెకన్లు), నిర్మలా షెరోన్ (52.01 సెకన్లు) స్వర్ణం గెలుచుకోగా.. 1500 (పురుషులు, మహిళలు) మీటర్ల విభాగాల్లో వరుసగా అజయ్ కుమార్ సరోజ్ (3ని:45.85 సెకన్లు), పీయూ చిత్రా (4ని:17.92 సెకన్లు) విజేతలుగా నిలిచి పసిడి పతకాలను గెల్చుకున్నారు. 


ఫెడరర్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల రికార్డుగ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లలో అత్యధిక మ్యాచ్‌లు (317) గెలిచిన ఆటగాడిగా స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ రికార్డును సృష్టించాడు. వింబుల్డన్‌లో భాగంగా జూలై 8న జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో ఫెడరర్ 7-6 (7/3), 6-4, 6-4తో 27వ సీడ్ మిషా జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. తద్వారా అత్యధికంగా 317 గ్రాండ్‌స్లామ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. సెరెనా విలియమ్స్ (అమెరికా-316 విజయాలు) పేరిట ఉన్న రికార్డును ఫెడరర్ అధిగమించాడు.


ఆసియా అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలిస్థానం ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ 12 స్వర్ణాలు, 5 రజతాలు, 12 కాంస్యాలలు కలిపి మొత్తం 29 పతకాలతో తొలిసారి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 20 పతకాలతో చైనా (8 స్వర్ణాలు, 7 రజతాలు, 5 కాంస్యాలు) రెండో స్థానంలో నిలిచింది. 1985, 1989 ఆసియా చాంపియన్‌షిప్‌ల్లో భారత్ అత్యధికంగా 22 పతకాలు గెలిచింది. 
చివరి రోజైన జులై 9న జరిగిన పోటీల్లో భారత్‌కు ఐదు స్వర్ణ పతకాలు లభించాయి. హెప్టాథ్లాన్‌లో స్వప్న బర్మన్ (5,942 పాయింట్లు)... 10 వేల మీటర్ల రేసులో లక్ష్మణన్ (29ని:55.87 సెకన్లు)... జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా (85.23 మీటర్లు) పసిడి పతకాలు గెలిచారు. పురుషుల, మహిళల 4×400 మీటర్లలో భారత రిలే జట్లు స్వర్ణాలు నెగ్గాయి. జూలై 8న జరిగిన పోటీల్లో మహిళల 3000 మీటర్ల రేసులో భారత అథ్లెట్ సుధా సింగ్ స్వర్ణం గెలుచుకుంది. 


కామన్వెల్త్ చెస్ చాంపియన్ అభిజిత్భారత్‌లో జరిగిన కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ అభిజిత్ గుప్తా విజేతగా నిలిచాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్‌లు ముగిశాక అభిజిత్ గుప్తా 7.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వైభవ్ సూరి రెండో స్థానంలో, తేజస్ బాక్రే మూడో స్థానంలో నిలిచారు. తెలంగాణ ప్లేయర్ ఎరిగైసి అర్జున్ 6.5 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.


శ్రీలంకపై తొలి వన్డే సిరీస్ గెలిచిన జింబాబ్వే శ్రీలంకతో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను జింబాబ్వే 3-2తో కైవసం చేసుకుంది. జూలై 10న జరిగిన ఐదో వన్డేలో జింబాబ్వే జట్టు 3 వికెట్ల తేడాతో లంకపై నెగ్గింది. తద్వారా 2009 తర్వాత విదేశాల్లో తొలి వన్డే సిరీస్ విజయాన్ని సొంతం చేసుకున్న ఆ జట్టు.. శ్రీలంకపై తొలి వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. 


భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా 55 ఏళ్ల రవిశంకర్ జయధ్రిత శాస్త్రిని నియమిస్తున్నట్లు బీసీసీఐ జూలై 11న ప్రకటించింది. అలాగే.. మాజీ పేసర్ జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా, విదేశీ పర్యటనల్లో బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా మాజీ కెప్టెన్, దిగ్గజ బ్యాట్స్‌మన్ రాహుల్ ద్రవిడ్‌ను నియమించింది. ఇప్పటికే భారత ‘ఎ’, అండర్-19 జట్లకు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కు ఇది అదనపు బాధ్యత. జూలై 26 నుంచి శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి రవిశాస్త్రి పదవీకాలం ప్రారంభమవుతుంది. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. 


జోత్స్న చినప్పకు ప్రభుత్వ ఉద్యోగంప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి, జోత్స్న చినప్పకు తమిళనాడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించింది. రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన తమిళనాడు ఉత్పత్తి, పంపిణీ సంస్థ (టీఏఎన్‌జీఈడీసీఓ) సీనియర్ స్పోర్‌‌ట్స అధికారిణిగా నియమిస్తు జూలై 11న ఉత్తర్వులు జారీ చేసింది. 
ఆసియా వ్యక్తిగత చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలవడంతోపాటు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్స్‌కు చేరిన చినప్ప మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరోవైపు కామన్వెల్త్ గేమ్స్ మహిళల డబుల్స్ విభాగంలో చినప్ప స్వర్ణపతకాన్ని సాధించింది.


కోచ్‌గా ద్రవిడ్‌కు రెండేళ్లు పొడిగింపుభారత్ ‘ఎ’, అండర్-19 క్రికెట్ జట్ల కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ మరో రెండేళ్లకు పొడిగించింది. 2015లో ద్రవిడ్ తొలిసారిగా కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన శిక్షణలో ఆటగాళ్లు అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌గా నిలిచారు. అలాగే భారత్ ‘ఎ’ జట్టు నాలుగు దేశాల సిరీస్‌లో విజేతగా నిలిచింది. 
రెండేళ్ల పూర్తి స్థాయి కోచింగ్ బాధ్యతలు తీసుకోనుండటంతో ద్రవిడ్ ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు మెంటార్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు.