ఆసియా బిలియర్డ్స్ విజేత పంకజ్ అద్వానీ ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పంకజ్(బెంగళూరు)... ఫైనల్లో 6-1 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన బాలచంద్ర భాస్కర్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కిది ఏడో ఆసియా బిలియర్డ్స్ టైటిల్. గతంలో 2017, 2012, 2010, 2009, 2008, 2005లలో పంకజ్ విజేతగా నిలిచాడు.
ఆసియా మహిళల స్నూకర్ చాంప్ అమీ కమాని
ఆసియా మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి అమీ కమాని విజేతగా నిలిచింది. ఇండోర్‌కు చెందిన అమీకమాని ఫైనల్లో 3-0తో సిరిపపోర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో మనూకి రెండు స్వర్ణాలు
జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్లో భారత షూటర్ మనూ భాకర్.. రెండు స్వర్ణాలు సాధించింది. మార్చి 24న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో బరిలో దిగిన 16 ఏళ్ల మను 235.9 పాయింట్లు స్కోర్ చేసి బంగారు పతకం కై వసం చేసుకుంది. కన్యకోర్న్ హిరున్‌ఫోమ్ (థాయ్‌లాండ్-234.9 పాయింట్లు) రజతం... కైమన్ లూ (చైనా-214.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. టీమ్ విభాగంలో మను, దేవాన్షి, మహిమ అగర్వాల్ బృందం బంగారు పతకం దక్కించుకుంది.
ఇటీవల మెక్సికోలో జరిగిన సీనియర్ వరల్డ్‌కప్ షూటింగ్లోను మను రెండు బంగారు పతకాలు సాధించింది.
కామన్వెల్త్ గేమ్స్ భారత పతాకధారిగా పీవీ సింధు
గత రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆమె భారత బృందానికి పతాకధారిగా (ఫ్లాగ్ బేరర్) వ్యవహరించనుంది. ఏప్రిల్ 4న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింధు త్రివర్ణ పతాకం చేతబూని భారత క్రీడాకారులను ముందుకు నడిపించనుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మార్చి 24న ప్రకటించింది. భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా... 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 22 ఏళ్ల సింధువైపే ఐఓఏ మొగ్గు చూపింది.
గత మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో షూటర్లే భారత బృందాలకు పతాకధారులుగా వ్యవహరించారు. 2006 మెల్బోర్న్ గేమ్స్‌లో రాజ్యవర్ధన్ రాథోడ్... 2010 ఢిల్లీ గేమ్స్‌లో అభినవ్ బింద్రా... 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజయ్ కుమార్ ఫ్లాగ్ బేరర్లుగా పాల్గొన్నారు.
'బాల్ ట్యాంపరింగ్' వ్యవహారంలో ఆసీస్ ప్లేయర్లపై చర్యలు
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ జోక్యం చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తప్పించింది. వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించింది.
మరోవైపు బాల్ ట్యాంపరింగ్కుగాను ఆసీస్ కెప్టెన్ స్మీత్‌పై ఒక టెస్టు నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతో పాటు, మూడు డిమెరిట్ పాయింట్లు ఇచ్చింది.
ప్రపంచకప్ షూటింగ్లో మను-అన్మోల్ కు స్వర్ణం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) జూనియర్ ప్రపంచకప్‌లో మను భాకర్-అన్మోల్ జోడీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ జంట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో 478.9 పాయింట్లు సాధించింది.
మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో జెనెమత్ షెఖాన్ 36 పాయింట్లు సాధించి కాంస్యం సొంతం చేసుకోగా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో అర్జున్ బబూటా-శ్రేయా అగర్వాల్ జంట మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.
ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో (18 పతకాలలు) భారత్ రెండో స్థానంలో ఉంది.
నేషనల్ హాకీ చాంపియన్‌గా పంజాబ్
నేషనల్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పంజాబ్ గెలుచుకుంది. లక్నోలో మార్చి 25న జరిగిన ఫైనల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(పీఎస్‌పీబీ) జట్టును పంజాబ్ ఓడించింది.
ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ విజేత అంకిత రైనా భారత టెన్నిస్ ఆశాకిరణం అంకిత రైనా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ నెగ్గింది. మార్చి 17న గ్వాలియర్‌లో ముగిసిన ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ ఫైనల్లో అంకిత 6-2, 7-5తో సెకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. 2014 డిసెంబర్లో చివరిసారి అంకిత పుణే ఐటీఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఆరు సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి.
ఐఎస్ఎల్ చాంపియన్ చెన్నైయిన్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ రెండోసారి విజేతగా నిలిచింది. మార్చి 17న జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3-2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు.
చెన్నైయిన్ జట్టు 2015 సీజన్లోనూ టైటిల్ గెలిచింది. లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్‌సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్‌కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్‌రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు.
ఇరానీ కప్ విజేత విదర్భ తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్సలో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు మరోసారి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో ఇన్నింగ్సలో వికెట్లేమీ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఐదు రోజుల ఫైనల్లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్స ఆధిక్యం దక్కించుకున్న విదర్భకు టైటిల్ ఖాయమైంది. తొలి ఇన్నింగ్సలో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంప్ తై జు యింగ్
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను తై జు యింగ్ (చైనీస్ తైపీ), పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకి (చైనా) సొంతం చేసుకున్నారు. మార్చి 18న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ 22-20, 21-13తో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో షి యుకి 21-19, 16-21, 21-9తో తన దేశానికే చెందిన దిగ్గజం లిన్ డాన్‌పై సంచలన విజయం సాధించాడు.
ముక్కోణపు టీ20 టోర్నీ విజేత భారత్
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు(భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్) టీ20 సీరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మార్చి 18న కొలంబోలో జరిగిన ఫైనల్లో భారత్.. 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దినేశ్ కార్తీక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.. వాషింగ్టన్ సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
రొనాల్డో 50వ హ్యాట్రిక్
సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన హ్యాట్రిక్‌ల రికార్డు సాధించాడు. మార్చి 18న సాధించిన హ్యాట్రిక్ గోల్స్‌తో అతని హ్యాట్రిక్‌ల ఫిఫ్టీ పూర్తయింది. లా లీగా (స్పెయిన్) చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో రియల్ మాడ్రిడ్ 6-3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌లో 41 సార్లు మూడేసి గోల్స్, ఏడు సార్లు నాలుగు గోల్స్, రెండు సార్లు ఐదు గోల్స్ ఉన్నాయి. కేవలం లా లీగాలోనే ఏకంగా 34 సార్లు హ్యాట్రిక్ సాధించిన అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సార్లు పోర్చుగల్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు చేసిన రికార్డు బ్రెజిల్ దిగ్గజం పీలే (92 హ్యాట్రిక్స్) పేరిట ఉంది.
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ విజేత డెల్‌పొట్రో
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో గెలుచుకున్నాడు. మార్చి 19న జరిగిన ఫైనల్లో డెల్‌పొట్రో 2 గంటల 42 నిమిషాల్లో 6-4, 6-7 (8/10), 7-6 (7/2)తో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను ఓడించి తొలిసారి మాస్టర్స్-1000 స్థాయి టైటిల్‌ను గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన డెల్‌పొట్రోకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు) దక్కగా... ఫెడరర్ ఖాతాలో 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) చేరాయి.
మహిళల సింగిల్స్ విజేత ఒసాకాఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా కైవసం చేసుకుంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఒసాకా.. ఫైనల్లో 20వ సీడ్ దరియా కసత్కినా (రష్యా)ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా-1999లో), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం-2005లో) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు), రన్నరప్ కసత్‌కినాకు 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
దేవధర్ ట్రోఫీ విజేత భారత్ ‘బి’ దేశవాలీ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీని భారత్ బి జట్టు కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా మార్చి 8న జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’, కర్ణాటకను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేయగా... భారత్ ‘బి’ 48.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది.
ప్రపంచకప్ షూటింగ్లో అఖిల్ షెరాన్‌కు పసిడి పతకం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో మరో భారత షూటర్ అఖిల్ షెరాన్ పసిడి పతకం సాధించాడు. పురుషుల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో మేటి షూటర్లు బరిలో ఉండగా... కెరీర్లో కేవలం రెండో ప్రపంచకప్ ఆడుతోన్న 22 ఏళ్ల అఖిల్ 455.6 పాయింట్లతో విజేతగా నిలువగా... బెర్నాడ్ పికిల్ (ఆస్ట్రియా-452 పాయింట్లు) రజతం, ఇస్త్వాన్ పెని (హంగేరి-442.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కిది తొమ్మిదో పతకం. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి.
ప్రపంచకప్ షూటింగ్లో తొలిస్థానంలో భారత్
మెక్సికోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ సీజన్ తొలి ప్రపంచకప్ షూటింగ్లో భారత్ 9 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు, ఒక రజతం. దీంతో 32 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో తొలిసారి భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకొంది.
స్వర్ణాలు
మనూ భాకర్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
మనూ భాకర్-ఓం ప్రకాశ్: మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
షాజర్ రిజ్వీ : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
అఖిల్ షెరాన్ : పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్
రజతం
అంజుమ్ ముద్గిల్ : మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్.
కాంస్యాలు
రవి కుమార్ : పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్.
జీతూ రాయ్ : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్.
మెహులీ ఘోష్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
మెహులీ ఘోష్ : దీపక్ కుమార్: మిక్స్డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
అజ్లాన్ షా టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా
అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇఫా(మలేషియా)లో మార్చి 10న జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది.
ఫెదరర్ కు స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 28న జరిగింది. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకుగాను టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’.. ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. మరో టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ చేతుల మీదుగా అతను ఈ పురస్కారాలను అందుకున్నాడు.
ఫెడరర్ 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్ ‘స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు.
‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అందుకుంది. అమెకిది నాలుగో అవార్డు. గతంలో 2003, 2010, 2016లో మూడుసార్లు ఈ పురస్కారం అందుకుంది.
అవార్డు
|
విజేత
|
వరల్డ్ స్పోర్టమన్ ఆఫ్ ద ఇయర్
|
రోజర్ ఫెదరర్
|
కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్
|
రోజర్ ఫెదరర్
|
స్పోర్ట్స ఉమన్ ఆఫ్ ద ఇయర్
|
సెరెనా విలియమ్స్
|
డోపింగ్‌లో పట్టుబడ్డ జావెలిన్ త్రోయర్ దవిందర్
భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ దవిందర్ సింగ్ కంగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడు. 2017 నవంబర్‌లో అతని నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరిశీలించగా దవిందర్ నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్ఐ) వెంటనే అతన్ని పాటియాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి-1 పోటీల నుంచి తప్పించింది. తక్షణమే శిక్షణ కేంద్రం నుంచి నిష్క్రమించాలని ఆదేశించింది. ఇప్పటికై తే తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ ‘బి’ శాంపిల్‌లోనూ దోషిగా తేలితే అతనిపై నాలుగేళ్ల నిషేధం పడనుంది. 29 ఏళ్ల దవిందర్ గతేడాది లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించి ఈ ఘనత వహించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా ఏఐయూ పరీక్షల్లో దొరికిన తొలి భారత డోపీగానూ నిలిచాడు. క్రీడారంగాన్ని కుదిపేసిన రష్యా వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఐయూను ఏర్పాటు చేసింది.
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వినేశ్ ఫోగట్‌కు రజతం
కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి వినేశ్ ఫోగట్ రజత పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వినేశ్ ఈ మెగా ఈవెంట్లో తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయింది. 50 కేజీల విభాగంలో పోటీ పడ్డ వినేశ్ ఫైనల్లో 2-3తో చున్ లీ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో యూకీ రై (జపాన్)పై వినేశ్ విజయం సాధించింది.
మరో భారత రెజ్లర్ సంగీత 59 కేజీల విభాగంలో కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఫ్రీ స్టైల్ విభాగంలో సంగీత జీన్ ఉమ్ (కొరియా)పై గెలుపొంది కాంస్యం సొంతం చేసుకుంది.
ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నవజ్యోత్‌కు స్వర్ణం
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా నవజ్యోత్ కౌర్ గుర్తింపు పొందింది. మార్చి 2న జరిగిన మహిళల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 28 ఏళ్ల నవజ్యోత్ కౌర్ 9-1తో మియు ఇమాయ్ (జపాన్)పై ఘనవిజయం సాధించింది. ఐదోసారి ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నవజ్యోత్ పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఆమెకు రజతం (2013లో), కాంస్యం (2011లో) లభించాయి. మరోవైపు సాక్షి మలిక్ 62 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక
వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. 2018, ఫిబ్రవరి 27న న్యూఢిల్లీలో ముగిసిన ఫైనల్లో సౌరాష్ర్టను కర్ణాటక ఓడించింది.
ప్రపంచ స్నూకర్ కప్ విజేత భారత్
తొలిసారి నిర్వహించిన ప్రపంచ స్నూకర్ కప్ టీమ్ ఈవెంట్లో భారత్-1 జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. మార్చి 2న దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ-మానన్ చంద్రలతో కూడిన భారత్ 3-2తో మొహమ్మద్ ఆసిఫ్-బాబర్ మసీ సభ్యులుగా ఉన్న పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో మానన్ చంద్ర 24-73తో బాబర్ చేతిలో... రెండో మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ 56-61తో ఆసిఫ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ 0-2తో వెనుకబడింది. అయితే మూడో మ్యాచ్‌లో పంకజ్-మానన్ చంద్ర ద్వయం 72-47తో ఆసిఫ్-బాబర్ జంటపై గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో పంకజ్ 106-20తో బాబర్‌పై.. ఐదో మ్యాచ్‌లో మానన్ చంద్ర 56-20తో ఆసిఫ్‌పై నెగ్గడంతో భారత్ విజయం ఖాయమైంది.
తాల్ ర్యాపిడ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్
భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్లో 48 ఏళ్ల ఆనంద్ ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయాడు.
షూటింగ్ ప్రపంచకప్‌లో షాజర్ రిజ్వీకి స్వర్ణం
మెక్సీకోలోని గ్వాడలహారాలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ సీజన్ తొలి టోర్నమెంట్ - ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ షాజర్ రిజ్వీ ‘ప్రపంచ రికార్డు’ ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. మార్చి 3న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రిజ్వీ.. 242.3 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 241.8 పాయింట్లతో తొమొయుకి మత్సుదా (జపాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రిజ్వీ బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 219 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకోగా... క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ-239.7 పాయింట్లు) రజత పతకం సాధించాడు. ఉత్తరప్రదేశ్ షూటర్ షాజర్ రిజ్వీకి ఇదే తొలి ప్రపంచ కప్.
ప్రపంచకప్‌లో 16 ఏళ్ల భారత షూటర్‌కు స్వర్ణంమెక్సికోలోని గ్వాడలహారాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో 16 ఏళ్ల భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్ నిలిచింది. మొత్తం 237.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానం సాధించగా... జవాలా (237.1 పాయింట్లు) రజతం, సెలిన్ గోబర్‌విలే (ఫ్రాన్స-217 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యశస్విని సింగ్ (196.1 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రవికుమార్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి ఇదే తొలి పతకం.
జమైకా బాడ్మింటన్ టోర్నీలో తరుణ్ జంటకు టైటిల్
జమైకా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ కోన తరుణ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో... తరుణ్-సౌరభ్ శర్మ (భారత్) జంట 21-17, 21-17తో గారెత్ హెన్రీ-రికెట్స్ (జమైకా) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో ఈ జోడీ 21-5, 21-8తో టాప్ సీడ్ జోస్ గ్యురెవా-డానిల్లె టొర్రె (పెరూ) జంటపై విజయం సాధించింది.
షూటింగ్ ప్రపంచకప్‌లో మనూకు మరో స్వర్ణం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 16 ఏళ్ల మనూ భాకర్ వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్లో పసిడి పతకం నెగ్గిన మనూ... 24 గంటల్లోపే మరో స్వర్ణం సాధించింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా నిలిచింది. ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో మనూ-ఓంప్రకాశ్ ద్వయం 476.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సాండ్రా రీట్జ్-క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ-475.2 పాయింట్లు) జంట రజతం... సెలైన్ గొబెర్‌విలె-ఫ్లోరియన్ ఫౌక్వెట్ (ఫ్రాన్స్-415.1 పాయింట్లు) జోడీకి కాంస్యం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత్‌కే చెందిన మెహులీ ఘోష్-దీపక్ కుమార్ ద్వయం కాంస్యం సాధించింది.
బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో కొత్తగా ‘ఎ ప్లస్’
2017 అక్టోబర్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు వర్తించే విధంగా బీసీసీఐ మార్చి 7న కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. మొత్తం 26 మందికి ఇందులో చోటు దక్కింది. ఇందులో భాగంగా తొలిసారిగా ‘ఎ ప్లస్’ గ్రేడ్‌ను కూడా చేర్చింది. ఇందులో ఐదుగురుకి చోటు కల్పించింది. మూడు ఫార్మాట్లలో రెగ్యులర్ సభ్యులైన కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో పాటు పేసర్లు భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఇందులో ఉన్నారు.
ఎవరెవరు ఎక్కడ..
‘ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా.
‘ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, విజయ్, పుజారా, రహానే, ధోని, సాహా.
‘బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్, కుల్దీప్, చహల్, పాండ్యా, ఇషాంత్, దినేశ్ కార్తీక్.
‘సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): జాదవ్, పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, రైనా, పార్థివ్, జయంత్.
మిథాలీ రాజ్‌కు రూ. 50 లక్షలు
మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులను కూడా బీసీసీఐ భారీగా పెంచింది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇప్పుడు ఏడాదికి రూ. 50 లక్షల (గత ఏడాది రూ. 15 లక్షలు) చొప్పున లభిస్తుంది. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఉన్నారు. మరో ఆరుగురికి ‘బి’ గ్రేడ్ (రూ. 30 లక్షలు)లో అవకాశం కల్పించగా... కొత్తగా గ్రేడ్ ‘సి’ని (రూ. 10 లక్షలు) చేర్చి ఇందులో 9 మందిని చేర్చారు.
ఆసియా రెజ్లింగ్‌లో భారత్ కు 8 పతకాలు
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. బిష్కెక్ (కిర్గిస్తాన్)లో 2018, మార్చి4న ముగిసిన ఈ పోటీలో చైనా ఏడు స్వర్ణ పతకాలతో మొత్తం 14 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇరాన్ ఆరు స్వర్ణ పతకాలతో మొత్తం 10 పతకాలతో రెండో స్థానం, ఉజ్బెకిస్థాన్ నాలుగు స్వర్ణాలతో మొత్తం 15 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.