Thursday, 28 June 2018

మే 2018 స్పోర్ట్స్

యూత్ బాక్సింగ్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు బ్యాంకాక్‌లో జరుగుతున్న ఆసియా యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మూడు స్వర్ణాలు గెలిచారు. ఏప్రిల్ 27న జరిగిన మహిళల విభాగంలో నీతు గంగాస్ (48 కేజీలు), మనీషా (64 కేజీలు), లలిత (69 కేజీలు) లు గెలుపొంది స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు. ఫైనల్లో నిల్లాడ మీకూన్ (థాయ్‌లాండ్)పై నీతు, ఇడిమోఖ్ ఖొలోవా (తజికిస్తాన్)పై మనీషా, బెసైబయోవా మైయా (కజకిస్తాన్)పై లలిత విజయం సాధించారు.


అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి విజేత హామిల్టన్ 
అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి రేసులో ప్రపంచ చాంపియన్ హామిల్టన్ (మెర్సిడెస్) విజయం సాధించాడు. ఏప్రిల్ 29న జరిగిన ఈ రేసులో 51 లాప్‌ల దూరాన్ని హామిల్టన్ గంటా 43 నిమిషాల 44.291 సెకన్లలో చేరుకున్నాడు. మరోవైపు ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ గంటా 43 నిమిషాల 48.315 సెకన్లలో రేసును పూర్తిచేసి మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. 2016లో బాకులో జరిగిన యూరోపియన్ గ్రాండ్‌ప్రిలో కూడా పెరెజ్ మూడో స్థానంలో నిలిచాడు. 
 

ప్రజ్నేశ్‌కు ఏటీపీ చాలెంజర్ టైటిల్ 
భారత టెన్నిస్ ఆటగాడు ప్రజ్నేశ్ గుణేశ్వరన్ కెరీర్‌లో తొలిసారి ఏటీపీ చాలెంజర్ సర్క్యూట్ టైటిల్ సాధించాడు. చైనాలోని యానింగ్‌లో ఏప్రిల్ 29న జరిగిన కున్‌మింగ్ ఏటీపీ చాలెంజర్ ఓపెన్ పురుషుల సింగిల్స్‌లో ప్రజ్నేశ్ మహ్మద్ సఫ్వాత్ (ఈజిప్ట్)పై గెలుపొందాడు. దీంతో ప్రజ్ఞేశ్ టాప్-200 ర్యాంకులో నిలిచే అవకాశముంది. ఇప్పటికే యూకీ బాంబ్రీ (83), రామ్‌కుమార్ రామ్‌నాథన్ (115) టాప్-200లో ఉన్నారు. 


అంతర్జాతీయ బాక్సింగ్‌లో నిఖత్ కు స్వర్ణం 
బెల్‌గ్రేడ్ ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్ నిఖత్ జరీన్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. సెర్బియాలో ఏప్రిల్ 28న జరిగిన మహిళల 51 కేజీల విభాగంలో నిఖత్(నిజామాబాద్) 3-0తో ఐకతెరిని కుట్‌సోజియోర్‌గోపులు (గ్రీస్)పై విజయం సాధించింది. 


ఉజ్బెకిస్తాన్ ఐటీఎఫ్ టోర్నీ విజేత సాకేత్ 
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఫ్యూచర్స్-2 టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని విజేతగా నిలిచాడు. కర్షీలో ఏప్రిల్ 28న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో సాకేత్ షైలా యారాస్లావ్ (బెలారస్)పై గెలిచాడు. సాకేత్ కి ఇది 12వ అంతర్జాతీయ సింగిల్స్ టైటిల్. 


ఆసియా బ్యాడ్మింటన్ చాంపిన్‌షిప్ 
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జపాన్‌కు చెందిన కెంటో మొమోటా గెలుచుకున్నాడు. దీంతో ఈ టైటిల్ నెగ్గిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. వుహాన్(చైనా)లో ఏప్రిల్ 29న జరిగిన ఫైనల్లో చెన్ లాంగ్(చైనా)పై కెంటో గెలుపొందాడు. కాగా, మహిళల సింగిల్స్ టైటిల్‌ను తైవాన్‌కు చెందిన తాయ్ జు ఇంగ్ గెలుచుకుంది.

ఏప్రిల్ 2018 స్పోర్ట్స్

నాదల్ కు మోంటెకార్లో మాస్టర్స్ టైటిల్ స్పెయిన్ టెన్నిస్ స్టార్ రాఫెల్ నాదల్ మోంటెకార్లో మాస్టర్స్ సిరీస్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఏప్రిల్ 22న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 6-3, 6-2తో నిషికోరి (జపాన్)ను ఓడించాడు. తద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) ఒకే టోర్నమెంట్‌ను అత్యధికంగా 11 సార్లు గెలిచిన ఏకైక ప్లేయర్‌గా నాదల్ గుర్తింపు పొందాడు. బార్సిలోనా ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లను 10 సార్లు చొప్పున గెలిచిన నాదల్‌కు మాస్టర్స్ సిరీస్‌లో ఇది 31వ టైటిల్ కాగా ఓవరాల్ కెరీర్‌లో 76వ సింగిల్స్ టైటిల్.


సెంథిల్‌కు పీఎస్‌ఏ వరల్డ్ టూర్ టైటిల్ 
భారత స్క్వాష్ ప్లేయర్ వెలవన్ సెంథిల్ కుమార్ ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) వరల్డ్ టూర్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అమెరికాలో ఏప్రిల్ 23న జరిగిన మాడిసన్ ఓపెన్ ఫైనల్లో సెంథిల్ నాలుగో సీడ్ ట్రిస్టన్ ఐజెల్(దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. ప్రపంచ 255వ ర్యాంకర్ అయిన సెంథిల్ పీఎస్‌ఏ ఈవెంట్లలో రెండుసార్లు రన్నరప్‌గా నిలిచాడు.


ప్రపంచ కప్ షూటింగ్‌లో రిజ్వీకి రజతం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచ కప్ షూటింగ్ టోర్నమెంట్‌లో భారత షూటర్ షాజర్ రిజ్వీ రజతం గెల్చుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రిజ్వీ 239.8 పాయింట్లు స్కోరు చేశాడు. 240 పాయింట్లు సాధించి ఆర్తెమ్ చెర్‌నుసోవ్ (రష్యా) స్వర్ణం దక్కించుకోగా, 217.1 పాయింట్లతో సముయిల్ డాన్‌కోవ్ (బల్గేరియా) కాంస్యం అందుకున్నాడు. 2018 మార్చిలో మెక్సికోలో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో రిజ్వీ స్వర్ణం గెలిచాడు. 


డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో శ్రేయసికి స్వర్ణం కామన్వెల్త్ గేమ్స్‌లో ఏప్రిల్ 11న జరిగిన మహిళల షూటింగ్ డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో శ్రేయసి సింగ్ స్వర్ణం గెలుచుకుంది. ఫైనల్లో ఆస్ట్రేలియా ప్లేయర్ ఎమ్మా కాక్స్‌ను ఓడించింది. మరోవైపు పురుషుల 50 మీ పిస్టల్ ఈవెంట్‌లో ఓమ్ మితర్వాల్ కాంస్యం గెలుపొందగా, పురుషుల డబుల్‌ట్రాప్ విభాగంలో అంకుర్ మిట్టల్ మరో కాంస్యాన్ని సాధించాడు. 2014 ఎడిషన్‌లో రజతం గెలిచిన శ్రేయసి వచ్చే ఎడిషన్ నుంచి కామన్వెల్త్ గేమ్స్‌లో షూటింగ్ క్రీడను తొలగిస్తుండ టంతో ఈ పతకం తనకు ప్రత్యేకమని పేర్కొంది.

కామన్వెల్త్ గేమ్స్‌లో సుశీల్ కుమార్‌కు స్వర్ణం
భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలుచుకున్నాడు. 74 కేజీల విభాగంలో జోనస్ బోథా (దక్షిణాఫ్రికా)తో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో కేవలం 80 సెకన్లలోనే 10-0తో ఆధిక్యంలోకి వెళ్లి విజేతగా నిలిచాడు. తద్వారా కామన్వెల్త్ గేమ్స్‌లో వరుసగా మూడోసారి స్వర్ణ పతకాన్ని గెలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. అంతేకాకుండా ఈ గేమ్స్ చరిత్రలో మూడుసార్లు బంగారు పతకం గెలిచిన ఏకైక భారత రెజ్లర్‌గా కొత్త చరిత్ర సృష్టించాడు. 
అలాగే పురుషుల 57 కేజీల విభాగంలో మహారాష్ట్ర రెజ్లర్ రాహుల్ అవారే విజేతగా నిలిచాడు. ఫైనల్లో 15-7తో స్టీవెన్ తకహాషి (కెనడా)పై విజయం సాధించి స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. మహిళల రెజ్లింగ్ 53 కేజీల విభాగంలో బబిత కుమారి 3-5తో డయానా వీకెర్ (కెనడా) చేతిలో ఓడిపోయి రజతం గెలుచుకుంది.

బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో శ్రీకాంత్ కు అగ్రస్థానం 
భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్ ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ఏప్రిల్ 12న ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా నిలిచాడు. శ్రీకాంత్ ప్రస్తుతం 76,895 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. తాజా ర్యాంక్‌తో కంప్యూటరైజ్డ్ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ అయిన తొలి భారతీయ ప్లేయర్‌గా అతను గుర్తింపు పొందాడు. 2015 లో మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ టాప్ ర్యాంక్‌లో నిలిచింది.


జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో సురేఖకు స్వర్ణం 
జాతీయ సీనియర్ కాంపౌండ్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వెన్నెం జ్యోతి సురేఖ చాంపియన్‌గా నిలిచింది. పుణేలో ఏప్రిల్ 12న జరిగిన ఫైనల్లో సురేఖ 145-143తో త్రిషా దేబ్ (ఆర్‌ఎస్‌పీబీ)పై గెలుపొంది స్వర్ణం దక్కించుకుంది. గత ఆరేళ్లలో సురేఖ జాతీయ చాంపియన్‌గా నిలవడం ఇది నాలుగోసారి.


కామన్వెల్త్‌లో భారత్‌కు మూడు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో ఏప్రిల్ 13 న జరిగిన పలు ఈవెంట్‌లలో భారత్ మూడు స్వర్ణాలను గెలుచుకుంది. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో 15 ఏళ్ల అనీశ్ భన్వాలా(హరియాణా) 30 పాయింట్ల స్కోరు చేసి స్వర్ణం సాధించాడు. ఈ క్రమంలో 23 పాయింట్లతో డేవిడ్ చాప్‌మన్ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును అధిగమించడంతో పాటు భారత్ నుంచి స్వర్ణం గెలిచిన పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందాడు.
మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో తేజస్విని(మహారాష్ట్ర) 457.9 పాయింట్లు స్కోరు చేసి 449.1 పాయింట్లతో జియాంగ్ (సింగపూర్) పేరిట ఉన్న కామన్వెల్త్ గేమ్స్ రికార్డును చేధించడంతో పాటు స్వర్ణ పథకాన్ని గెలిచింది. ఈ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన అంజుమ్ (455.7 పాయింట్లు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకుంది.
రెజ్లింగ్ పురుషుల 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతకాన్ని నెగ్గాడు. కేన్ చారిగ్ (వేల్స్)తో జరిగిన ఫైనల్లో బజరంగ్ 10-0తో మూడు నిమిషాల్లోపే బౌట్‌ను ముగించాడు.


కామన్వెల్త్ గేమ్స్‌లో ఒకేరోజు 8 స్వర్ణాలు
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు ఒకే రోజు 8 స్వర్ణాలు గెలుచుకున్నారు. ఇందులో బాక్సింగ్‌లో మూడు, రెజ్లింగ్‌లో రెండు, టేబుల్ టెన్నిస్, షూటింగ్, అథ్లెటిక్స్ నుంచి ఒక్కో స్వర్ణం ఉన్నాయి. వీటితో పాటు 5 రజతాలు నాలుగు కాంస్యాలతో మొత్తం 17 పథకాలు దక్కాయి.
స్వర్ణపతకాల వివరాలు
  • పురుషుల జావెలిన్ త్రోలో 86.47 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నీరజ్ చోప్రా స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో జావెలిన్ విభాగంలో భారత్‌కు ఇదే తొలి స్వర్ణం. 2010 ఢిల్లీ క్రీడల్లో కాశీనాథ్ నాయక్ కాంస్యం సాధించాడు.
  • బాక్సింగ్‌లో ఆరుగురు ఫైనల్లోకి చేరగా... మేరీకోమ్, గౌరవ్ సోలంకి (52 కేజీలు), వికాస్ కృషన్ (75 కేజీలు) స్వర్ణాలు గెలిచారు. అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) రజతాలు గెల్చుకున్నారు. మహిళల 48 కేజీల ఫైనల్లో మేరీకోమ్ 5-0తో క్రిస్టినా ఒహారా (నార్తర్న్ ఐర్లాండ్)పై గెలిచి ఈ గేమ్స్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారత మహిళా బాక్సర్‌గా నిలిచింది.
  • షూటింగ్‌లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ ఫైనల్లో సంజీవ్ రాజ్‌పుత్ 454.5 పాయింట్లు స్కోరు చేసి కామన్వెల్త్ గేమ్స్ రికార్డు నెలకొల్పడంతోపాటు పసిడి పతకం గెలిచాడు.
  • టేబుల్ టెన్నిస్ (టీటీ)లో ఇప్పటికే టీమ్ విభాగంలో స్వర్ణం, మహిళల డబుల్స్‌లో రజత పతకాలను గెలుచుకున్న మనిక బాత్రా సింగిల్స్‌లోనూ మరో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. తద్వారా కామన్వెల్త్ క్రీడల చరిత్రలో టీటీలో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళగా మనిక ఘనత సాధించింది.
  • రెజ్లింగ్‌లో నాలుగు విభాగాల్లో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు కాంస్యాలు లభించాయి. మహిళల 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ స్వర్ణ పతకం గెలుచుకోగా, పురుషుల 125 కేజీల విభాగంలో సుమీత్ స్వర్ణం దక్కించుకున్నాడు.

కామన్వెల్త్గేమ్స్‌లో సైనాకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో సైనా నెహ్వాల్ స్వర్ణ పతకం గెలుచుకుంది. సైనా 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో సైనాకిది రెండో స్వర్ణం. ఇంతకుముందు 2010లో ఢిల్లీలో జరిగిన క్రీడల్లోనూ స్వర్ణం గెలుచుకుంది.
అలాగే బ్యాట్మింటన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ రజతం గెల్చుకున్నాడు. పురుషుల డబుల్స్ ఫైనల్లో సాత్విక్-చిరాగ్ జంట 13-21, 16- 21తో మార్కస్ ఎలిస్-క్రిస్ లాన్‌గ్రిడ్‌‌జ (ఇంగ్లండ్) జోడీ చేతిలో ఓడి రజతం గెలిచారు.


ముగిసిన కామన్వెల్త్ గేమ్స్ 2018
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో ఏప్రిల్ 4న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్ 15న ముగిశాయి. 12 రోజుల పాటు జరిగిన ఈ గేమ్స్‌లో భారత్ 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యాలు మొత్తం 66 పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. ఈ గేమ్స్ ప్రారంభోత్సవంలో భారత బృందానికి పి.వి.సింధు పతాకధారిగా వ్యవహరించగా ముగింపు వేడుకల్లో మేరీకోమ్ నేతృత్వం వహించింది. 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్‌హామ్ (ఇంగ్లండ్) లో జరగనున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్ 2018 పతకాల పట్టిక
స్థానం
దేశం
స్వ
కాం
మొ
1
ఆస్ట్రేలియా
80
59
59
198
2
ఇంగ్లండ్
45
45
46
136
3
భారత్
26
20
20
66
4
కెనడా
15
40
27
82
5
న్యూజిలాండ్
15
16
15
46
6
దక్షిణాఫ్రికా
13
11
13
37
7
వేల్స్
10
12
14
36
8
స్కాట్లాండ్
9
13
22
44
9
నైజీరియా
9
9
6
24
10
సైప్రస్
8
1
5
14


చైనా గ్రాండ్‌ప్రి విజేత రికియార్డో
ఫార్ములావన్ చైనా గ్రాండ్‌ప్రిలో ఆస్ట్రేలియాకు చెందిన రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 15న జరిగిన ప్రధాన రేసులో రికియార్డో 56 ల్యాప్‌ల రేసును గంటా 35 నిమిషాల 36.380 సెకన్లలో పూర్తి చేశాడు. తన కెరీర్‌లో అతనికిది ఆరో విజయం. మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్, రెకోనెన్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్‌లో ఇప్పటికే రెండు రేసుల్ని గెలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. తదుపరి రేసు అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 29న జరుగుతుంది. 


క్రికెట్ ప్రసారహక్కులు దక్కించుకున్న స్టార్ ఇండియా భారత్‌లో జరిగే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రసారహక్కులను అత్యధిక మొత్తానికి స్టార్ ఇండియా దక్కించుకుంది. వేలంలో స్టార్ రూ. 6 వేల 138 కోట్ల 10 లక్షలకు హక్కులు గెలుచుకుంది. దీంతో వచ్చే ఐదేళ్ల (2018-2023) లో భారత్‌లో జరిగే మ్యాచ్‌ల ప్రపంచవ్యాప్త టీవీ ప్రసారాలు, డిజిటల్ ప్రసారాల గ్లోబల్ కన్సాలిడేటెడ్ బిడ్ (జీసీఆర్) స్టార్ సొంతమైంది. ఐదేళ్ల క్రితం ప్రసార హక్కుల కోసం స్టార్ రూ.3,851 కోట్లు చెల్లించింది.


కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయికి స్వర్ణం
ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల 48 కేజీల విభాగంలో భారత లిఫ్టర్ మీరాబాయి చాను విజేతగా నిలిచి స్వర్ణ పతకం గెలుచుకుంది. చాను మొత్తం (స్నాచ్‌లో 86+క్లీన్ అండ్ జెర్క్‌లో 110) 196 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. మేరీ హనిత్రా రనైవొసోవా (మారిషస్-170 కేజీలు) రజతం, దినుషా గోమ్స్ (శ్రీలంక-155 కేజీలు) కాంస్యం పొందారు.
పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా 249 కేజీలు (స్నాచ్‌లో 111+క్లీన్ అండ్ జెర్క్ లో 138) బరువెత్తి రజత పతకాన్ని గెల్చుకున్నాడు. మొహమ్మద్ ఇజర్ అహ్మద్ (మలేసియా - 261 కేజీలు) స్వర్ణం... చతురంగ లక్మల్ (శ్రీలంక-248 కేజీలు) కాంస్యం గెలిచారు.
బెర్ముడా కు తొలి స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్‌లో బెర్ముడా కు చెందిన మహిళా ట్రయాథ్లెట్ ఫ్లోరా డఫీ తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది. ట్రయాథ్లాన్ (స్విమ్మింగ్, సైక్లింగ్, రన్నింగ్) రేసును ఆమె 56 నిమిషాల 50 సెకన్లలో ముగించి విజేతగా నిలిచింది.

ఐపీఎల్ సీజన్-11 ప్రారంభం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదకొండో సీజన్ ఏప్రిల్ 7న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ ఫైనల్‌ను మే 27న వాంఖడే స్టేడియంలోనే నిర్వహిస్తారు. నిషేధం కారణంగా రెండు సీజన్ల పాటు లీగ్‌కు దూరమైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు తిరిగి పునరాగమనం చేశాయి.


వెయిట్ లిఫ్టింగ్‌లో సంజిత చానుకు స్వర్ణం 
కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్ సంజిత చాను స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. 53 కేజీల విభాగంలో మొత్తం (స్నాచ్‌లో 84 + క్లీన్ అండ్ జెర్క్‌లో 108) 192 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది. లొవా దికా టొవా (182 కేజీలు-పపువా న్యూగినియా) రజతం, రచెల్ (181 కేజీలు - కెనడా) కాంస్యం గెలిచారు.
పురుషుల 69 కేజీల విభాగంలో 18 ఏళ్ల దీపక్ లాథర్ కాంస్యం నెగ్గి, కామన్వెల్త్ గేమ్స్‌లో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన తొలి భారత లిఫ్టర్‌గా రికార్డులకెక్కాడు.


కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత వెయిట్ లిఫ్టర్లు మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు. ఏప్రిల్ 7న జరిగిన పురుషుల 85 కేజీల ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా కు చెందిన రాగాల వెంకట్ రాహుల్ 338 కేజీలు (స్నాచ్‌లో 151 + క్లీన్ అండ్ జెర్క్‌లో 187) బరువెత్తి స్వర్ణం దక్కించుకున్నాడు. మరో ఈవెంట్ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్ కుమార్ 317 కేజీలు (స్నాచ్‌లో 144 + క్లీన్ అండ్ జెర్క్‌లో 173) బరువెత్తి అగ్రస్థానం దక్కించుకున్నాడు.
మహిళల 69 కేజీల విభాగంలో 22 ఏళ్ల పూనమ్ యాదవ్(ఉత్తరప్రదేశ్) మొత్తం 222 కేజీలు (స్నాచ్‌లో 100+క్లీన్ అండ్ జెర్క్‌లో 122) బరువెత్తి బంగారు పతకాన్ని గెల్చుకోగా, పురుషుల 94 కేజీల విభాగంలో వికాస్ ఠాకూర్ (పంజాబ్) కాంస్య పతకాన్ని సాధించాడు.
మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 16 ఏళ్ల మను భాకర్ ( హరియాణ) స్వర్ణం గెలుచుకుంది. పిన్న వయసులో స్వర్ణం నెగ్గిన భారత షూటర్‌గా ఆమె గుర్తింపు పొందింది. హీనా సిద్ధూ 234 పాయింట్లు సాధించి రజతం, పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రవి కుమార్ కాంస్యాన్ని గెలుచుకున్నారు.
భారత మహిళల టీటీ జట్టు ఫైనల్లో 3-1తో సింగపూర్‌ను ఓడించి కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి బంగారు పతకాన్ని గెలుచుకుంది.


బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి విజేత వెటెల్
ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఏప్రిల్ 8న జరిగిన 57 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 32 నిమిషాల 1.940 సెకన్లలో పూర్తి చేశాడు. బొటాస్ (మెర్సిడెస్) రెండో స్థానం, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. వెటెల్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో టైటిల్. ఇది వరకే ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలోనూ వెటెల్ టైటిల్ గెల్చుకున్నాడు.


కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ కు మరో మూడు స్వర్ణాలు
కామన్వెల్త్ గేమ్స్‌లో ఏప్రిల్ 9న జరిగి పలు ఈవెంట్‌లలో భారత ఆటగాళ్లు మూడు స్వర్ణాలు గెలుచుకున్నారు. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత్ 3-1తో మలేసియాను ఓడించి విజేత గా నిలిచింది.
టేబుల్ టెన్నిస్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం సాధించింది. నైజీరియాతో జరిగిన ఫైనల్లో భారత్ 3-0తో విజయం సాధించింది. 2002లో కామన్వెల్త్ గేమ్స్‌లో టీటీ ప్రవేశ పెట్టాక రెండు టీమ్ ఈవెంట్స్‌లో భారత్‌కు బంగారు పతకాలు రావడం ఇదే తొలిసారి. 
పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 235.1 పాయింట్లు స్కోరు చేసి జీతూరాయ్ స్వర్ణం గెలిచాడు. మరో షూటర్ ఓం మితర్వల్ 214.3 పాయింట్ల స్కోరుతో కాంస్యం దక్కించుకున్నాడు. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో మెహులీ ఘోష్ (247.2 పాయింట్లు) రజతం, అపూర్వీ చండిలా (225.3 పాయింట్లు) కాంస్యం సొంతం చేసుకున్నారు. 


25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో హీనాకు స్వర్ణం
కామన్వెల్త్ గేమ్స్‌లో ఏప్రిల్ 10న జరిగిన 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో హీనా సిద్ధూ స్వర్ణం గెలిచింది. ఫైనల్లో హీనా 38 పాయింట్లు స్కోరు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన ఎలీనా గలియబోవిచ్ 35 పాయింట్లు సాధించి రజతం గెల్చుకోగా అలా సజానా అజహరి (మలేసియా-26 పాయింట్లు) కాంస్యం దక్కించుకుంది. హీనా ఇదివరకే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో రజతం నెగ్గింది.

బాల్ టాంపరింగ్ వివాదంలో స్మిత్, వార్నర్‌లపై ఏడాది నిషేధంక్రికెట్ ఆస్ట్రేలియా ప్రవర్తనా నియమావళిలోని 2.3.5 నిబంధనలను అతిక్రమించినందుకు ముగ్గురు ఆటగాళ్లపై తగిన చర్యలు తీసుకున్నట్లు సీఏ మార్చి 28న ప్రకటించింది. స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌ల పై ఏడాది, బాన్‌క్రాఫ్ట్ పై 9 నెలలు అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. దీంతోపాటు వంద గంటల పాటు స్వచ్ఛంద సేవ చేయాలని సూచించింది. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా వీరు ముగ్గురు బాల్ టాంపరింగ్‌కు పాల్పడినట్లు వీడియోలో రికార్డయింది. 
స్టీవ్ స్మిత్, వార్నర్‌పై సీఏ ఏడాది నిషేధం విధించిన నేపథ్యంలో బీసీసీఐ వారిని ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పించింది.

సంతోష్ ట్రోఫీ విజేత కేరళ 
జాతీయ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ సంతోష్ ట్రోఫీలో కేరళ జట్టు విజేతగా నిలిచింది. ఏప్రిల్ 1న కోల్‌కతాలో జరిగిన ఫైనల్‌లో కేరళ 4-2తో బెంగాల్‌పై విజయం సాధించింది. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజేతగా నిలిచిన కేరళకు ఈ ట్రోఫీలో ఇది ఆరో టైటిల్.


21వ కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభం
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో 21వ కామన్వెల్త్ గేమ్స్ ఏప్రిల్ 4న ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో 23 క్రీడాంశాల్లో 71 దేశాల నుంచి 6,600 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. భారత్ తరఫున మొత్తం 218 మంది క్రీడాకారులు 17 క్రీడాంశాల్లో పాల్గొంటున్నారు. ఈ గేమ్స్‌లో భారత బృందానికి పతాకాధారిగా పీవీ సింధు వ్యవహరించింది. 
కామన్వెల్త్ గేమ్స్ పతకాల విషయంలో 12 సార్లు ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. టేబుల్ టెన్నిస్ (టీటీ) ఈవెంట్‌లో పాల్గొన్న 11 ఏళ్ల వేల్స్ చిన్నారి అనా హర్సె అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందింది. 


షూటింగ్ జూనియర్ ప్రపంచకప్‌లో రెండో స్థానం 
సిడ్నీలో జరిగిన షూటింగ్ జూనియర్ ప్రపంచకప్‌లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. 9 స్వర్ణాలు, 5 రజతాలు, 8 కాంస్యాలతో కలిపి 22 పతకాలను కైవసం చేసుకోగా, చైనా 9 స్వర్ణాలు, 8 రజతాలు, 8 కాంస్యాలతో మొత్తం 25 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది.



మార్చి 2018 స్పోర్ట్స్

ఆసియా బిలియర్డ్స్ విజేత పంకజ్ అద్వానీ 
ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ గెలుచుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన పంకజ్(బెంగళూరు)... ఫైనల్లో 6-1 ఫ్రేమ్‌ల తేడాతో భారత్‌కే చెందిన బాలచంద్ర భాస్కర్‌ను ఓడించాడు. ఓవరాల్‌గా పంకజ్‌కిది ఏడో ఆసియా బిలియర్డ్స్ టైటిల్. గతంలో 2017, 2012, 2010, 2009, 2008, 2005లలో పంకజ్ విజేతగా నిలిచాడు. 


ఆసియా మహిళల స్నూకర్ చాంప్ అమీ కమాని 
ఆసియా మహిళల స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి అమీ కమాని విజేతగా నిలిచింది. ఇండోర్‌కు చెందిన అమీకమాని ఫైనల్లో 3-0తో సిరిపపోర్న్ (థాయ్‌లాండ్)పై విజయం సాధించింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. 


జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో మనూకి రెండు స్వర్ణాలు 
జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్‌లో భారత షూటర్ మనూ భాకర్.. రెండు స్వర్ణాలు సాధించింది. మార్చి 24న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో బరిలో దిగిన 16 ఏళ్ల మను 235.9 పాయింట్లు స్కోర్ చేసి బంగారు పతకం కై వసం చేసుకుంది. కన్యకోర్న్ హిరున్‌ఫోమ్ (థాయ్‌లాండ్-234.9 పాయింట్లు) రజతం... కైమన్ లూ (చైనా-214.2 పాయింట్లు) కాంస్యం గెలిచారు. టీమ్ విభాగంలో మను, దేవాన్షి, మహిమ అగర్వాల్ బృందం బంగారు పతకం దక్కించుకుంది. 
ఇటీవల మెక్సికోలో జరిగిన సీనియర్ వరల్డ్‌కప్ షూటింగ్‌లోను మను రెండు బంగారు పతకాలు సాధించింది. 


కామన్వెల్త్ గేమ్స్ భారత పతాకధారిగా పీవీ సింధు 
గత రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తోన్న భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట (పీవీ) సింధుకు అరుదైన గౌరవం లభించింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరిగే కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవంలో ఆమె భారత బృందానికి పతాకధారిగా (ఫ్లాగ్ బేరర్) వ్యవహరించనుంది. ఏప్రిల్ 4న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింధు త్రివర్ణ పతాకం చేతబూని భారత క్రీడాకారులను ముందుకు నడిపించనుందని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మార్చి 24న ప్రకటించింది. భారత్‌కే చెందిన మరో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్... మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ పేర్లు కూడా పరిశీలనకు వచ్చినా... 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2017 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన 22 ఏళ్ల సింధువైపే ఐఓఏ మొగ్గు చూపింది. 
గత మూడు కామన్‌వెల్త్ గేమ్స్‌లో షూటర్లే భారత బృందాలకు పతాకధారులుగా వ్యవహరించారు. 2006 మెల్‌బోర్న్ గేమ్స్‌లో రాజ్యవర్ధన్ రాథోడ్... 2010 ఢిల్లీ గేమ్స్‌లో అభినవ్ బింద్రా... 2014 గ్లాస్గో గేమ్స్‌లో విజయ్ కుమార్ ఫ్లాగ్ బేరర్‌లుగా పాల్గొన్నారు. 


'బాల్ ట్యాంపరింగ్' వ్యవహారంలో ఆసీస్ ప్లేయర్లపై చర్యలు 
దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో చోటుచేసుకున్న బాల్ ట్యాంపరింగ్ ఉదంతం ఆస్ట్రేలియా క్రికెట్‌లో తీవ్ర సంక్షోభానికి దారితీసింది. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడం, ఏకంగా దేశ ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్ జోక్యం చేసుకోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లను కెప్టెన్, వైస్ కెప్టెన్ పదవుల నుంచి తప్పించింది. వికెట్ కీపర్ టిమ్ పైన్‌కు తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు అప్పగించింది. 
మరోవైపు బాల్ ట్యాంపరింగ్‌కుగాను ఆసీస్ కెప్టెన్ స్మీత్‌పై ఒక టెస్టు నిషేధంతో పాటు వంద శాతం మ్యాచ్ ఫీజు కోత విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. నేరుగా ట్యాంపరింగ్‌కు పాల్పడిన ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోతతో పాటు, మూడు డిమెరిట్ పాయింట్లు ఇచ్చింది. 

ప్రపంచకప్ షూటింగ్‌లో మను-అన్‌మోల్ కు స్వర్ణం
అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) జూనియర్ ప్రపంచకప్‌లో మను భాకర్-అన్‌మోల్ జోడీ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఈ జంట 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో 478.9 పాయింట్లు సాధించింది.
మహిళల స్కీట్ వ్యక్తిగత విభాగంలో జెనెమత్ షెఖాన్ 36 పాయింట్లు సాధించి కాంస్యం సొంతం చేసుకోగా, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో అర్జున్ బబూటా-శ్రేయా అగర్వాల్ జంట మూడో స్థానంలో నిలిచి కాంస్యం దక్కించుకుంది.
ఈ టోర్నీలో ఓవరాల్‌గా ఏడు స్వర్ణాలు, మూడు రజతాలు, ఎనిమిది కాంస్యాలతో (18 పతకాలలు) భారత్ రెండో స్థానంలో ఉంది. 


నేషనల్ హాకీ చాంపియన్‌గా పంజాబ్
నేషనల్ హాకీ చాంపియన్‌షిప్ టైటిల్‌ను పంజాబ్ గెలుచుకుంది. లక్నోలో మార్చి 25న జరిగిన ఫైనల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డ్(పీఎస్‌పీబీ) జట్టును పంజాబ్ ఓడించింది.

ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ విజేత అంకిత రైనా భారత టెన్నిస్ ఆశాకిరణం అంకిత రైనా మూడేళ్ల తర్వాత అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టైటిల్ నెగ్గింది. మార్చి 17న గ్వాలియర్‌లో ముగిసిన ఐటీఎఫ్ మహిళల టోర్నమెంట్ ఫైనల్లో అంకిత 6-2, 7-5తో సెకండ్ సీడ్ అమాన్‌డైన్ హెసీ (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. 2014 డిసెంబర్‌లో చివరిసారి అంకిత పుణే ఐటీఎఫ్ టైటిల్‌ను చేజిక్కించుకుంది. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఆరు సింగిల్స్, 12 డబుల్స్ టైటిళ్లు ఉన్నాయి. 


ఐఎస్‌ఎల్ చాంపియన్ చెన్నైయిన్
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో భారత క్రికెటర్ ధోని, బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ టీమ్ చెన్నైయిన్ ఎఫ్‌సీ రెండోసారి విజేతగా నిలిచింది. మార్చి 17న జరిగిన ఫైనల్లో చెన్నయిన్ 3-2 గోల్స్ తేడాతో బెంగళూరు ఎఫ్‌సీపై విజయం సాధించింది. బ్రెజిలియన్ ఆటగాళ్లు మెల్సన్ అల్వెస్ రెండు గోల్స్, రాఫెల్ ఆగస్టో ఒక గోల్ చేసి చెన్నైయిన్‌ను గెలిపించారు. 
చెన్నైయిన్ జట్టు 2015 సీజన్‌లోనూ టైటిల్ గెలిచింది. లీగ్‌లో రెండుసార్లు విజేతగా నిలిచిన అట్లెటికో డి కోల్‌కతా (2014, 2016) సరసన చేరింది. మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో బెంగళూరు ఎఫ్‌సీ స్టార్ సునీల్ చెత్రి ‘హీరో ఆఫ్ ద లీగ్’, గోవా ఫార్వర్డ్ ఆటగాడు ఫెర్రాన్ కొరొమినస్‌కు ‘గోల్డెన్ బూట్’, ఉదంత (బెంగళూరు) ‘పాస్ ఆఫ్ ద సీజన్’, కాల్డరన్ (చెన్నైయిన్) ‘ఫిటెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’, లాల్‌రుతర (కేరళ బ్లాస్టర్స్) ‘ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద లీగ్’ అవార్డులు అందుకున్నారు.

ఇరానీ కప్ విజేత విదర్భ 
తొలిసారి రంజీ ట్రోఫీ సాధించిన విదర్భ జట్టు ఇరానీ ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది. రెస్టాఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్ తొలి ఇన్నింగ్‌‌సలో భారీ స్కోరు చేసిన విదర్భ ఆ తర్వాత ప్రత్యర్థిని 390 పరుగులకే ఆలౌట్ చేసి 410 పరుగుల తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యంతో ట్రోఫీ చేజిక్కించుకుంది. మ్యాచ్ చివరి రోజు మరోసారి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ రెండో ఇన్నింగ్‌‌సలో వికెట్లేమీ కోల్పోకుండా 79 పరుగులు చేసింది. ఐదు రోజుల ఫైనల్లో ఫలితం తేలకపోవడంతో తొలి ఇన్నింగ్‌‌స ఆధిక్యం దక్కించుకున్న విదర్భకు టైటిల్ ఖాయమైంది. తొలి ఇన్నింగ్‌‌సలో 286 పరుగులు చేసిన వెటరన్ బ్యాట్స్‌మన్ వసీం జాఫర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 


ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంప్ తై జు యింగ్ 
ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను తై జు యింగ్ (చైనీస్ తైపీ), పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యుకి (చైనా) సొంతం చేసుకున్నారు. మార్చి 18న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ తై జు యింగ్ 22-20, 21-13తో రెండో సీడ్ అకానె యామగుచి (జపాన్)పై గెలిచింది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో షి యుకి 21-19, 16-21, 21-9తో తన దేశానికే చెందిన దిగ్గజం లిన్ డాన్‌పై సంచలన విజయం సాధించాడు.


ముక్కోణపు టీ20 టోర్నీ విజేత భారత్ 
శ్రీలంక వేదికగా జరిగిన ముక్కోణపు(భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్) టీ20 సీరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. మార్చి 18న కొలంబోలో జరిగిన ఫైనల్లో భారత్.. 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. దినేశ్ కార్తీక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.. వాషింగ్టన్ సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 


రొనాల్డో 50వ హ్యాట్రిక్
సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అరుదైన హ్యాట్రిక్‌ల రికార్డు సాధించాడు. మార్చి 18న సాధించిన హ్యాట్రిక్ గోల్స్‌తో అతని హ్యాట్రిక్‌ల ఫిఫ్టీ పూర్తయింది. లా లీగా (స్పెయిన్) చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ పోరులో రియల్ మాడ్రిడ్ 6-3 గోల్స్‌తో గిరోనా క్లబ్‌పై ఘనవిజయం సాధించింది. రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ ఏకంగా నాలుగు గోల్స్ చేసి జట్టును ఒంటిచేత్తో గెలిపించాడు. రొనాల్డో 50 హ్యాట్రిక్స్‌లో 41 సార్లు మూడేసి గోల్స్, ఏడు సార్లు నాలుగు గోల్స్, రెండు సార్లు ఐదు గోల్స్ ఉన్నాయి. కేవలం లా లీగాలోనే ఏకంగా 34 సార్లు హ్యాట్రిక్ సాధించిన అతను అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఐదు సార్లు పోర్చుగల్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశాడు. ఓవరాల్‌గా ఫుట్‌బాల్ చరిత్రలో అత్యధిక హ్యాట్రిక్‌లు చేసిన రికార్డు బ్రెజిల్ దిగ్గజం పీలే (92 హ్యాట్రిక్స్) పేరిట ఉంది. 


ఇండియన్ వెల్స్ మాస్టర్స్ విజేత డెల్‌పొట్రో
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అర్జెంటీనా ఆటగాడు డెల్‌పొట్రో గెలుచుకున్నాడు. మార్చి 19న జరిగిన ఫైనల్లో డెల్‌పొట్రో 2 గంటల 42 నిమిషాల్లో 6-4, 6-7 (8/10), 7-6 (7/2)తో స్విస్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను ఓడించి తొలిసారి మాస్టర్స్-1000 స్థాయి టైటిల్‌ను గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన డెల్‌పొట్రోకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు) దక్కగా... ఫెడరర్ ఖాతాలో 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) చేరాయి.
మహిళల సింగిల్స్ విజేత ఒసాకా
ఇండియన్ వెల్స్ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా కైవసం చేసుకుంది. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన ఒసాకా.. ఫైనల్లో 20వ సీడ్ దరియా కసత్‌కినా (రష్యా)ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. తద్వారా సెరెనా విలియమ్స్ (అమెరికా-1999లో), కిమ్ క్లియ్‌స్టర్స్ (బెల్జియం-2005లో) తర్వాత అన్‌సీడెడ్ హోదాలో ఈ టోర్నీ టైటిల్ నెగ్గిన మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు పొందింది. విజేతగా నిలిచిన ఒసాకాకు 13,40,860 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 8 కోట్ల 74 లక్షలు), రన్నరప్ కసత్‌కినాకు 6,54,380 డాలర్లు (రూ. 4 కోట్ల 26 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 


దేవధర్ ట్రోఫీ విజేత భారత్ బి’ దేశవాలీ వన్డే టోర్నీ దేవధర్ ట్రోఫీని భారత్ బి జట్టు కైవసం చేసుకుంది. ధర్మశాల వేదికగా మార్చి 8న జరిగిన ఫైనల్లో భారత్ ‘బి’, కర్ణాటకను ఓడించి టైటిల్ సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేయగా... భారత్ ‘బి’ 48.2 ఓవర్లలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 281 పరుగులు చేసి విజయం సాధించింది. 


ప్రపంచకప్ షూటింగ్‌లో అఖిల్ షెరాన్‌కు పసిడి పతకం 
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో మరో భారత షూటర్ అఖిల్ షెరాన్ పసిడి పతకం సాధించాడు. పురుషుల రైఫిల్ త్రీ పొజిషన్ విభాగంలో మేటి షూటర్లు బరిలో ఉండగా... కెరీర్‌లో కేవలం రెండో ప్రపంచకప్ ఆడుతోన్న 22 ఏళ్ల అఖిల్ 455.6 పాయింట్లతో విజేతగా నిలువగా... బెర్నాడ్ పికిల్ (ఆస్ట్రియా-452 పాయింట్లు) రజతం, ఇస్త్‌వాన్ పెని (హంగేరి-442.3 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్‌కిది తొమ్మిదో పతకం. ఇందులో నాలుగు స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యాలు ఉన్నాయి. 


ప్రపంచకప్ షూటింగ్‌లో తొలిస్థానంలో భారత్
 
మెక్సికోలో జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ సీజన్ తొలి ప్రపంచకప్ షూటింగ్‌లో భారత్ 9 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో నాలుగు స్వర్ణాలు, నాలుగు కాంస్యాలు, ఒక రజతం. దీంతో 32 ఏళ్ల ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో తొలిసారి భారత్ పతకాల పట్టికలో అగ్రస్థానాన్ని దక్కించుకొంది. 
స్వర్ణాలు 
మనూ భాకర్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ 
మనూ భాకర్-ఓం ప్రకాశ్: మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
షాజర్ రిజ్వీ : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్
అఖిల్ షెరాన్ : పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్
రజతం 
అంజుమ్ ముద్గిల్ : మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్. 
కాంస్యాలు 
రవి కుమార్ : పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్. 
జీతూ రాయ్ : పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్. 
మెహులీ ఘోష్ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ 
మెహులీ ఘోష్ : దీపక్ కుమార్: మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్
 

అజ్లాన్ షా టైటిల్ నెగ్గిన ఆస్ట్రేలియా
అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఇఫా(మలేషియా)లో మార్చి 10న జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను ఆస్ట్రేలియా ఓడించింది.

ఫెదరర్ కు స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు క్రీడారంగంలో ‘ఆస్కార్’ అంతటి ప్రతిష్ట ఉన్న ‘లారెస్ స్పోర్ట్స్’ అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 28న జరిగింది. 2017 సంవత్సరానికి క్రీడల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రదర్శనకుగాను టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ ‘వరల్డ్ స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’.. ‘కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్’ అవార్డులను గెల్చుకున్నాడు. మరో టెన్నిస్ దిగ్గజం బోరిస్ బెకర్ చేతుల మీదుగా అతను ఈ పురస్కారాలను అందుకున్నాడు. 
ఫెడరర్ 2005 నుంచి 2008 వరకు వరుసగా నాలుగుసార్లు లారెస్ ‘స్పోర్ట్స్ మన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును అందుకున్నాడు. తాజాగా అతని ఖాతాలో మరో రెండు చేరడంతో మొత్తం ఆరు పురస్కారాలతో అత్యధిక అవార్డులు గెలుచుకున్న ఆటగాడిగానూ చరిత్రకెక్కాడు. 
‘స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ అందుకుంది. అమెకిది నాలుగో అవార్డు. గతంలో 2003, 2010, 2016లో మూడుసార్లు ఈ పురస్కారం అందుకుంది. 
అవార్డు
విజేత
వరల్డ్ స్పోర్‌‌టమన్ ఆఫ్ ద ఇయర్
రోజర్ ఫెదరర్
కమ్‌బ్యాక్ ఆఫ్ ద ఇయర్
రోజర్ ఫెదరర్
స్పోర్‌‌ట్స ఉమన్ ఆఫ్ ద ఇయర్
సెరెనా విలియమ్స్


డోపింగ్‌లో పట్టుబడ్డ జావెలిన్ త్రోయర్ దవిందర్ 
భారత అగ్రశ్రేణి జావెలిన్ త్రోయర్ దవిందర్ సింగ్ కంగ్ డోపింగ్ టెస్టులో పట్టుబడ్డాడు. 2017 నవంబర్‌లో అతని నుంచి అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సేకరించిన రక్త, మూత్ర నమూనాలను పరిశీలించగా దవిందర్ నిషిద్ధ ఉత్ప్రేరకం తీసుకున్నట్లు తేలింది. దీంతో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) వెంటనే అతన్ని పాటియాలలో జరిగిన ఇండియన్ గ్రాండ్‌ప్రి-1 పోటీల నుంచి తప్పించింది. తక్షణమే శిక్షణ కేంద్రం నుంచి నిష్క్రమించాలని ఆదేశించింది. ఇప్పటికై తే తాత్కాలిక నిషేధం విధించినప్పటికీ ‘బి’ శాంపిల్‌లోనూ దోషిగా తేలితే అతనిపై నాలుగేళ్ల నిషేధం పడనుంది. 29 ఏళ్ల దవిందర్ గతేడాది లండన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించి ఈ ఘనత వహించిన తొలి భారత అథ్లెట్‌గా గుర్తింపు పొందాడు. తాజాగా ఏఐయూ పరీక్షల్లో దొరికిన తొలి భారత డోపీగానూ నిలిచాడు. క్రీడారంగాన్ని కుదిపేసిన రష్యా వ్యవస్థీకృత డోపింగ్ ఉదంతంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య ఏఐయూను ఏర్పాటు చేసింది. 


ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్ వినేశ్ ఫోగట్‌కు రజతం 
కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారిణి వినేశ్ ఫోగట్ రజత పతకం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన వినేశ్ ఈ మెగా ఈవెంట్‌లో తృటిలో ఆ అవకాశాన్ని కోల్పోయింది. 50 కేజీల విభాగంలో పోటీ పడ్డ వినేశ్ ఫైనల్లో 2-3తో చున్ లీ (చైనా) చేతిలో ఓటమి పాలైంది. అంతకు ముందు జరిగిన సెమీస్‌లో యూకీ రై (జపాన్)పై వినేశ్ విజయం సాధించింది. 
మరో భారత రెజ్లర్ సంగీత 59 కేజీల విభాగంలో కాంస్య పతకం చేజిక్కించుకుంది. ఫ్రీ స్టైల్ విభాగంలో సంగీత జీన్ ఉమ్ (కొరియా)పై గెలుపొంది కాంస్యం సొంతం చేసుకుంది. 


ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో నవజ్యోత్‌కు స్వర్ణం 
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా నవజ్యోత్ కౌర్ గుర్తింపు పొందింది. మార్చి 2న జరిగిన మహిళల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం ఫైనల్లో 28 ఏళ్ల నవజ్యోత్ కౌర్ 9-1తో మియు ఇమాయ్ (జపాన్)పై ఘనవిజయం సాధించింది. ఐదోసారి ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న నవజ్యోత్ పసిడి పతకం నెగ్గడం ఇదే తొలిసారి. గతంలో ఆమెకు రజతం (2013లో), కాంస్యం (2011లో) లభించాయి. మరోవైపు సాక్షి మలిక్ 62 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని దక్కించుకుంది. 


విజయ్ హజారే ట్రోఫీని గెలుచుకున్న కర్ణాటక
వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. 2018, ఫిబ్రవరి 27న న్యూఢిల్లీలో ముగిసిన ఫైనల్లో సౌరాష్ర్టను కర్ణాటక ఓడించింది.


ప్రపంచ స్నూకర్ కప్ విజేత భారత్ 
తొలిసారి నిర్వహించిన ప్రపంచ స్నూకర్ కప్ టీమ్ ఈవెంట్‌లో భారత్-1 జట్టు టైటిల్ సొంతం చేసుకుంది. మార్చి 2న దోహాలో జరిగిన ఫైనల్లో పంకజ్ అద్వానీ-మానన్ చంద్రలతో కూడిన భారత్ 3-2తో మొహమ్మద్ ఆసిఫ్-బాబర్ మసీ సభ్యులుగా ఉన్న పాకిస్తాన్‌ను ఓడించింది. తొలి మ్యాచ్‌లో మానన్ చంద్ర 24-73తో బాబర్ చేతిలో... రెండో మ్యాచ్‌లో పంకజ్ అద్వానీ 56-61తో ఆసిఫ్ చేతిలో ఓడిపోవడంతో భారత్ 0-2తో వెనుకబడింది. అయితే మూడో మ్యాచ్‌లో పంకజ్-మానన్ చంద్ర ద్వయం 72-47తో ఆసిఫ్-బాబర్ జంటపై గెలిచి మ్యాచ్‌లో నిలిచింది. నాలుగో మ్యాచ్‌లో పంకజ్ 106-20తో బాబర్‌పై.. ఐదో మ్యాచ్‌లో మానన్ చంద్ర 56-20తో ఆసిఫ్‌పై నెగ్గడంతో భారత్ విజయం ఖాయమైంది. 

తాల్ ర్యాపిడ్ చెస్ టోర్నీ విజేత ఆనంద్ 

భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ ఈ ఏడాది తొలి అంతర్జాతీయ టైటిల్ సొంతం చేసుకున్నాడు. మాస్కోలో జరిగిన ప్రతిష్టాత్మక తాల్ స్మారక టోర్నమెంట్‌లో 48 ఏళ్ల ఆనంద్ ర్యాపిడ్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య లీగ్ పద్ధతిలో జరిగిన ఈ టోర్నీలో ఆనంద్ తొమ్మిది రౌండ్‌లకుగాను ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. నాలుగు గేముల్లో గెలిచి, మరో నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకున్న ఆనంద్ ఒక గేమ్‌లో ఓడిపోయాడు. 


షూటింగ్ ప్రపంచకప్‌లో షాజర్ రిజ్వీకి స్వర్ణం 
మెక్సీకోలోని గ్వాడలహారాలో జరిగిన అంతర్జాతీయ షూటింగ్ సీజన్ తొలి టోర్నమెంట్ - ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో భారత షూటర్ షాజర్ రిజ్వీ ‘ప్రపంచ రికార్డు’ ప్రదర్శనతో పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. మార్చి 3న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో రిజ్వీ.. 242.3 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఈ క్రమంలో 241.8 పాయింట్లతో తొమొయుకి మత్సుదా (జపాన్) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును రిజ్వీ బద్దలు కొట్టాడు. భారత్‌కే చెందిన స్టార్ షూటర్ జీతూ రాయ్ 219 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని గెల్చుకోగా... క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ-239.7 పాయింట్లు) రజత పతకం సాధించాడు. ఉత్తరప్రదేశ్ షూటర్ షాజర్ రిజ్వీకి ఇదే తొలి ప్రపంచ కప్.

ప్రపంచకప్‌లో 16 ఏళ్ల భారత షూటర్‌కు స్వర్ణంమెక్సికోలోని గ్వాడలహారాలో జరుగుతున్న ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచ కప్‌లో 16 ఏళ్ల భారత షూటర్ మను భాకర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణం సాధించి రికార్డు సృష్టించింది. తద్వారా ప్రపంచ కప్ షూటింగ్‌లో స్వర్ణం సాధించిన అతి పిన్న వయస్కురాలిగా మను భాకర్ నిలిచింది. మొత్తం 237.5 పాయింట్లతో ఆమె అగ్రస్థానం సాధించగా... జవాలా (237.1 పాయింట్లు) రజతం, సెలిన్ గోబర్‌విలే (ఫ్రాన్‌‌స-217 పాయింట్లు) కాంస్యం గెల్చుకున్నారు. ఇదే విభాగంలో భారత్‌కే చెందిన యశస్విని సింగ్ (196.1 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది. 
పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్ రవికుమార్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచకప్‌లో అతనికి ఇదే తొలి పతకం.

జమైకా బాడ్మింటన్ టోర్నీలో తరుణ్ జంటకు టైటిల్

జమైకా ఇంటర్నేషనల్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ కోన తరుణ్ డబుల్స్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. జమైకాలోని కింగ్‌స్టన్‌లో జరిగిన ఈ టోర్నీ పురుషుల డబుల్స్ ఫైనల్లో... తరుణ్-సౌరభ్ శర్మ (భారత్) జంట 21-17, 21-17తో గారెత్ హెన్రీ-రికెట్స్ (జమైకా) ద్వయంపై గెలిచింది. సెమీస్‌లో ఈ జోడీ 21-5, 21-8తో టాప్ సీడ్ జోస్ గ్యురెవా-డానిల్లె టొర్రె (పెరూ) జంటపై విజయం సాధించింది. 


షూటింగ్ ప్రపంచకప్‌లో మనూకు మరో స్వర్ణం 
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్‌లో తొలిసారి పాల్గొంటున్న హరియాణాకు చెందిన 16 ఏళ్ల మనూ భాకర్ వరుసగా రెండో స్వర్ణ పతకాన్ని కై వసం చేసుకుంది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్‌లో పసిడి పతకం నెగ్గిన మనూ... 24 గంటల్లోపే మరో స్వర్ణం సాధించింది. ఈసారి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన ఓంప్రకాశ్‌తో కలిసి మనూ విజేతగా నిలిచింది. ఐదు జోడీలు పాల్గొన్న ఫైనల్లో మనూ-ఓంప్రకాశ్ ద్వయం 476.1 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానంలో నిలిచింది. సాండ్రా రీట్జ్-క్రిస్టియన్ రీట్జ్ (జర్మనీ-475.2 పాయింట్లు) జంట రజతం... సెలైన్ గొబెర్‌విలె-ఫ్లోరియన్ ఫౌక్వెట్ (ఫ్రాన్స్-415.1 పాయింట్లు) జోడీకి కాంస్యం లభించాయి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ ఈవెంట్‌లో భారత్‌కే చెందిన మెహులీ ఘోష్-దీపక్ కుమార్ ద్వయం కాంస్యం సాధించింది.

బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్‌లో కొత్తగా ఎ ప్లస్’ 
2017 అక్టోబర్ 1 నుంచి 2018 సెప్టెంబర్ 30 వరకు వర్తించే విధంగా బీసీసీఐ మార్చి 7న కొత్త కాంట్రాక్ట్‌లను ప్రకటించింది. మొత్తం 26 మందికి ఇందులో చోటు దక్కింది. ఇందులో భాగంగా తొలిసారిగా ‘ఎ ప్లస్’ గ్రేడ్‌ను కూడా చేర్చింది. ఇందులో ఐదుగురుకి చోటు కల్పించింది. మూడు ఫార్మాట్‌లలో రెగ్యులర్ సభ్యులైన కెప్టెన్ విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లతో పాటు పేసర్లు భువనేశ్వర్, జస్‌ప్రీత్ బుమ్రాలు మాత్రమే ఇందులో ఉన్నారు. 
ఎవరెవరు ఎక్కడ..
ఎ ప్లస్’ గ్రేడ్ (రూ. 7 కోట్లు): కోహ్లి, రోహిత్, ధావన్, భువనేశ్వర్, బుమ్రా. 
ఎ’ గ్రేడ్ (రూ. 5 కోట్లు): అశ్విన్, జడేజా, విజయ్, పుజారా, రహానే, ధోని, సాహా. 
బి’ గ్రేడ్ (రూ. 3 కోట్లు): రాహుల్, ఉమేశ్, కుల్దీప్, చహల్, పాండ్యా, ఇషాంత్, దినేశ్ కార్తీక్. 
సి’ గ్రేడ్ (రూ. 1 కోటి): జాదవ్, పాండే, అక్షర్ పటేల్, కరుణ్ నాయర్, రైనా, పార్థివ్, జయంత్. 
మిథాలీ రాజ్‌కు రూ. 50 లక్షలు
మహిళా క్రికెటర్ల కాంట్రాక్ట్ ఫీజులను కూడా బీసీసీఐ భారీగా పెంచింది. ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న ఆటగాళ్లకు ఇప్పుడు ఏడాదికి రూ. 50 లక్షల (గత ఏడాది రూ. 15 లక్షలు) చొప్పున లభిస్తుంది. ఈ జాబితాలో స్టార్ ప్లేయర్లు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి, హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ఉన్నారు. మరో ఆరుగురికి ‘బి’ గ్రేడ్ (రూ. 30 లక్షలు)లో అవకాశం కల్పించగా... కొత్తగా గ్రేడ్ ‘సి’ని (రూ. 10 లక్షలు) చేర్చి ఇందులో 9 మందిని చేర్చారు. 

ఆసియా రెజ్లింగ్‌లో భారత్ కు 8 పతకాలు
ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు లభించాయి. బిష్‌కెక్ (కిర్గిస్తాన్)లో 2018, మార్చి4న ముగిసిన ఈ పోటీలో చైనా ఏడు స్వర్ణ పతకాలతో మొత్తం 14 పతకాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. ఇరాన్ ఆరు స్వర్ణ పతకాలతో మొత్తం 10 పతకాలతో రెండో స్థానం, ఉజ్బెకిస్థాన్ నాలుగు స్వర్ణాలతో మొత్తం 15 పతకాలతో మూడో స్థానంలో నిలిచాయి.


ఫిబ్రవరి 2018 స్పోర్ట్స్


వింటర్ ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు గెలిచిన ప్లేయర్ :: వింటర్ ఒలింపిక్స్ చరిత్రలో అత్యధికంగా 14 పతకాలు గెలిచిన ప్లేయర్‌గా నార్వేకు చెందిన మారిట్ జోర్జెన్ చరిత్ర సృష్టించింది. తాజా ఒలింపిక్స్‌లో ఆమె ఖాతాలో నాలుగో పతకం చేరింది. స్కీయింగ్‌లో మెరిక అయిన జోర్జెన్ క్రాస్ కంట్రీ టీమ్ స్ప్రింట్ ఫ్రీ ఈవెంట్‌లో మైకెన్ కాస్పెర్సన్ ఫల్లాతో కలిసి కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో 13 పతకాలతో నార్వే క్రీడాకారుడు ఒలె ఇనార్ జోర్న్‌డాలెన్ (నార్వే) పేరిట ఉన్న రికార్డును ఆమె తెరమరుగు చేసింది. ఏ ఒలింపిక్స్ (వింటర్, సమ్మర్)లోనైనా అత్యధిక పతకాలు గెలిచిన రెండో మహిళా అథ్లెట్‌గా 37 ఏళ్ల జోర్జెన్ ఘనత వహించింది. అలనాటి సోవియెట్ (ఇప్పటి ఉక్రెయిన్) జిమ్నాస్ట్ దిగ్గజం లారిసా లాతినినా సమ్మర్ ఒలింపిక్స్‌లో అత్యధికంగా 18 పతకాలు సాధించింది.


ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో అరుణ రెడ్డికి కాంస్యం తెలుగు అమ్మాయి బుద్దా అరుణ రెడ్డి ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్ టోర్నమెంట్‌లో పతకం సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన 22 ఏళ్ల అరుణ వాల్ట్ ఈవెంట్‌లో మూడో స్థానాన్ని సంపాదించి కాంస్య పతకాన్ని కై వసం చేసుకుంది. ఫైనల్లో అరుణ రెడ్డి 13.649 పాయింట్లు స్కోరు చేసింది. జాసా కిస్‌లెప్ (స్లొవేనియా-13.800 పాయింట్లు) స్వర్ణం దక్కించుకోగా... ఎమిలీ (ఆస్ట్రేలియా -13.699 పాయింట్లు) రజతం గెల్చుకుంది. భారత్‌కే చెందిన ప్రణతి నాయక్ (13.416 పాయింట్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. 


ఆస్ట్రియా బ్యాడ్మింటన్ ఓపెన్ విజేత కశ్యప్ 
ఆస్ట్రియా ఓపెన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ టైటిల్‌ను భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ సొంతం చేసుకున్నాడు. ఫిబ్రవరి 24న జరిగిన ఫైనల్లో కశ్యప్ 23-21, 21-14తో జూన్ వె చీమ్ (మలేసియా)పై గెలుపొందాడు. సెమీఫైనల్లో కశ్యప్ 21-18, 21-4తో రౌల్ మస్త్ (ఎస్తోనియా)ను ఓడించాడు. 2015లో సయ్యద్ మోదీ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ గెలిచాక కశ్యప్ నెగ్గిన మరో టైటిల్ ఇదే.


దక్షిణాఫ్రికాతో టీ20 సీరీస్ గెలుచుకున్న మిథాలి సేన
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కై వసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ కై వసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత వహించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3-1తో కై వసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2-1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. 

దక్షిణాఫ్రికాతో టీ20 సీరీస్ గెలుచుకున్న ఇండియా 
దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు టీ20ల సీరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. ఫిబ్రవరి 24న జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో 7 పరుగులతో భారత్ జయకేతనం ఎగురవేసింది. సురేశ్ రైనాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... భువనేశ్వర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం లభించింది. 

బెస్ట్ బాక్సర్’గా వికాస్ కృషన్ 
స్ట్రాండ్‌జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ బాక్సర్ వికాస్ కృషన్ ‘బెస్ట్ బాక్సర్’ పురస్కారాన్ని పొందాడు. ఈ టోర్నీ చరిత్రలో భారత బాక్సర్‌కు ఈ అవార్డు రావడం ఇదే తొలిసారి. పురుషుల 75 కేజీల విభాగంలో వికాస్ విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫైనల్లో వికాస్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతక విజేత ట్రాయ్ ఇస్లే (అమెరికా)ను ఓడించాడు. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాక వికాస్ ఖాతాలో చేరిన మరో పతకం ఇదే. 
ఓవరాల్‌గా ఈ టోర్నీలో భారత్ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. భారత బాక్సర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఆరు కాంస్యాలతో కలిపి మొత్తం 11 పతకాలను గెల్చుకున్నారు.


విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక 
వన్డే ఫార్మాట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. ఫిబ్రవరి 27న సౌరాష్ట్రతో ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన ఫైనల్లో కర్ణాటక 41 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కర్ణాటక 45.5 ఓవర్లలో 253 పరుగులకు ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 212 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక ప్లేయర్ మయాంక్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. 


కేప్‌టౌన్’కు భారత్, దక్షిణాఫ్రికా జట్ల సాయం
తీవ్ర వర్షాభావంతో నీటికి కటకటలాడుతున్న కేప్‌టౌన్‌కు భారత్, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు 8,500 అమెరికన్ డాలర్లు (రూ.5.52 లక్షలు) విరాళం ప్రకటించాయి. ఈ డబ్బును నగరంలో బాటిళ్లతో నీటి సరఫరా, బోర్లు వేసేందుకు వినియోగిస్తారు. ఫిబ్రవరి 24న కేప్‌టౌన్‌లోని న్యూలాండ్‌‌సలో మూడో టి20 అనంతరం ఈ మొత్తాన్ని రెండు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డు ప్లెసిస్‌లు ‘గివర్స్ ఫౌండేషన్’కు అందజేశారు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుతో పాటు మూడో వన్డే, చివరి టి20లకు కేప్‌టౌన్ ఆతిథ్యమిచ్చింది. ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీల వేలం ద్వారా నగరంలో నీటి ఎద్దడి నివారణకు నిధులు సేకరించాలని తాను, కోహ్లి చర్చించుకున్నామని డు ప్లెసిస్ చెప్పాడు.

స్విస్ ఓపెన్ టైటిల్ నెగ్గిన సమీర్ వర్మభారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సమీర్ వర్మ స్విస్ ఓపెన్(బ్యాడ్మింటన్) పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. వియన్నాలో ఫిబ్రవరి 25న జరిగిన ఫైనల్లో జాన్ జార్జెన్‌సెన్(డెన్మార్క్)ను సమీర్ ఓడించాడు.

భారత హాకీకి ప్రధాన స్పాన్సర్‌గా ఒడిశా ఆనవాయితీకి భిన్నంగా ఒడిశా సర్కారు జాతీయ క్రీడ హాకీకి అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. వచ్చే ఐదేళ్ల పాటు ఒడిశా ప్రభుత్వం భారత పురుషుల, మహిళల హాకీ జట్లకు స్పాన్సర్‌షిప్ అందించనుంది. భారత క్రీడల చరిత్రలో ఓ రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఫిబ్రవరి 15న న్యూఢిల్లీలో ఘనంగా నిర్వహించిన వేడుకలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ విషయాన్ని ప్రకటించారు. కార్యక్రమంలో భారత పురుషులు, మహిళా జట్ల సభ్యులు, అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్), ఐఓఏ అధ్యక్షుడు కూడా అయిన నరీందర్ బాత్రా, ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తదితరులు పాల్గొన్నారు. 
2014 చాంపియన్‌‌స ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన భువనేశ్వర్‌లో 2018 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 16 వరకు ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. 


ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఏపీ బాక్సర్‌కు స్వర్ణం 
ఆసియా క్రీడల టెస్టు ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్ కుమార్ బంగారు పతకం సాధించాడు. ఈ పోటీల్లో మరో నలుగురు భారత బాక్సర్లు కూడా పసిడి పతకాలు నెగ్గారు. మూడు సార్లు కింగ్‌‌స కప్‌లో విజేతగా నిలిచిన శ్యామ్ కుమార్ 49 కేజీల ఫైనల్లో 4-1తో మరియో బ్లాసియస్ కలి (ఇండోనేసియా)పై గెలుపొందాడు. ఇతనితో పాటు మనీశ్ కౌషిక్, షేక్ సల్మాన్ అన్వర్, ఆశిష్, మహిళల ఈవెంట్‌లో పవిత్ర బంగారు పతకాలు సాధించారు. మరో మహిళా బాక్సర్ శశి చోప్రా (57 కేజీలు) కాంస్యంతో సరిపెట్టుకుంది.


దక్షిణాఫ్రికాలో తొలిసారి సిరీస్ గెలిచిన భారత్ 
దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరు వన్డేల సీరీస్‌ను భారత్ 5-1తో గెలుచుకుంది. తద్వారా దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి వన్డే సీరీస్‌ను గెలుచుకుంది. ఫిబ్రవరి 17న జరిగిన ఆరో వన్డేలో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోహ్లి (96 బంతుల్లో 129 నాటౌట్; 19 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో ముందుండి జట్టును గెలిపించాడు. ఈ సిరీస్‌లో 3 సెంచరీలు, 1 అర్ధసెంచరీ సహా 186 సగటుతో 558 పరుగులు చేసిన కోహ్లికే ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 

ఆరేళ్ల తర్వాత ప్రపంచ నంబర్‌వన్‌గా ఫెడరర్ యువ ఆటగాళ్లకు దీటుగా ఆడుతూ... సమకాలీకులపై పూర్తి ఆధిప త్యం చలాయిస్తూ... స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ పూర్వ వైభవాన్ని అందుకున్నాడు. గత నెలలో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను తాజాగా రోటర్‌డామ్ ఓపెన్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని మళ్లీ ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. 26 వారాలుగా నంబర్‌వన్ స్థానంలో ఉన్న రాఫెల్ నాదల్ (స్పెయిన్) రెండో ర్యాంక్‌కు పడిపోనున్నాడు. 
  • అగ్రస్థానానికి చేరుకున్న క్రమంలో ఫెడరర్ తన పేరిట ఎన్నో ఘనతలు లిఖించుకున్నాడు. పురుషుల సింగిల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న పెద్ద వయస్కుడిగా (36 ఏళ్ల 6 నెలల 11 రోజులు) ఫెడరర్ గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు ఆండ్రీ అగస్సీ (33 ఏళ్లు; అమెరికా 2003లో) పేరిట ఉండేది.
  • కోల్పోయిన టాప్ ర్యాంక్‌ను మళ్లీ అందుకునేందుకు ఎక్కువ విరామం (5 ఏళ్ల 106 రోజులు) తీసుకున్న ప్లేయర్‌గానూ ఫెడరర్ రికార్డు నెలకొల్పాడు. 2012 నవంబర్ 4న నంబర్‌వన్ ర్యాంక్ చేజార్చుకున్న ఫెడరర్ ఈనెల 19న మళ్లీ దానిని అందుకోనున్నాడు.
  • తన కెరీర్‌లో 2004 ఫిబ్రవరి 2న తొలిసారి నంబర్‌వన్ అయిన ఫెడరర్ రికార్డుస్థాయిలో వరుసగా 237 వారాలు ఆ స్థానంలో ఉన్నాడు. 2008 ఆగస్టు 17న టాప్ ర్యాంక్ కోల్పోయిన అతను మళ్లీ రెండుసార్లు (2009 జూలై 6 నుంచి 2010 జూన్ 6 వరకు; 2012 జూలై 9 నుంచి 2012 నవంబర్ 4 వరకు) శిఖరాగ్రానికి చేరుకున్నాడు.

ఫెడరర్‌కు రోటర్‌డామ్ ఓపెన్ టైటిల్ 

ఫిబ్రవరి 19న ముగిసిన రోటర్‌డామ్ ఓపెన్ టోర్నీ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఫెడరర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫెడరర్ 6-2, 6-2తో దిమిత్రోవ్ (బల్గేరియా)ను అలవోకగా ఓడించాడు. తద్వారా తన కెరీర్‌లో 97వ సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. 

స్టార్ ఇండియాకు ఐపీఎల్ ఆడియో-విజువల్ హక్కులు 
స్టార్ ఇండియా 2018-19 సీజన్‌కు ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ దేశవాళీ సీజన్ ఆడియో, వీడియో ప్రొడక్షన్ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులు కలిగి ఉంది. ‘మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బీసీసీఐ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించింది. ఐపీఎల్ 2018, 2018-19 సీజన్ ప్రొడక్షన్ హక్కులు స్టార్ ఇండియాకు దక్కాయి’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌధురి వెల్లడించారు. ఇదే ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పొడిగించేందుకు, 2020 ఐపీఎల్‌కు ప్రత్యేకంగా కొనసాగించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉందని అమితాబ్ తెలిపాపరు.
ఐపీఎల్ అయిదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్, గ్లోబల్ ప్రసార హక్కులను గతేడాది స్టార్ ఇండియా రూ.16,347 కోట్లకు దక్కించుకుంది. 


వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం దక్షిణ కొరియాలోని ప్యాంగ్‌చాంగ్ నగరం వేదికగా ప్రతిష్టాత్మక వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 9న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. 92 దేశాల నుంచి 2,920 మంది క్రీడాకారులు 102 స్వర్ణ పతకాల కోసం పోటీపడనున్నారు. భారత్ తరఫున ఇద్దరు మాత్రమే (శివ కేశవన్, జగదీశ్) బరిలో ఉన్నారు. వరుసగా ఆరో ఒలింపిక్స్‌లో పోటీపడుతున్న శివ కేశవన్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారిగా వ్యవహరించాడు. 


ఇండియా ఓపెన్ విజేత సౌరవ్
భారత నంబర్‌వన్ స్క్వాష్ ప్లేయర్ సౌరవ్ ఘోషల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ఫిబ్రవరి 11న జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సౌరవ్ 11-9, 5-11, 6-11, 11-7, 12-10తో నికోలస్ ముల్లర్ (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు.

న్యూఢిల్లీలో ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్‌జీ)’ జనవరి 31న ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న క్రీడా పోటీలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని అన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. 
అండర్-17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారు. 

మానవ్‌కు టీటీ అండర్-18 టాప్ ర్యాంక్
భారత యువ ఆటగాడు మానవ్ వికాస్ ఠక్కర్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ (టీటీ)లో టాప్ ర్యాంక్‌ను చేరుకున్నాడు. గుజరాత్‌కు చెందిన మానవ్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) విడుదల చేసిన తాజా ర్యాంకులో 6,396 రేటింగ్ పాయింట్లతో అండర్-18 బాలుర సింగిల్స్ విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా మానవ్ చరిత్రకెక్కాడు.


ఇండియా ఓపెన్ టోర్నీలో భారత్‌కు 8 స్వర్ణాలు
న్యూఢిల్లీలో ఫిబ్రవరి 1న ముగిసిన ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు సత్తా చాటారు. 18 కేటగిరీలలో కలిపి 8 స్వర్ణాలు, 10 రజతాలు, 23 కాంస్య పతకాలతో మొత్తం 41 పతకాలను సొంతం చేసుకున్నారు.
మహిళల విభాగంలో మేరీకోమ్ (48 కేజీలు), మనీషా (54 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), ప్విలావో బసుమతిరి (64 కేజీలు)... పురుషుల విభాగంలో సంజీత్ (91 కేజీలు), అమిత్ (49 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) స్వర్ణ పతకాలను గెలుపొందారు.
పురుషుల 49 కేజీల ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ బాక్సర్ కాకర శ్యామ్‌కుమార్ 0-5తో భారత్‌కే చెందిన అమిత్ చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకున్నాడు. 56 కేజీల విభాగంలో తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుస్సాముద్దీన్ సెమీస్‌లో ఓడి కాంస్య పతకం గెలుచుకున్నాడు.


అండర్ - 19 ప్రపంచ కప్ విజేత భారత్ 
న్యూజిలాండ్ వేదికగా జరిగిన అండర్ - 19 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. మౌంట్ మాంగనీలో జరిగిన ఫైనల్లో టీ మిండియా 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. నాలుగోసారి అండర్-19 ప్రపంచకప్ గెల్చుకుని కొత్త రికార్డు నెలకొల్పింది. 
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఓపెనర్ మన్‌జ్యోత్ కల్రా (102 బంతుల్లో 101 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) అద్భుత శతకంతో భారత్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 38.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. కల్రాకే ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది. టోర్నీ ఆసాంతం బ్యాటింగ్‌లో రాణించిన శుభ్‌మన్ గిల్ (6 మ్యాచ్‌ల్లో 372 పరుగులు; ఒక సెంచరీ, 3 అర్ధ సెంచరీలు) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా ఎంపికయ్యాడు. 
భారత్ ఇంతకముందు 2000, 2008, 2012లో అండర్ - 19 ప్రపంచ కప్ గెలుచుకుంది. 


ఇండియా ఓపెన్ టైటిల్ విజేత బీవెన్ జాంగ్
ఇండియా ఓపెన్ టైటిల్‌ను చైనా సంతతికి చెందిన అమెరికా క్రీడాకారిణి బీవెన్ జాంగ్ సొంతం చేసుకుంది. న్యూఢిల్లీలో ఫిబ్రవరి 4న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్, టాప్ సీడ్ సింధుని ఓడించి జాంగ్ టైటిల్‌ను గెలుచుకుంది. తన కెరీర్‌లో సింధుపై జాంగ్‌కిది వరుసగా రెండో విజయం. గతేడాది ఇండోనేసియా ఓపెన్‌లోనూ సింధును జాంగ్ ఓడించింది. విజేతగా నిలిచిన జాంగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 83 వేలు), 9200 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ సింధుకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 53 వేలు), 7800 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చైనాలో జన్మించిన 27 ఏళ్ల బీవెన్ జాంగ్ 2007 నుంచి 2013 వరకు సింగపూర్‌కు ప్రాతినిధ్యం వహించింది. 2013 నుంచి అమెరికా తరఫున ఆడుతోంది. 




Sunday, 11 February 2018

జనవరి 2018 స్పోర్ట్స్

ఐపీఎల్ - 2018 వేలంఐపీఎల్ సీజన్ 11కు సంబంధించిన 2018 వేలం జనవరి 27, 28 తేదీల్లో బెంగళూరులో జరిగింది. ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. గతేడాదిలాగే ఈ ఏడాదీ ఫ్రాంచైజీలన్నీ వేలంలో అతనిపైనే గాలం వేశాయి. మొత్తానికి రూ.12.50 కోట్లతో రాజస్తాన్ రాయల్స్ వశమయ్యాడు స్టోక్స్. గతేడాది (రూ. 14.50 కోట్లు; పుణే)తో పోలిస్తే 2 కోట్లు తక్కువైనా... అప్పుడు ఇప్పుడు వేలంలో అగ్రస్థానం అతనికే లభించింది. ఇదే జట్టు లెఫ్టార్మ్ పేస్ బౌలర్ జైదేవ్ ఉనాద్కత్‌ను రూ.11.5 కోట్లకు సొంతం చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీశ్ పాండేను రూ.11 కోట్లకు దక్కించుకుంది. 
2018 వేలంలో..
అమ్ముడుపోయిన మొత్తం ఆటగాళ్ల సంఖ్య - 169
మొత్తం భారత ఆటగాళ్లు - 113 
అన్‌క్యాప్డ్ భారత ఆటగాళ్లు - 56 
మొత్తం విదేశీ ఆటగాళ్లు - 71 
ఫ్రాంచైజీలు వెచ్చించిన మొత్తం - రూ. 431 కోట్ల 70 లక్షలు 

ఆస్ట్రేలియా ఓపెన్ విజేత రోజర్ ఫెడరర్ 
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను స్విట్జర్లాండ్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెడరర్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)పై గెలుపొందడం ద్వారా 36 ఏళ్ల రోజర్ తన కెరీర్‌లో 20వ టైటిల్‌ను గెలుచుకున్నాడు. విజేతగా నిలిచిన ఫెడరర్‌కు 40 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 63 లక్షలు)... రన్నరప్ మారిన్ సిలిచ్‌కు 20 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 31 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 
200వ గ్రాండ్‌స్లామ్... 30వ ఫైనల్... 
టెన్నిస్ చరిత్రలో ఇది 200వ గ్రాండ్‌స్లామ్ టోర్నీ. ఇందులో 30వ ఫైనల్ ఆడిన ఫెడరర్ 20వ టైటిల్ గెలవడం విశేషం. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అతనికిది ఆరో టైటిల్. దీంతో ఇది వరకే ఈ ఘనత సాధించిన జొకోవిచ్ (సెర్బియా), అలనాటి ఆసీస్ దిగ్గజం రాయ్ ఎమర్సన్‌ల సరసన నిలిచాడు. 


ఇండోనేషియా ఓపెన్ విజేత తై జు యింగ్
ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ప్రపంచ నంబర్ వన్, టాప్ సీడ్ తై జు యింగ్(చైనీస్ తైపీ) గెలుచుకుంది. జనవరి 28న జరిగిన ఫైనల్లో తై జుయి యింగ్.. భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. మొత్తంగా సైనాపై తై జు యింగ్‌కిది వరుసగా ఏడో విజయం. విజేతగా నిలిచిన తై జు యింగ్‌కు 26,250 డాలర్లు (రూ. 16 లక్షల 69 వేలు)... రన్నరప్ సైనాకు 13,300 డాలర్లు (రూ. 8 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 


ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత కరోలిన్ వోజ్నియాకి
ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను డెన్మార్ స్టార్ కరోలిన్ వోజ్నియాకి సొంతం చేసుకుంది. జనవరి 27న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై గెలుపొంది టైటిల్ విజేతగా నిలిచింది. తద్వారా 11 ఏళ్ల తర్వాత మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. దీంతో పాటు డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని ఖాయం చేసుకుంది. 


టెస్ట్ సిరీస్ కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా
భారత్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను దక్షిణాఫ్రికా గెలుచుకుంది. జొహన్నెస్‌బర్గ్‌లో జనవరి 27న ముగిసిన మూడో టెస్టును భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికా వశమైంది.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ‘ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికయ్యాడు. దిగ్గజ ఆల్‌రౌండర్ సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఇచ్చే ఈ అవార్డును తొలిసారి కోహ్లి అందుకోనున్నాడు. భారత్ తరఫున గతంలో ద్రవిడ్, సచిన్, అశ్విన్ దీనిని గెల్చుకున్నారు. ఇక 50 ఓవర్ల ఫార్మాట్‌లో తిరుగులేని ప్రదర్శన కనబర్చి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచిన కోహ్లి ‘వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఐసీసీ టెస్టు, వన్డే జట్లలో స్థానం లభించడంతో పాటు ఆ రెండు టీమ్‌లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపిక కావడం కోహ్లికి లభించిన మరో అరుదైన గౌరవం. 
మరో ప్రధాన అవార్డు ఐసీసీ ‘టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు లభించింది. ఇంగ్లండ్‌పై భారత యువ లెగ్‌స్పిన్నర్ యజువేంద్ర చహల్ బౌలింగ్ (6/25) 2017 టి20 అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. ఎమర్జింగ్ క్రికెటర్ అవార్డు హసన్ అలీ (పాకిస్తాన్)కు దక్కగా... అఫ్ఘానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. 
ఐసీసీ టెస్టు ఎలెవన్, వన్డే ఎలెవన్ జట్లను కూడా ప్రకటించింది. టెస్టు జట్టులో భారత్ తరఫున చతేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్‌లకు చోటు లభించింది. మూడో డబుల్ సెంచరీతో చెలరేగిన రోహిత్ శర్మ, పేస్ అస్త్రం జస్‌ప్రీత్ బుమ్రా వన్డే టీమ్‌లోకి ఎంపికయ్యారు. వార్నర్, స్టోక్స్, డి కాక్ రెండు జట్లలోనూ ఉన్నారు. 
ఐసీసీ టెస్టు ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), ఎల్గర్, వార్నర్, స్మిత్, పుజారా, స్టోక్స్, డి కాక్, అశ్విన్, స్టార్క్, రబడ, అండర్సన్. 
ఐసీసీ వన్డే ఎలెవన్: కోహ్లి (కెప్టెన్), వార్నర్, రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డివిలియర్స్, డి కాక్, స్టోక్స్, బౌల్ట్, హసన్ అలీ, రషీద్ ఖాన్, బుమ్రా.
అవార్డు విజేతలు
ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్:
 స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)
ఐసీసీ అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: రషీద్ ఖాన్ (అఫ్గానిస్తాన్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: హసన్ అలీ(పాకిస్తాన్)
ఫ్యాన్స్ మూమెంట్ ఆఫ్ ది ఇయర్: పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకోవడం.
ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్: మరాయిస్ ఎరాస్‌మస్ (దక్షిణాఫ్రికా)


900 రేటింగ్ పాయింట్ల మార్క్‌ని అందుకున్న కోహ్లీ జనవరి 18న ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్‌‌సలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తొలిసారి 900 రేటింగ్ పాయింట్లు సాధించాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్ సునీల్ గావస్కర్ (916 పాయింట్లు-1979లో) తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. తాజా పాయింట్లతో అతను వరల్డ్ ర్యాంకింగ్‌‌సలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం 947 పాయింట్లతో స్మిత్ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. 
గతంలో భారత ఆటగాళ్లు సచిన్ (898), ద్రవిడ్ (892) 900 పాయింట్ల మార్క్‌కు చేరువగా వచ్చినా దానిని అందుకోలేకపోయారు. ఓవరాల్‌గా 900 రేటింగ్ పాయింట్ల మైలురాయిని అందుకున్న 31వ బ్యాట్స్‌మన్ కోహ్లి. డాన్ బ్రాడ్‌మన్ 961 పాయింట్లతో ఆల్‌టైమ్ టాప్‌గా నిలిచాడు. 


అంధుల వన్డే ప్రపంచ కప్ విజేత భారత్అంధుల క్రికెట్ వన్డే ప్రపంచకప్‌ను భారత్ కైవసం చేసుకుంది. జనవరి 20న షార్జాలో జరిగిన ఫైనల్లో పాకిస్తాన్‌పై రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వరుసగా రెండోసారి కప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ నిలిచింది. 2014లో భారత్ తొలిసారి ప్రపంచకప్ గెలుచుకుంది. గతేడాది టి20 వరల్డ్‌కప్ సైతం సొంతం చేసుకుంది.
బౌలింగ్‌లో ఒక వికెట్ తీయడంతో పాటు బ్యాటింగ్‌లో కీలక ఇన్నింగ్‌‌స ఆడిన సునీల్ రమేష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం దక్కింది.


రిషబ్ పంత్ సూపర్ ఫాస్ట్ సెంచరీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ (38 బంతుల్లో 116 నాటౌట్; 8 ఫోర్లు, 12 సిక్సర్లు) సుడిగాలి ఇన్నింగ్‌‌స ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి.. భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ రికార్డుని నెలకొల్పాడు. జనవరి 14న ఫిరోజ్ షా కోట్ల స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌కు దిగిన హిమాచల్ ప్రదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా ఢిల్లీ విజయాన్నందుకుంది.
వేగవంతమైన సెంచరీ రికార్డులో.. పంత్ కంటే ముందు వరుసలో గేల్ (30 బంతుల్లో 100) ఉన్నాడు. 2013 ఐపీఎల్‌లో పుణే వారియర్స్‌పై బెంగళూరు తరఫున గేల్ ఈ ఘనత సాధించాడు. 


పీబీఎల్ 2017-18 చాంపియన్ హైదరాబాద్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) మూడో సీజన్‌లో హైదరాబాద్ హంటర్స్ విజేతగా నిలిచింది. జనవరి 14న హైదరాబాద్ గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన టైటిల్ పోరులో హైదరాబాద్ 4-3 స్కోరుతో బెంగళూరు బ్లాస్టర్స్‌పై విజయం సాధించి.. తొలిసారి పీబీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 

స్కీయింగ్‌లో భారత్‌కు తొలి అంతర్జాతీయ పతకం హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన అమ్మాయి అంచల్ ఠాకూర్ స్కీయింగ్‌లో దేశానికి తొలి అంతర్జాతీయ పతకం అందించింది. టర్కీలో అంతర్జాతీయ స్కీ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆల్ఫైన్ ఎజ్డర్ 3200 కప్‌లో స్లాలోమ్ రేస్ విభాగంలో అంచల్ కాంస్య పతకం గెలిచింది.

జాతీయ సీనియర్ కబడ్డీ చాంప్స్ హిమాచల్, మహారాష్ట్రజాతీయ సీనియర్ కబడ్డీ చాంపియన్‌షిప్ - 2017లో హిమాచల్ ప్రదేశ్, మహారాష్ట్ర జట్లు విజేతలుగా నిలిచాయి. జనవరి 5న హైదరాబాద్‌లోని బాలయోగి స్టేడియంలో జరిగిన మహిళల ఫైనల్లో హిమాచల్ ప్రదేశ్ 38-35తో ఇండియన్ రైల్వేస్‌పై గెలుపొంది టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల టైటిల్ పోరులో మహారాష్ట్ర 34-29తో సర్వీసెస్‌ను ఓడించింది. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య అధ్యక్షులు జేఎస్ గెహ్లాట్ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.


డోపింగ్‌లో పట్టుబడ్డ యూసుఫ్ పఠాన్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ డోపింగ్‌లో పట్టుబడి.. ఐదు నెలల నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గతేడాది మార్చి 16న అతడి నుంచి రక్త, మూత్ర నమూనాలను సేకరించింది. అయితే ఫలితాలు ఆలస్యంగా రావడంతోపాటు, యూసుఫ్ పఠాన్ ఉద్దేశపూర్వకంగా డోపింగ్‌కు పాల్పడకపోవడంతో బోర్డు అతని నిషేధాన్ని తగ్గించింది. గతేడాది నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో అతను నిషిద్ధ ఉత్ప్రేరకం ‘టెర్బుటలైన్’ తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత జాబితాలోని మెడిసిన్. అయితే దీన్ని యూసుఫ్ దగ్గుమందు ద్వారా తీసుకున్నాడు. నేరుగా కాకుండా అస్వస్థతలో తెలియక తీసుకోవడంతో అతనికి నిర్వహించిన డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. దీనిపై అతను ఇచ్చిన వివరణపై సంతృప్తి చెందిన బీసీసీఐ ఐదు నెలల నిషేధంతో సరిపెట్టింది. 2018 జనవరి 14న ఈ నిషేధం ముగుస్తుందని బోర్డు ప్రకటించింది. 


టాటా ఓపెన్ మహారాష్ట్ర విజేత సిమోన్టాటా ఓపెన్ మహారాష్ట్ర టెన్నిస్ టోర్నమెంట్‌లో ఫ్రాన్స్ టెన్నిస్ ప్లేయర్ గైల్స్ సిమోన్ పురుషుల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచాడు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన సిమోన్ ఫైనల్లో 7-6 (7/4), 6-2తో ప్రపంచ 14వ ర్యాంకర్ కెవిన్ అండర్సన్ (దక్షిణాఫ్రికా)ను ఓడించాడు. విజేతగా నిలిచిన సిమోన్‌కు 89,435 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 65 వేలు)తోపాటు 250 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 


ఫెడరర్, బెన్సిచ్‌లకు హాప్‌మన్ కప్ - 2017ప్రతిష్టాత్మక హాప్‌మన్ కప్‌లో రోజర్ ఫెడరర్, బెలిండా బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 6న జరిగిన ఫైనల్లో ఫెడరర్, బెన్సిచ్‌లతో కూడిన స్విట్జర్లాండ్ జట్టు 2-1తో అలెగ్జాండర్ జ్వెరెవ్, ఎంజెలిక్ కెర్బర్ సభ్యులుగా ఉన్న జర్మనీ జట్టును ఓడించింది. తొలుత ఫైనల్స్ పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో ఫెడరర్ 6-7 (4/7), 6-0, 6-2తో జ్వెరెవ్‌పై గెలిచి స్విట్జర్లాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మహిళల సింగిల్స్‌లో కెర్బర్ 6-4, 6-1తో బెన్సిచ్‌ను ఓడించి స్కోరును 1-1తో సమం చేసింది. నిర్ణాయక మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో ఫెడరర్-బెన్సిచ్ జోడీ 4-3 (5/3), 4-2తో కెర్బర్-జ్వెరెవ్ జంటను ఓడించి టైటిల్‌ను ఖాయం చేసుకుంది. 
30 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ టోర్నీలో స్విట్జర్లాండ్ విజేతగా నిలువడం ఇది మూడోసారి. 2001లో మార్టినా హింగిస్‌తో కలిసి ఫెడరర్ ఈ టోర్నీలో టైటిల్ నెగ్గగా... 1992లో జాకబ్ హసెక్, మాన్యుయెలా మలీవా తొలిసారి స్విట్జర్లాండ్‌ను చాంపియన్‌గా నిలబెట్టారు. 


యాషెస్ సీరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సీరీస్‌ని ఆస్ట్రేలియా 4-0తో గెలుచుకుంది. జనవరి 8న ముగిసిన సిరీస్‌లో చివరిదైన ఐదో టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్‌‌స 123 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ కమిన్‌‌సకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’.. కెప్టెన్ స్మిత్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ పురస్కారాలు లభించాయి.


వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017 విజేత ఆనంద్ మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు. 
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. 

రంజీ ట్రోఫీ - 2017 చాంపియన్ విదర్భ విదర్భ జట్టు రంజీ ట్రోఫీ సరికొత్త విజేతగా నిలిచింది. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియం వేదికగా జనవరి 1న ముగిసిన ఫైనల్లో విదర్భ 9 వికెట్ల తేడాతో ఏడుసార్లు ఛాంపియన్ అయిన ఢిల్లీపై విజయం సాధించి.. ప్రతిష్ఠాత్మక దేశవాళీ కప్‌ను సొంతం చేసుకుంది. హ్యాట్రిక్ సహా మొత్తం 8 వికెట్లు తీసిన గుర్బానీకే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. రంజీ ట్రోఫీ గెలిచిన విదర్భ జట్టుకు ఆ రాష్ట్ర క్రికెట్ సంఘం రూ. 5 కోట్ల నజరానా ప్రకటించింది. 


వరల్డ్ బ్లిట్జ్ చెస్ టోర్నీలో ఆనంద్‌కు కాంస్యం వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన భారత దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్... ఆ వెంటనే జరిగిన బ్లిట్జ్ టోర్నీలో మూడో స్థానంలో నిలిచాడు. ఇందులో జరిగిన 21 గేమ్‌లలో అతను ఒక్కటి మాత్రమే ఓడాడు. తన దృష్టిలో ఇది చాలా గొప్ప ప్రదర్శనగా ఆనంద్ విశ్లేషించాడు.